ఆక్వా అవస్థలు!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:51 AM
విదేశీ మారకద్రవ్యాన్ని పెద్దఎత్తున ఆర్జించిపెట్టే ఆక్వా సాగు అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో తెరపైకి వచ్చిన ఆక్వా జోన్ వివాదం నేటికీ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసైన్డ్ భూముల్లోని చెరువులకు రాయితీలు అందక భారీగా విద్యుత బిల్లులు వస్తున్నాయి. దీనికి తోడు నాణ్యమైన సీడ్ లభించ, వ్యాధులు వ్యాపించి తక్కువ సమయంలో పట్టుబడులు పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు గళం వినిపించారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఆక్వాకు అత్యవసరమని రైతులు కోరుతున్నారు.
-జిల్లాలో ఆక్వా జోన్ పరిధి గుర్తింపుపై ఆంక్షలు
-ముందుకు సాగని రొయ్యలు, చేపల చెరువుల రిజిస్ర్టేషన్ ప్రక్రియ
-అసైన్ట్ భూముల్లోని చెరువులకు లభించని విద్యుత రాయితీ
- రైతులకు లక్షల రూపాయలు వస్తున్న విద్యుత చార్జీలు
- దొరకని నాణ్యమైన సీడ్.. వేధిస్తున్న వ్యాధులు
- జిల్లాలో అధికారికంగా 37,500 ఎకరాల్లో సాగు
- అనధికారికంగా మరో 30 వేల ఎకరాల్లో..
- ఏటా 2.52 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి
విదేశీ మారకద్రవ్యాన్ని పెద్దఎత్తున ఆర్జించిపెట్టే ఆక్వా సాగు అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో తెరపైకి వచ్చిన ఆక్వా జోన్ వివాదం నేటికీ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసైన్డ్ భూముల్లోని చెరువులకు రాయితీలు అందక భారీగా విద్యుత బిల్లులు వస్తున్నాయి. దీనికి తోడు నాణ్యమైన సీడ్ లభించ, వ్యాధులు వ్యాపించి తక్కువ సమయంలో పట్టుబడులు పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై ఇటీవల జరిగిన డీఆర్‌సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు గళం వినిపించారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఆక్వాకు అత్యవసరమని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలో రొయ్యల సాగు గణనీయంగా తగ్గుతోంది. పెరిగిన విద్యుత చార్జీలు, మందుల ధరలు రైతులను రొయ్యల సాగు నుంచి దూరం చేస్తున్నాయి. విదేశీ మారకద్రవ్యాన్ని పెద్దఎత్తున ఆర్జించిపెట్టే రొయ్యల సాగుకు విద్యుత చార్జీల రూపంలో రాయితీలు ఇచ్చే అంశంలో మత్స్యశాఖ అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో రైతులు ఆక్వా సాగును చేయాలా, వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా నవంబరు నుంచి జూన్ నెలాఖరు వరకు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఆక్వా జోన్ అంశాన్ని తెరపైకితెచ్చి విద్యుత చార్జీలకు సంబంధించి రాయితీ రాకుండా చేసింది. కూటమి ప్రభుత్వం ఏడాది క్రితం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రొయ్యల చెరువులకు ఆక్వా జోన్ పరిధితో సంబంధం లేకుండా విద్యుత రాయితీలను అందించాలని నిర్ణయించింది. కానీ మత్స్యశాఖ ఈ హామీని అమలు చేయడంతో జాప్యం చేస్తోందని రైతులు అంటున్నారు.
