Share News

Krishna Water Tribunal: మా నీళ్లను లాక్కుపోతే..మేం అడుక్కు తినాలా?

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:26 AM

వందేళ్ల కిందట కేటాయించిన నీటిని లాక్కుంటే తాము అడుక్కుతినాలా అని ఆంధ్రప్రదేశ్‌ నిలదీసింది. కృష్ణా జలాల పునఃసమీక్షపై జస్టిస్‌...

Krishna Water Tribunal: మా నీళ్లను లాక్కుపోతే..మేం అడుక్కు తినాలా?

  • వందేళ్ల నాటి కేటాయింపులను ఎలా కుదిస్తారు?.. కృష్ణా ట్రైబ్యునల్‌-2లో నిలదీసిన ఆంధ్రప్రదేశ్‌

అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): వందేళ్ల కిందట కేటాయించిన నీటిని లాక్కుంటే తాము అడుక్కుతినాలా అని ఆంధ్రప్రదేశ్‌ నిలదీసింది. కృష్ణా జలాల పునఃసమీక్షపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ సారథ్యంలోని కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్‌-2 విచారణలో రెండో రోజు బుధవారం కూడా ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా గట్టిగా వాదనలు వినిపించారు. నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్‌ -1, ట్రైబ్యునల్‌-2 ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు ఆస్కారమే లేదన్నారు. ‘రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయమే ఆధారంగా మారింది. తెలంగాణ ఇటు నదీ జలాల విషయంలోనూ, ఆర్థికంగానూ సంపూర్ణ పరిపుష్టి కలిగి ఉంది. ఆ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్‌, ప్రపంచశ్రేణి ఐటీ కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ వ్యవసాయంతో సహా పరిశ్రమలూ ఉండడంతో ఆర్థికంగా బలోపేతమవుతోంది. కానీ ఏపీకి రాజధానీ లేదు. పరిశ్రమలు కూడా లేవు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో మాకు ఉన్న నీటి కేటాయింపులను కూడా కుదిస్తే ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్లిపోతాం’ అని వివరించారు. తెలంగాణకు ఇలాంటి ఇబ్బందులేవీ లేవన్నారు. కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్న ఆ రాష్ట్రం.. గోదావరి జలాల గురించి దాస్తోందన్నారు. రెండు నదుల జలాలను కలిపి చూస్తే తెలంగాణకు నీటికి లోటే లేదన్నారు.


కేటాయింపులను పునఃసమీక్షించరాదు

రాష్ట్ర విభజన జరిగాక చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు ట్రైబ్యునళ్లు కేటాయించిన నీటిని పునఃసమీక్షించేందుకు వీల్లేదని గుప్తా తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో గత కేటాయింపులను మార్చేందుకు వీల్లేదని చెప్పారు. ‘ సాగర్‌ జలాలు పూర్తిగా వ్యవసాయానికే వినియోగించాల్సి ఉంది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లో గ్లోబర్‌ ఐటీ సంస్థలన్నీ పెట్టుబడులు పెట్టాయి. ఆర్థికంగా సుసంపన్నమైన హైదరాబాద్‌ రాజధానిగా తెటంగాణలోనే ఉంది. ఏపీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో రాజధానిని నిర్మించుకోలేకపోయింది. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి మాది. ఆర్థిక లోటుతో ఉంది. అందువల్ల గతంలో ట్రైబ్యునళ్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులకు కేటాయించిన నీటిలో కోత పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. రాష్ట్రంలో 150 ఏళ్ల కిందటే సాగునీటి పారుదల విధానాలను నిర్దేశించారు’ అని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు ముందున్న ఉమ్మడి రిజర్వాయర్లకు కేటాయింపులు కుదించేందుకు వీల్లేదని పునరుద్ఘాటించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు పులిచింతల కూడా ఉమ్మడి ప్రాజెక్టుల పరిధిలోకి వస్తుందన్నారు. ‘విభజన చట్టంలోని క్లాజ్‌-21లో తుంగభద్ర నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల్లో 33 టీఎంసీలు ఆవిరి నష్టాలుగా ట్రైబ్యునళ్లు పేర్కొన్నాయి. సాగర్‌ ఎడమ కాలువ ద్వారా 121 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు కేటాయించాయి. కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రం వాటా 811 టీఎంసీల్లో.. రాష్ట్ర విభజన తర్వాత 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. 5 టీఎంసీలను చెన్నైకి తాగునీటికి కేటాయించారు. ఈ కేటాయింపులపై ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఎలాంటి అధికారమూ లేదు’ అని గుప్తా తేల్చిచెప్పారు. ట్రైబ్యునల్‌ విచారణ గురువారం కూడా కొనసాగనుంది.

Updated Date - Nov 27 , 2025 | 05:26 AM