Minister Anagani Satya Prasad: నాలా రద్దు బిల్లుకు ఆమోదం
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:55 AM
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాలకు మార్పు) చట్టం-2006 రద్దు బిల్లును శాసనసభ ఏకగీవ్రంగా ఆమోదించింది. ఈ బిల్లును శుక్రవారం ఉదయం రెవెన్యూ మంత్రి...
భూవినియోగ మార్పిడి ఫీజు స్థానిక సంస్థలకే
ఈ ఫీజు ఎంత ఉండాలో అవే నిర్ణయిస్తాయి
పెండింగ్‌లో ఉన్న నాలా దరఖాస్తులు 1,281
రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి (వ్యవసాయేతర అవసరాలకు మార్పు) చట్టం-2006 రద్దు బిల్లును శాసనసభ ఏకగీవ్రంగా ఆమోదించింది. ఈ బిల్లును శుక్రవారం ఉదయం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనసభలో ప్రవేశపెట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ వినియోగ మార్పిడి ఫీజును స్థానిక సంస్థలకే అప్పగిస్తామని అనగాని తెలిపారు. ఫీజు ఎంత అన్నది పంచాయతీ, నగరపాలక సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. నాలా చట్టాన్ని అడ్డంపెట్టుకొని కొందరు అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని, మరి కొన్నిచోట్ల భూ వినియోగ మార్పిడిలో మితిమీరిన జాప్యం జరిగిందని చెప్పారు. దీనివల్ల అనేక సమస్యలు వచ్చాయని మంత్రి సభకు వివరించారు. చట్టం అమల్లో ఉండగా వచ్చిన నాలా దరఖాస్తుల్లో 1,281 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని ఈ చట్టం పరిధిలోనే సెటిల్ చేస్తామని, ఫీజుల చెల్లింపునకు ఏడాది గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ
అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఐఐయూఎల్‌ఈఆర్)ను ఏర్పాటు బిల్లును కూడా సభ ఏకగీవ్రంగా ఆమోదించింది. మంత్రి లోకేశ్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చొరవతోనే రాష్ట్రానికి అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వస్తోందని మంత్రి వెల్లడించారు. శాసనసభ తరపున గవర్నర్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ వర్సిటీలో 20శాతం సీట్లు ఏపీ విద్యార్ధులకే కేటాయించామన్నారు. న్యాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్‌డీ, పరిశోధన వంటి అనేక అవకాశాలు ఉన్నాయని, అడ్మిషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుందని భరోసా ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. బార్ కౌన్సిల్ ట్రస్టుకు చెందిన ఈ వర్సిటీకి డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని, లోకల్ కోటాను మరింతగా పెంచాలని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేటు వర్సిటీల చట్టానికి సవరణ
ప్రైవేటు యూనివర్సిటీల చట్టం-2016 సవరణ బిల్లును శాసనసభ ఏకగీవ్రంగా ఆమోదించింది. ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే అప్పటికే ఉన్న 100 ఉత్తమ విశ్వవిద్యాలయాల ధ్రువీకరణ తప్పనిసరి అనే నిబంధనను తొలగిస్తూ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ నిబంధన నూతన విద్యాలయాల ఏర్పాటునకు తీవ్ర అడ్డంకిగా ఉందని, గత ప్రభుత్వం అనాలోచితంగా ఈ క్లాజు తీసుకొచ్చిందని అందుకే దాన్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఈ చట్ట సవరణ వల్ల ప్రస్తుతం ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలు ప్రైవేటు వర్సిటీలుగా మారడానికి ఆరేడు సంవత్సరాల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తాజా డీఎస్సీ కూటమి ప్రభుత్వానికి గర్వకారణమన్నారు. ఇకపై ఏటా డీఎస్సీ ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా తమ విభాగాన్ని సన్నద్ధం చేసుకుంటామని లోకేశ్ తెలిపారు.