Mega DSC: కొత్త టీచర్లు వచ్చేస్తున్నారు
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:35 AM
టీచర్ ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వారి కల నెరవేరే వేళయింది. 15,941 మంది ఉపాధ్యాయులుగా గురువారం నియామక పత్రాలు అందుకోబోతున్నారు.
15,941 మందికి నేడేనియామక పత్రాలు.. అమరావతి సభలో అందజేత
కొత్త టీచర్లలో సగం మంది మహిళలు
టాపర్లుగా నిలిచిన 16 మంది సహా
22 మందికి పత్రాలు ఇవ్వనున్న సీఎం
తక్కినవారికి అందించనున్న అధికారులు
పాల్గొననున్న పవన్ కల్యాణ్, లోకేశ్
హాజరవనున్న ఎమ్మెల్యేలు, నేతలు
34 వేల మంది కోసం ప్రాంగణం సిద్ధం
47 ఉద్యోగాలకు 10 నోటిఫికేషన్లు
వేర్వేరు శాఖల్లో భర్తీకి ఏపీపీఎస్సీ రెడీ
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీచర్ ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వారి కల నెరవేరే వేళయింది. 15,941 మంది ఉపాధ్యాయులుగా గురువారం నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ఇటీవల మెగా డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం.. ఎంపికైనవారందరికీ అమరావతిలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేయనుంది. అతిత్వరలోనే వీరంతా ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టబోతున్నారు. దీనికోసం అమరావతిలో సచివాలయం పక్కనే భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ జరుగుతుంది. సబ్జెక్టులవారీగా రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన 16మంది సహా 22 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి అదే ప్రాంగణంలోఅధికారులు పత్రాలు ఇస్తారు. కొత్త టీచర్లు వారితోపాటు మరొక కుటుంబసభ్యుడిని తీసుకొచ్చే అవకాశం కల్పించారు. దీంతో మొత్తంగా 34వేల మంది సభా ప్రాంగణంలో ఉంటారు. టీచర్లకు జిల్లాలవారీగా వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. అక్కడే ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ వైపు నుంచి వచ్చేవారికి గుంటూరులో, ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చేవారికి విజయవాడలో బస ఏర్పాటుచేశారు.
వర్గీకరణ అమలైన తొలి డీఎస్సీ..
మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. 16,341 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వంలోని పది మేనేజ్‌మెంట్లలో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికోసం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు రాష్ట్రవ్యాప్తంగా సీబీటీ విధానంలో పరీక్షలు జరిగాయి. టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఇచ్చారు. నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. పరిశీలనలో అన్ని అర్హతలూ ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ డీఎస్సీలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణ అమలైంది. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ కూడా వర్తింపజేశారు. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక 406 పోస్టులు మిగిలిపోయాయి. ఎంపికైనవారిలో 49.9శాతం మహిళలు, 50.1శాతం పురుషులు ఉన్నారు.
అత్యంత వేగంగా భర్తీ ప్రక్రియ
సాధారణంగా ఒక డీఎస్సీ పూర్తికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. గతంలో ఎప్పుడూ ఒక సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్ అదే సంవత్సరంలో పూర్తికాలేదు. అందులోనూ 16,341 పోస్టులతో మెగా డీఎస్సీ కావడంతో ఇంకా ఆలస్యం అవుతుందని అంతా భావించారు. కానీ పాఠశాల విద్యాశాఖ పక్కా ప్రణాళిక అమలుచేసింది. డీఎస్సీ ప్రారంభమయ్యాక ఎలాంటి అవరోధాలు వస్తాయనేదానిపై ముందుగానే కసరత్తు నిర్వహించింది. సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత నోటిఫికేషన్ జారీచేసింది. అయినా రకరకాల అంశాలపై న్యాయస్థానాల్లో వందకు పైగా పిటిషన్లు పడ్డాయి. వాటిని అధిగమించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేయడం ఇదే తొలిసారి.
47 ఉద్యోగాలకు 10 నోటిఫికేషన్లు
విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. అక్టోబరు 29 వరకు దరఖాస్తులు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల్లో 47 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం 10 నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ శాఖల్లో 11 ఏఈ, రవాణా శాఖలో ఒక ఏఎంవీ, జైళ్ల శాఖలో ఒక జూనియర్ అసిస్టెంట్, మత్స్యశాఖలో మూడు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ సిటిజన్ల శాఖలో ఒక గ్రేడ్-1 వార్డెన్, గనుల శాఖలో ఒక రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీస్ విభాగంలో ఒక ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ శాఖలో ఒక గ్రేడ్-2 జూనియర్ అకౌంటెంట్, నాలుగు గ్రేడ్-3 సీనియర్ అకౌంటెంట్, ఆరు జూనియర్ అకౌంటెండ్ గ్రేడ్-4, సైనిక సంక్షేమం విభాగంలో ఏడు జిల్లా సైనిక్ ఆఫీసర్, 10 వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేసింది. గురువారం (ఈ నెల 25) నుంచి అక్టోబరు 29 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది.
డీఎస్సీ అంటే టీడీపీ..
రాష్ట్ర చరిత్రలో డీఎస్సీ అంటే టీడీపీ అనే ముద్ర పడింది. 1994 నుంచి ఇప్పటివరకూ అత్యధిక డీఎస్సీలు ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. 14 డీఎస్సీలు ప్రకటించి 1,96,619 మంది టీచర్లను నియమించిన ఘనత టీడీపీకి దక్కింది. గత వైసీపీ ప్రభుత్వంలోనే టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నా నిర్లక్ష్యంచేశారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎన్నికలకు కొద్దినెలల ముందు 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించింది. కానీ నిబంధనల గందరగోళంతో అది ఆదిలోనే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారు. ఆ వెంటనే నోటిఫికేషన్‌కు సిద్ధమైనా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో కొంత ఆలస్యమైంది.