AR Constable Prakash: థ్యాంక్యూ.. సీఎం సర్
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:31 AM
వైసీపీ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం తిరిగి విధుల్లోకి చేరారు.
విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్
అనంతపురం ఎస్పీని కలిసిన వైసీపీ బాధిత కానిస్టేబుల్ ప్రకాశ్
అనంతపురం క్రైం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం తిరిగి విధుల్లోకి చేరారు. తనకు తిరిగి ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సమస్యలపై ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం మూడేళ్ల కిందట కక్ష గట్టి విధుల నుంచి ఆయనను తొలగించింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన అభ్యర్థనను పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎస్పీ జగదీశ్ ఆయనకు విధులు అప్పగించారు. దీంతో కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయానికి ఉత్తర్వుల కాపీని తీసుకుని వెళ్లి ఎస్పీని కలిసి రిపోర్ట్ చేశారు. ఆయనను జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నియమించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తమకు సరెండర్, టీఏ, డీఏలు, మెడికల్ బిల్స్, ఇతర బకాయిలు ప్రతి ఏటా ఇచ్చేవారని తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అలవెన్సులు తీసేసి పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. 2022లో అప్పటి సీఎం జగన్ చెన్నేకొత్తపల్లికి రాగా, సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్లకార్డు పట్టుకున్నానని తెలిపారు. దీంతో తనపై కక్షగట్టి ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పారు. సీఎం చంద్రబాబు అప్పట్లో ఇచ్చిన మాట మీద నిలబడి.. తనను విధుల్లోకి తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు.