Share News

అడ్మిషన్లపై అనాసక్తి!

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:09 AM

కృష్ణా యూనివర్సిటీలో ఈ ఏడాది వివిధ పీజీ కోర్సుల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేదు. నూతన కోర్సులు ప్రవేశపెడుతున్నామని వర్సిటీ అధికారులు ప్రచారం చేసినా అడ్మిషన్‌లు పెరగలేదు. మంగళవారం నుంచి పలు కోర్సుల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, కామర్స్‌ కోర్సుల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే చేరారు. దీంతో ఈ తరగతులను నిర్వహిస్తారా లేక రద్దు చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే వర్సిటీ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం రెండేళ్ల తర్వాత బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

అడ్మిషన్లపై అనాసక్తి!

- కృష్ణా వర్సిటీలోని పీజీ కోర్సులపై ఆసక్తిచూపని విద్యార్థులు

- కామర్స్‌ కోర్సులో 33 సీట్లకు ఒక్కరే చేరిక

- ఇంగ్లీషు, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ విభాగాల్లోనూ ఇద్దరు, ముగ్గురు, నలుగురే..

- మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం

- రెండేళ్ల తర్వాత నేడు అకడమిక్‌ సెనెట్‌ సమావేశం

- 12 ఏళ్లుగా మారని సెనెట్‌ సభ్యులు

- సమావేశంలో చర్చించే అంశాలపై సర్వత్రా ఆసక్తి

కృష్ణా యూనివర్సిటీలో ఈ ఏడాది వివిధ పీజీ కోర్సుల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరలేదు. నూతన కోర్సులు ప్రవేశపెడుతున్నామని వర్సిటీ అధికారులు ప్రచారం చేసినా అడ్మిషన్‌లు పెరగలేదు. మంగళవారం నుంచి పలు కోర్సుల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, కామర్స్‌ కోర్సుల్లో ఇద్దరు, ముగ్గురు మాత్రమే చేరారు. దీంతో ఈ తరగతులను నిర్వహిస్తారా లేక రద్దు చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే వర్సిటీ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం రెండేళ్ల తర్వాత బుధవారం జరగనుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

కృష్ణా యూనివర్సిటీలో వివిధ పీజీ కోర్సుల అడ్మిషన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఈ నెల 17వ తేదీ వరకు గడువు పెట్టింది. 18న దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, 19న ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌, దివ్యాంగుల కోటా సర్టిఫికెట్ల పరిశీలన, వివిధ కోర్సులలో చేరేందుకు వెెబ్‌ఆప్షన్‌లు పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చింది. 22న సీట్ల కేటాయింపు, 23 నుంచి 25లోపు వివిధ కోర్సులలో చేరిన విద్యార్థులు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మంగళవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి జాయింట్‌ డైరెక్టర్‌ మంగళవారం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులలో బుధవారం లోపు వివిధ కోర్సులలో చేరని వారి అడ్మిషన్‌లను రద్దు చేయాలని స్పష్టం చేశారు.

చేరింది వీరే..

వర్సిటీలోని కామర్స్‌ విభాగంలో 33 సీట్లు ఉండగా ఒక్కరు మాత్రమే చేరారు. ఇంగ్లీష్‌ విభాగంలో 33 సీట్లకు ఇద్దరు, ఫిజిక్స్‌ విభాగంలో 33 సీట్లకు ముగ్గురు, మ్యాథ్స్‌ విభాగంలో 33 సీట్లకు నలుగురు మాత్రమే చేరారు. ఆర్గానిక్‌ కెమిసీ్ట్ర విభాగంలో 40 సీట్లకు 37 మంది, అనలాటికల్‌ కెమిస్ర్టీ విభాగంలో 40 సీట్లకు 36 మంది, జువాలజీ విభాగంలో 33 సీట్లకు 20 మంది, బోటనీ విభాగంలో 33 సీట్లకు 27 మంది చేరారు. యూనివర్సిటీలో తొమ్మిది పీజీ కోర్సుల్లో 322 సీట్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, కేవలం 158 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సగం సీట్లు మిగిలిపోయాయి. యూనివర్సిటీలో చేరేందుకు వచ్చిన విద్యార్థులు హాస్టల్‌ వసతి లేకపోవడంతో విముఖత చూపుతున్నారు. ఈ 158 మందిలో ఎంత మంది బుధవారం లోగా యూనివర్సిటీలో రిపోర్టు చేస్తారో కూడా తెలియనిస్థితి నెలకొంది. ఎంఏ ఇంగ్లీష్‌ కోర్సులో గత నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు, లేక ముగ్గురే చేరుతున్నారు. వీరికి ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు పాఠాలు బోధిస్తున్నారు. ఏడాదికి ఈ కోర్సు నిర్వహణకు రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేయడం గమనార్హం. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ కోర్సును బోధించేందుకు ఒక అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఉన్నారు. విద్యార్థులు ఇద్దరికి మించి లేకపోవడంతో సంబంధిత అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇతర పనులు అప్పగించారు.

నేడు అకడమిక్‌ సెనెట్‌ సమావేశం

వర్సిటీ అకడమిక్‌ సెనెట్‌ సమావేశం బుధవారం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరగనుంది. 2013లో యూనివర్సిటీ అకడమిక్‌ సెనెట్‌ సభ్యులను నియమించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఈ సెనెట్‌ సభ్యుల్లో మార్పులు, చేర్పులు చేయాలి. కానీ గత 12 ఏళ్లుగా పాత సభ్యులే కొనసాగుతున్నారు. విద్య, పారిశ్రామిక, సాంస్కృతిక, సేవా తదిరత రంగాల్లో విశిష్టసేవలు అందించి, ప్రఖ్యాతిగాంచిన వారిని ఈ సెనెట్‌లో సభ్యులుగా నియమిస్తారు. ఎప్పటికప్పుడు విద్యారంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఈ సెనెట్‌లోని సభ్యులు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే 2013లో నియమితులైన సెనెట్‌ సభ్యుల్లో కొందరు తమ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందడం, మరికొందరు విదేశాలకు వెళ్లిపోవడం వంటి ఘటనలు కూడా జరిగాయి. 2023లో అప్పటి వీసీ జ్ఞానమణి అకడమిక్‌ సెనెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత రెండేళ్లుగా ఈ సమావేశం జరగనేలేదు. బుధవారం జరిగే సమావేశానికి ఎంతమంది సభ్యులు హాజరవుతారనే అంశంపైనా స్పష్టత లేదు. ఈ సమావేశం జరిగితే గతంలో యూనివర్సిటీలో రద్దు చేసిన ఎం-ఫార్మసీ కోర్సును తిరిగి పునరుద్ధరించే అంశంతోపాటు వ్యాయామ విద్యకు సంబంధించిన కోర్సును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పునాదుల దశలో ఆగిపోయిన ఇంజనీరింగ్‌ కళాశాల, బాలుర వసతి గృహానికి సంబంధించిన భవనాల నిర్మాణం మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Updated Date - Sep 24 , 2025 | 01:09 AM