Share News

APPSC Exam Results Delayed: పరీక్షలు సరే.. ఫలితాలేవీ

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:02 AM

రాష్ట్ర స్థాయిలో ఉన్నతోద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ఫలితాలు రోజులు, నెలలు కాదు..

APPSC Exam Results Delayed: పరీక్షలు సరే.. ఫలితాలేవీ

నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడంలో ఏపీపీఎస్సీ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి.. అన్నచందంగా వ్యవహరిస్తోంది. 2023లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. వివిధ కారణాలతో వాటి ఫలితాలు పెండింగులో ఉన్నాయి. మరోవైపు.. ‘కొత్త నోటిఫికేషన్లు’ అంటూ ఊరిస్తున్నా.. పాతవి తేల్చాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. అదేవిధంగా జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

  • 2023 నాటి నోటిఫికేషన్లలో 1,592 పోస్టుల భర్తీకి పరీక్షలు

  • వీటిలో గ్రూప్‌1, 2 పోస్టులే 994.. ఇప్పటికీ ఫలితాలు ఇవ్వని వైనం

  • క్రీడా కోటా జాబితాల్లో తీవ్ర జాప్యం.. ఏపీపీఎస్సీ వ్యవహారంపై విమర్శలు

  • జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు డిమాండ్లు.. త్వరలో 20 నోటిఫికేషన్లు, 80 పోస్టులు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయిలో ఉన్నతోద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు రోజులు, నెలలు కాదు.. ఏకంగా ఏళ్ల తరబడి ఆలస్యమవుతున్నాయి. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీపీఎస్సీ వివిధ దశల్లో 1,592 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. గ్రూప్‌-1 పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా చేపట్టింది. అయినా తుది ఫలితాలు ఎప్పుడు వస్తాయనే విషయంపై స్పష్టత ఇవ్వట్లేదు. కొన్ని నోటిఫికేషన్ల ఫలితాల ప్రక్రియ కొనసాగుతుండగా, పూర్తయిన నోటిఫికేషన్ల ఫలితాలు కూడా వివిధ కారణాలతో ఆగిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. ఈ ఫలితాలు వస్తే మళ్లీ కొత్త నోటిఫికేషన్లు వస్తాయని, తద్వారా ఉద్యోగావకాశం లభిస్తుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఫలితాలు త్వరగా విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం!

89 పోస్టులతో 2023లో విడుదల చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రక్రియ దాదాపుగా తుది దశకు చేరుకుంది. వాస్తవానికి ఈపాటికే ఫలితాలు విడుదల కావాల్సింది. కానీ, 89 పోస్టులలో రెండు స్పోర్ట్స్‌ కోటా పోస్టులు ఉండటంతో ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఆ రెండు పోస్టులకు 1:2 నిష్పత్తిలో నలుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాలి. దీనికిగాను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ(శాప్‌) తుది జాబితాను ఏపీపీఎస్సీకి పంపడంలో ఆలస్యం జరిగింది. ఈ జాబితాను ఇటీవల శాప్‌ ప్రభుత్వ కమిటీకి పంపింది. ఆ వివరాలు వస్తే నలుగురు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఫలితాలు ప్రకటిస్తారు.


  • 905 పోస్టులతో 2023లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ అయింది. దీనిలోనూ 21 క్రీడా కోటా పోస్టులున్నాయి. తుది క్రీడా జాబితా ఏపీపీఎస్సీకి అందాలి. మరోవైపు గ్రూప్‌-2లో హారిజంటల్‌ రిజర్వేషన్‌ అమలుపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చాక ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది.

  • ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 23 జూనియర్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయి. ఎంపిక జాబితాను రూపొందించాల్సి ఉంది.

  • కాలుష్య నియంత్రణ మండలిలో 39 పోస్టుల ఫలితాల విడుదల కావాలి. అయితే ఈ పోస్టులకు పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొందరు సమర్పించిన డిగ్రీలపై వివరణ కోరారు. అనంతరం ఏం జరిగిందో వెలుగు చూడలేదు.

  • మత్స్య శాఖ, ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ విభాగం, విద్యుత్‌ శాఖ, భూగర్భ జలవనరులు, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ, టౌన్‌ ప్లానింగ్‌, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

  • డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌ 290, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ 99, జూనియర్‌ లెక్చరర్స్‌కు సంబంధించి 47 పోస్టుల ఫలితాల కోసం కూడా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

  • 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌(డీఈవో) పోస్టులు, 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆగిపోయాయి.

  • 49 డిగ్రీ లెక్చరర్‌, 29 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు జరగాల్సిన పరీక్షలను పరిపాలనా కారణాల రీత్యా ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.


త్వరలో 20 నోటిఫికేషన్లు

ఈ ఫలితాల ప్రక్రియ పూర్తికాకముందే ఏపీపీఎస్సీ మరో 20 నోటిఫికేషన్లు జారీచేసేందుకు సిద్ధమైంది. అయితే, 20 నోటిఫికేషన్లు అయినా సుమారు 80 పోస్టులు మాత్రమే వాటిలో ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లలో ఎక్కువ ‘క్యారీ ఫార్వార్డ్‌’(గతంలో భర్తీకాకుండా మిగిలినవి) పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్లు పూర్తయితే ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అప్పగించిన బాధ్యత పూర్తవుతుంది. రెండు మూ డు నెలల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పురోగతిలో ఉన్న నోటిఫికేషన్లు పూర్తయితే కొత్త నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. గ్రూప్‌1, 2 నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తయి ఫలితాలు విడుదల చేస్తే ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలతో మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు కొత్త నోటిఫికేషన్ల కోసమే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ 791 పోస్టులతో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అటవీ శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ 100 పోస్టులకు మరో నోటిఫికేషన్‌ విడుదలైంది.

జాబ్‌ క్యాలెండర్‌ కోసం..

వైసీపీ హయాంలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పినా.. ఒకే ఒక్క ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. అయినప్పటికీ ఆ పోస్టులను సకాలంలో భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో ప్రస్తుత ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడంతో 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ అవుతున్నాయి. అయితే, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Updated Date - Sep 08 , 2025 | 04:02 AM