Free Bus Scheme: కదిలిన స్త్రీ శక్తి
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:06 AM
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) విజయవంతంపై శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల...
ఉచిత బస్సు విజయవంతంపై పలుచోట్ల ర్యాలీలు
భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళా లోకం
నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
హామీలన్నీ నెరవేరుస్తున్నాం: మంత్రి నారాయణ
చంద్రబాబు ఎప్పటికీ మహిళా పక్షపాతే..
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
చంద్రగిరిలో ర్యాలీకి పోటెత్తిన నారీమణులు
నెల్లూరురూరల్/కొలిమిగుండ్ల/చంద్రగిరి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి పథకం) విజయవంతంపై శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, నాయకులతో పాటు మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. నెల్లూరులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నెల్లూరు నగర టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ శక్తి ర్యాలీలో మంత్రి నారాయణ, రమాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తన అపార అనుభవంతో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పేద, నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేవని తెలిపారు. చెప్పిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహణ ద్వారా దాదాపు 16 వేల మంది నూతన ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి కావొచ్చాయన్నారు. నగరంలోని గాంధీబొమ్మ నుంచి పప్పుల వీధి వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు ధన్యవాదాలు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో జరిగిన ఉచిత బస్సు విజయోత్సవ ర్యాలీలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీకి మండల వ్యాప్తంగా మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎప్పటికీ మహిళా పక్షపాతిగా ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీ చేపట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు ధన్యవాదాలు చెబుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పులివర్తి నాని, తుడా చైర్మన్ దివాకరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, నాని సతీమణి సుధారెడ్డి పాల్గొన్నారు.