CM chandrababu: మిగులు జలాలపై హక్కు మాకే
ABN , Publish Date - Jul 16 , 2025 | 03:21 AM
నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ
అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90-120 రోజుల మిగులు
దానిని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు కీలకం
200 టీఎంసీల వరద జలాల తరలింపునకు రూపకల్పన
ధ్వంసమైన ఎకానమీని కేంద్ర సహకారంతో గాడినపెడుతున్నాం
ఇప్పటికీ ఆర్థిక వనరుల కొరత మరింతగా సాయం చేయండి: సీఎం
అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిపై ప్రధానికి, షాకు కృతజ్ఞతలు
వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ ముఖ్యమంత్రి సమావేశం
నేటి సీఎంల భేటీ ఎజెండాలో బనకచర్ల వద్దు
కేంద్రానికి తెలంగాణ సీఎస్ లేఖ
న్యూఢిల్లీ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందన్నారు. మంగళవారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో సీఎం కలుసుకున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఉభయులూ చర్చించారు. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను వివరించారు. ఏడాదిగా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పటికీ ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా ఉందని.. కేంద్రం నుంచి మరింతగా సాయం అందించాలని ప్రత్యేకంగా కోరారు. విభజన వల్ల ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయించాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించామని తెలిపారు. అంతకుముందు.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు, కేంద్ర ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సానా సతీశ్ ఉన్నారు.
రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలపై చర్చ..
అంతకుముందు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. తన నివాసంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్‌తో సమావేశమయ్యారు. ఏపీలో ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. రాయలసీమ ప్రాంతంలో రక్షణ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం తెలిపారు. ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ వికాస్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణానికి సహకారంపై చర్చించారు.
అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఈ నెల 8న అశ్వినీ తండ్రి దౌలాల్ వైష్ణ వ్ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం కేంద్ర మంత్రి అశ్వినీ నివాసానికి చేరుకున్న చంద్రబాబు దౌలాల్ వైష్ణవ్ చిత్రపటానికి నివాళుర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.