Inter District Teacher Transfers: టీచర్లకు అంతర్‌జిల్లాల బదిలీలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:20 AM
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది...
షెడ్యూలు, మార్గదర్శకాలు విడుదల
నేటి నుంచి 24 వరకు దరఖాస్తులు
30 తర్వాత బదిలీల ఆదేశాలు జారీ
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ శాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు షెడ్యూలు విడుదల చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అర్హులైన టీచర్లు గురువారం(21) నుంచి 24వ తేదీ వరకు ‘లీప్’ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆ దరఖాస్తుల ప్రింట్‌ను ఎంఈవోలకు సమర్పించాలని, వారు 22 నుంచి 25 వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం వీటిని 26వ తేదీ వరకు డీఈవోలు పరిశీలించనున్నట్టు తెలిపారు. దరఖాస్తులను 27న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు డీఈవోలు సమర్పిస్తారని, 28, 29 తేదీల్లో మరోసారి రాష్ట్రస్థాయిలో పరిశీలించి, తుది జాబితా రూపొందించనున్నట్టు వివరించారు. 30న ఆ జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత బదిలీల ఆర్డర్లు జారీచేస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ విధానంలో లీప్ యాప్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ స్పష్టం చేశారు. ఒక టీచర్ ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించలేరని తెలిపారు.
ఇవీ అర్హతలు
అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అర్హులు.
ఈ ఏడాది జూలై 31 నాటికి ప్రస్తుత జిల్లాలో, ప్రస్తుత కేటగిరీలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, హెచ్‌వోడీలు, సచివాలయ, స్థానిక సంస్థల ఉద్యోగుల జీవిత భాగస్వాములు దరఖాస్తుకు అర్హులు. జిల్లాలో ఖాళీలుంటేనే దరఖాస్తు చేసుకోవాలి.
హెచ్‌వోడీలు, సచివాలయ ఉద్యోగుల జీవిత భాగస్వాముల కోటాలో దరఖాస్తులకు కృష్ణా, గుంటూరు జిల్లాల వారు మాత్రమే అర్హులు.
ఒకే కేటగిరీ, ఒకే మేనేజ్‌మెంట్‌లో పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఇద్దరు టీచర్లు బదిలీకి సమ్మతి తెలుపుతూ, దానికి ఎంఈవో లేదా డీవైఈవో ఆమోదం పొందాలి.
పరస్పర బదిలీల్లో ఒక టీచర్, ఇతర జిల్లాల్లో పనిచేసే మరో టీచర్‌తో బదిలీకి మాత్రమే సమ్మతి తెలపాలి.
అనధికారికంగా సెలవులో ఉన్నవారు, ఏపీసీసీఏ రూల్స్ కింద అభియోగాలు నమోదైనవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు అనర్హులు.