AP Waqf Board: ఏడాదిలో 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించాం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:00 AM
ఏపీ వక్ఫ్‌బోర్డు ఏడాదికాలం పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీచేసి, 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం అని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
650 కోట్లు విలువైన 89 అక్రమ సేల్ డీడ్లు రద్దు
ఆదాయం పెంపునకు ఈ టెండరింగ్ అమలు
ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్
విజయవాడ(వన్‌టౌన్), డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ వక్ఫ్‌బోర్డు ఏడాదికాలం పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీచేసి, 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టాం’ అని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన 9వ బోర్డు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజీజ్ మాట్లాడారు. ‘వక్ఫ్ పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పరిపాలన తీసుకొచ్చాం. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నాం. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.650 కోట్ల విలువైన వక్ఫ్ భూమి విషయంలో జరిగిన 89 అక్రమ సేల్ డీడ్లను రద్దు చేయించాం. వక్ఫ్ బోర్డు చరిత్రలో తొలిసారిగా ఈ-టెండరింగ్ విధానం అమలు చేసి హుండీలు, వాణిజ్య ఆస్తుల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూర్చాం. గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం సాధించి, దాదాపు 46 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేశాం. సంక్షేమ రంగంలో భాగంగా ఇమామ్‌లు, మౌజాన్లకు పెండింగ్ ఉన్న 18 నెలల గౌరవ వేతనాలను రూ.1.35 కోట్లతో పూర్తిగా చెల్లించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, మంత్రి లోకేశ్ సహకారంతో వక్ఫ్ బోర్డును మరింత బలోపేతం చేస్తాం’ అని అజీజ్ తెలిపారు.