Equipment Shortage: చూడలేని సీసీలు..తూయలేని వే బ్రిడ్జ్‌లు
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:54 AM
ఇసుక అక్రమంగా బయటకు పోకుండా కాపాడతామంటూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి విభాగం (ఏపీఎండీసీ) బాగానే హడావుడి చేసింది. చూడలేని సీసీ కెమెరాలు...
దొంగల్ని పట్టలేదుగానీ కొత్త దోపిడీకి ద్వారాలు
ఏపీఎండీసీ నిర్వాకంతో రూ.100 కోట్లు వృథా
నాసిరకం కొని రూ.కోట్లు జేబులో వేసుకున్న వైనం
పట్టించుకోకపోవడంతో పరికరాలకు తుప్పు
కెమెరాలు, సోలార్ యూనిట్‌లు దొంగలపాలు
(తెనాలి - ఆంధ్రజ్యోతి)
ఇసుక అక్రమంగా బయటకు పోకుండా కాపాడతామంటూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి విభాగం (ఏపీఎండీసీ) బాగానే హడావుడి చేసింది. చూడలేని సీసీ కెమెరాలు... బరువు కాటా వెయ్యలేని వే బ్రిడ్జ్‌లతో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ‘ప్రయాస’ పడింది. అక్రమంగా ఇసుకతో వాహనాలు వెళుతున్నా ఆపలేని చెక్‌పో్‌స్టలు... విద్యుత్తు సరఫరా చెయ్యలేని సోలార్ యూనిట్‌లు... వీటన్నిటికీ మించి నిఘా పర్యవేక్షణ కోసం రాష్ట్రం మొత్తం మీద ఐదు వేలకుపైగా తాత్కాలిక సిబ్బంది నియామకం... ఇలా చేసిన ఏర్పాట్లేవీ దొంగలను పట్టలేదుగానీ కొత్త దోపిడీ పద్ధతులకు మాత్రం తలుపులు తెరిచాయి. నాసిరకం పరికరాలు కొని రూ.కోట్లు ఆనాటి నేతలు, ఏపీఎండీసీ ఎండీ స్థాయి అధికారి జేబులో వేసుకున్నట్టు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఏపీఎండీసీ చేసిన పాపాలకు సాక్ష్యంగా ఇప్పుడు ఇసుక రీచ్‌లలో ఉన్న పరికరాలు తుప్పు పడుతున్నాయి. కెమెరాలు, సోలార్ పరికరాలు దొంగలపాలయ్యాయి. దొంగలు దోచిందిపోగా, మిగిలిన పరికరాలనయినా తర్వాత సద్వినియోగం చేశారా! అంటే అదీలేదు. సిబ్బందికోసం ఏర్పాటు చేసిన కంటైనర్ క్యాబిన్‌లు పాడయిపోతున్నాయి.
దోచేయ్.. దాచేయ్...
గత ప్రభుత్వంలో తొలి సంవత్సరంపాటు ఏపీఎండీసీ కిందే ఇసుక రీచ్‌ల నిర్వహణ కొనసాగింది. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీలకు ఆ బాధ్యతను అప్పగించారు. తన పరిధిలో ఉన్నప్పుడు సైతం ఒక్కరోజు కూడా ఇసుక రీచ్‌లను ఏపీఎండీసీ పర్యవేక్షించింది లేదు. అసలు ఒక్క కెమెరా కూడా అప్పట్లో పనిచేయలేదు. ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే నదిలోని వాటిని దొంగలు ఎత్తుకుపోయారు. ప్రైవేటు సంస్థ ప్రవేశించాక సర్వ హక్కులు తమకే అన్నట్టు ఆ సంస్థ సిబ్బంది మిగిలినవాటినీ లేపేశారు. ఇక సోలార్ ప్యానెళ్ల పరిస్థితి సరేసరి. చాలావరకు ఏపీఎండీసీ ఉద్యోగులే పంచుకున్నారనే విమర్శ అప్పుడే వచ్చింది. వీటికి విద్యుత్తు బ్యాకప్ కోసం ఉపయోగించే బ్యాటరీలు కూడా మాయం చేశారని కొందరు చెబుతుంటే, అసలు బ్యాటరీలే ఏర్పాటు చేయలేదని ఆ సంస్థలోని సిబ్బంది చెప్పడం అప్పట్లో దుమారం రేపింది. క్యాబిన్‌లు వందల సంఖ్యలో ఉండాల్సిఉండగా, కృష్ణా నది దిగువున కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఉన్నవి కూడా తుప్పు పట్టిపోతుంటే, వాటిని ఇతర అవసరాలకు వాడుకోవటం కానీ, అవసరం లేదనుకుంటే వేలం వేయటం వంటివికూడా ఏపీఎండీసీ చేయలేదు. చెక్‌పోస్టుల దగ్గర కెమేరాలు, ఇతర పరికరాలన్నీ మాయమైపోతే, కేవలం ఒక్క పైపు మాత్రం మిగిలింది. కొన్నిచోట్లయితే వాటి ఆనవాళ్లుకూడా లేకుండా ఎత్తుకుపోయారు. వే బ్రిడ్జ్‌లు కాటావేసి తూకం రసీదు ఇచ్చిన పాపానపోలేదు. కాటా వేసేందుకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్ వంటివి అమర్చకపోవడం దీనికి కారణం. ఈ వ్యవహారంపై అప్పట్లో టీడీపీ నాయకులు ఆందోళన చేశారు. ఇప్పుడు అవికూడా నదిలో వరదలు, వర్షాలు వచ్చినప్పుడు తడిచి పాడయిపోతున్నాయి.