MD Nagalakshmi: ఏపీ జెన్‌కోను అగ్రగామిగా నిలుపుతాం
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:49 AM
దేశంలో ఏపీ జెన్‌కోను అగ్రగామిగా నిలుపుతామని ఆ సంస్థ ఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు.
వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్: నాగలక్ష్మి
జెన్‌కో ఎండీగా బాధ్యతల స్వీకరణ
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): దేశంలో ఏపీ జెన్‌కోను అగ్రగామిగా నిలుపుతామని ఆ సంస్థ ఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడలోని విద్యుత్తు సౌధలో ఏపీ జెన్‌కో ఎండీగా బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నాగలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు 24/7 నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్తును అందించడానికి, పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను అందుకోవడానికి అవసరమైన విద్యుత్తును జెన్‌కో ఆధ్వర్యంలోని థర్మల్, హైడల్, సౌర విద్యుత్తు కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జెన్‌కో యూనిట్ల నుంచి గరిష్ఠ విద్యుత్తు ఉత్పత్తి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని, నూతనంగా రాబోతున్న ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల పునరుద్ధరణ, ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. వీలైనంత వరకు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కచ్చితంగా అనుసరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.