AP Constable Recruitment: 16న ‘కానిస్టేబుల్’ నియామక పత్రాలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:55 AM
రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ముహూర్తం ఖరారైంది.
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
మంగళగిరి సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో జరిగే కార్యక్రమంలో ఈ నెల 16న నియామక పత్రాలు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శనివారం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సభా వేదిక నిర్మాణాన్ని, వేదిక వద్దకు చేరుకునే మార్గాలు, మార్కింగ్ ప్రదేశాలు, వీవీఐపీ, వీఐపీల కోసం చేస్తున్న ఏర్పాట్లు, ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థులకు, వారి బంధువులకు, బందోబస్తుకు వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి కల్పించవలసిన వసతులు తదితర అంశాలను సమీక్షించారు. అలాగే, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ ఏపీఎస్పీలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.