Revenue Department: సివేరి సోమ కుమారుడికి గ్రేడ్-1 డీటీ పోస్టు
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:38 AM
మావోయిస్టుల దాడిలో మరణించిన నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్‌కు రెవెన్యూ శాఖలో గ్రేడ్-1 డిప్యూటీ తహసీల్దార్‌గా...
నాడు నక్సల్స్ చేతిలో బలైన అరకు మాజీ ఎమ్మెల్యే సోమ
సీఎం హామీ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల దాడిలో మరణించిన నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్‌కు రెవెన్యూ శాఖలో గ్రేడ్-1 డిప్యూటీ తహసీల్దార్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018, సెప్టెంబరు 28న నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఉన్న సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. సర్వేశ్వరరావు, సివేరి సోమ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించారు. సర్వేశ్వరరావుకు ఇద్దరు కుమారులు కాగా, చిన్నకుమారుడిని అప్పట్లోనే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు. సివేరి సోమ కుమారుడికి అప్పటికింకా తగిన వయస్సు, విద్యార్హతలు లేవు. ప్రస్తుతం సివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ ఎంబీఏ పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను జోన్-1లో డైరెక్ట్ రిక్రూటీ కోటాలో గ్రేడ్-1డిప్యూటీ తహశీల్దార్‌గా నియమిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీఓ-399) జారీ చేశారు. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.