ఆక్వా జోన్ గుర్తింపులో గజిబిజి
జిల్లాలో 111 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంబడి ఉన్న మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, కోడూరు, నాగాయలంక, మోపిదేవి మండలాలతో పాటు నందివాడ, గుడివాడ తదితర మండలాల్లోనూ రొయ్యల చెరువుల సాగు జరుగుతోంది. రెండు, మూడు సంవత్సరాల క్రితం వరకు 52 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది 37,500 ఎకరాల్లో మాత్రమే రొయ్యల సాగు జరిగిందని మత్స్యశాఖ అధికారులు అంచనాగా ఉంది. కానీ అనధికారికంగా అసైన్డ్ భూములు మరో 30 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఏటా జిల్లాలో 2.52 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. ఆక్వా జోన్‌లో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న భూములకే విద్యుత సబ్సిడీని ఇస్తామని, ఆక్వా జోన్‌లో ఆక్వా చెరువులు ఉన్నట్లుగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని ఇటీవల నిబంధనలను కఠినతరం చేశారు. గతంలో చెరువులు లీజుకు తీసుకున్న వారు లీజును రద్దు చేసుకుంటే, ఆ పత్రాలు చూపాలని, మళ్లీ కొత్తగా లీజుకు తీసుకుంటే సంబంధిత పత్రాలు చూపాలనే ఆంక్షలు పెడుతున్నారు. దీంతో రొయ్యలు, చేపల చెరువుల రిజిస్ర్టేషన్ ప్రక్రియకు ముందడుగు పడటంలేదు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యేలు కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకువచ్చారు. తీర ప్రాంతంలో అసైన్డ్ భూములే అధికంగా ఉన్నాయి. ఈ భూములకు సాగు నీటి లభ్యత, వరి సాగు చేసే అవకాశం లేకపోవడంతో రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేస్తున్నారు. గతంలో అసైన్డ్ భూముల్లో సాగు చేసే రొయ్యల చెరువులకు కూడా విద్యుత సబ్సిడీ ఇచ్చేవారు. ఆక్వా జోన్ అంశం తెరపైకి వచ్చాక అసైన్ట్ భూముల్లో సాగు చేసే రొయ్యల చెరువులకు విద్యుతపై రాయితీని నిలిపివేశారు. దీంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న భూములనే ఆక్వా జోన్ పరిధిలోకి తెచ్చి, 10 ఎకరాల్లోపు రొయ్యల చెరువులకు ఉన్న 4,344 కనెక్షన్లకు మాత్రమే విద్యుత రాయితీని ప్రస్తుతం ఇస్తున్నారు. ఆక్వా జోన్ నుంచి అసైన్డ్ భూములను తప్పించి విద్యుత రాయితీని ఎత్తివేయడంతో అసైన్డ్ భూముల్లో రొయ్యల సాగు చేస్తున్న ఆక్వా రైతులకు విద్యుత రాయితీ అందని పరిస్థితి నెలకొంది.
గతంలో రూ.50 వేలు.. ఇప్పుడు రూ.1.60 లక్షల విద్యుత బిల్లు
వైసీపీ ప్రభుత్వ హాయాంలో రొయ్యల సాగు చేసే అధికశాతం భూములను ఆక్వా జోన్ నుంచి వివిధ కారణాలతో మినహాయించారు. రైతులు ఆందోళనకు దిగితే రెండున్నర సంవత్సరాల క్రితం సముద్ర తీరం వెంబడి మండలాల్లో పనిచేసే వీఆర్వోలను కలెక్టరేట్‌కు పిలిపించి ఆక్వా జోన్ పరిధిలోకి కొంత భూమిని చేరుస్తామని ప్రకటించి సరిపెట్టారు. మత్స్య, విద్యుత, రెవెన్యూశాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదని రైతులు అంటున్నారు. గతంలో రొయ్యల చెరువులకు సంబంధించి యూనిట్‌కు విద్యుత బిల్లుగా రూ.3.84 చొప్పున, అదనపు చార్జీల పేరుతో మరో ఐదుపైసలు చేర్చి యూనిట్‌కు రూ.3.90 చొప్పున వసూలు చేసేవారు. 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా పది ఎకరాలకు విద్యుతను వాడుకుంటే ఒక్కో యూనిట్‌కు రూ.2.35 రాయుతీగా వచ్చేది. రాయితీ పోనూ నెలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు విద్యుత బిల్లులను చెల్లించేవారు. ఆక్వా జోన్‌లో భూమి నమోదు కాలేదనే కారణంతో విద్యుత రాయితీని ఎత్తివేయడంతో 100హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత వాడుకున్నందుకు నెలకు రూ.1.50 లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించాల్సి వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నెలకు లక్ష రూపాయలకు పైగా అదనంగా విద్యుత బిల్లుల రూపంలో చెల్లింపులు చేయాల్సి రావడంతో పెనుభారం పడుతోందని వాపోతున్నారు..
లభించని నాణ్యమైన సీడ్
రొయ్యల సాగులో విత్తనం (సీడ్) ఎంపిక కీలకం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న హేచరీల నుంచి ఉత్పత్తి అయ్యే సీడ్ గత రెండు, మూడు సంవత్సరాలుగా నాణ్యతతో ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. తల్లి రొయ్యలు(బ్రూడర్) నుంచి 10 సార్లు విత్తనం తీస్తే నాణ్యతతో ఉంటుందని, 15 సార్లు విత్తనం తీస్తున్నారని రైతులు అంటున్నారు. బ్రూడర్‌లు బలహీనపడిన తర్వాత వాటి నుంచి పరిమితికి మించి విత్తనం తీయడంతో నాణ్యమైన సీడ్ ఉత్పత్తి కావడం లేదని చెబుతున్నారు. ఈ తరహా సీడ్ తీసుకువచ్చి చెరువుల్లో వేస్తే 50 రోజులకే రొయ్యలకు వైట్‌కట్, మొప్పతెగులు, ఇతరత్రా వ్యాధులు సోకి చెరువులు పట్టుబడి చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.