AP Urea Crisis: యూరియా మాయ
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:07 AM
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే... ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కష్టాలు తక్కువే అయినప్పటికీ... ఇబ్బందులు పడుతుండటం మాత్రం నిజం!
కష్టాలకు అసలు కారణాలు ఏమిటి?
ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక
ఒక్కో బస్తాపై దాదాపు 2వేల సబ్సిడీ
రూ.266కే బస్తా యూరియా విక్రయం
ఇతర ఎరువులు రూ.1350కి పైగానే
యూరియా వినియోగానికి రైతుల మొగ్గు
సూచించిన దానికంటే రెట్టింపు వాడకం
అక్రమార్కుల పాపమూ కారణమే
సిండికేట్‌గా సొంతం చేసుకుంటున్న కొందరు
వ్యవసాయేతర అవసరాలకూ మళ్లింపు
ప్రస్తుత సీజన్‌కు సరిపడా యూరియా సరఫరా అవుతోందని అధికారులు పదేపదే చెబుతున్నారు!
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సమీక్షిస్తూ... అధికారులకు
తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు!
అయినా... యూరియా ‘కొరత’ ఎందుకు ఏర్పడుతోంది? విక్రయ కేంద్రాల వద్ద ఎందుకు రైతులు బారులు తీరుతున్నారు?
సమస్యకు కారణం... యూరియా సరఫరా కొరతా? లేక, ఇతర అంశాలు ఉన్నాయా? వ్యవసాయరంగ నిపుణులు ఏం చెబుతున్నారు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే... ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కష్టాలు తక్కువే అయినప్పటికీ... ఇబ్బందులు పడుతుండటం మాత్రం నిజం! ప్రస్తుత సీజన్‌కు సరిపడా యూరియా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో ఇప్పటికీ యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. డిమాండ్ మేరకు సరఫరా ఉంటే.. రైతులకు ఎందుకు అందడం లేదన్నది ప్రశ్న. దీనికి అనేక కారణాలున్నాయని అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొంతమేరకు యూరియా పక్కదారి పట్టడం, సరఫరాలోనూ లోటుపాట్లు ఉండటంతోపాటు... అవసరానికి మించిన వినియోగంతో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఇతర రసాయన, మిశ్రమ ఎరువులతో పోల్చితే యూరియా ధర చాలా తక్కువ. 45 కిలోల యూరియా బస్తా అసలు ధర రూ.2234.
అయితే.. కేంద్ర ప్రభుత్వం రూ.1967 రాయితీ ఇస్తోంది. అంటే... బస్తా యూరియా రూ.266.50కే లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యూరియా సబ్సిడీ కోసం ఏటా రూ.2 లక్షల కోట్లకుపైగా వెచ్చిస్తోంది. అదే సమయంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు రాయితీపోగా బస్తా రూ.1,350 నుంచి రూ.1,800 వరకు పలుకుతున్నాయి. యూరియా చౌక ధరకే లభిస్తుండటంతో... రైతులు దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని, అవసరానికి మించి వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ... తక్కువలు...
యూరియా అంటే... నత్రజని! పంట ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలకు యూరియా ఎక్కువగా వాడుతున్నారు. కానీ...దీని వినియోగానికి ఒక లెక్క ఉంది. కోస్తా జిల్లాల్లో ఎకరాకు రెండున్నర బస్తాలు... ఉత్తర కోస్తా, ఇతర ప్రాంతాల్లో రెండు బస్తాల యూరియా వినియోగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ... రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎకరాకు ఐదు నుంచి ఆరు బస్తాల యూరియా వినియోగిస్తున్నారు. మిశ్రమ ఎరువులతో పోల్చితే యూరియా ధర తక్కువ కావడం, ఎంత ఎక్కువ యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహలే దీనికి కారణమని ఒక అధికారి వెల్లడించారు. యూరియా కష్టాలు, కొరతపై మీడియాలో వస్తున్న వార్తలతో రైతులు ఆందోళనకు గురవుతుండటం నిజం. దీంతో... ‘ప్యానిక్ పర్చేజింగ్’ (మనకు మళ్లీ దొరకవేమో అనే ఆందోళనతో ఇప్పటికిప్పుడు అవసరంలేకున్నా కొనడం) కూడా పెరిగిందనే వాదన వినిపిస్తోంది. కొన్నిచోట్ల వచ్చే రబీ సీజన్ కోసం నిల్వలు చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇతర అవసరాలకూ...
వ్యవసాయేతర అవసరాలకు కూడా యూరియాను వినియోగిస్తుండడం కొరతకు మరో కారణమని చెబుతున్నారు. పాల కల్తీ మొదలుకుని బీర్ల తయారీ వరకు యూరియాను వాడుతున్నారు. కొన్ని పారిశ్రామిక అవసరాలకూ ఉపయోగిస్తున్నారు. రైతుల పేరుతో కొనుగోలు చేసి, యూరియాను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి యూరియాను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరికి అధికారులు సైతం సహకరిస్తున్నట్టు సమాచారం.
అంతర్జాతీయ పరిణామాలూ...
యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. మన దేశం ఇప్పటికీ యూరియా కోసం దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతోంది. అందులోనూ... భారత్‌కు రష్యా నుంచి ప్రధానంగా యూరియా వస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా దిగుమతులు తగ్గాయని చెబుతున్నారు.
ఈ లెక్కన కొరతే ఉండొద్దు...
ప్రస్తుత ఖరీ్‌ఫలో 78.75 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటి వరకు 59.35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగులోకి వచ్చాయి. దీంతో ఈ సీజన్‌కు 6.22 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేశారు. దీని ప్రకారం కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3.77 లక్షల టన్నుల యూరియా వచ్చింది. ప్రారంభ నిల్వతో కలిపి 6.75 లక్షల టన్నులు ఉంది. ఇప్పటి వరకు 5.97 లక్షల టన్నుల యూరియాను విక్రయించారు. ప్రస్తుతం 77 వేల టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ తెలిపింది. అంటే... వ్యవసాయ అవసరాలకు యూరియా కొరత అనేదే ఏర్పడకూడదు. అయినా... కష్టాలు తప్పడంలేదంటే, ఎక్కడా తేడా వస్తోందనే కదా అర్థం! ప్రభుత్వం నిఘా పెట్టి అక్రమ తరలింపును నిరోధించాల్సిన అవసరం ఉంది. గత నెల చివరి వారంలో విజిలెన్స్ బృందాలు తనిఖీ చేసి 2,845 టన్నుల ఎరువుల్ని పట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తనిఖీల ఊసేలేదు.
సమీక్ష అవసరం!: యూరియా సమస్యను పరిష్కరించేందుకు వచ్చే రబీ నుంచి ఈ-క్రాప్, ఆధార్ అనుసంధానంతో రైతులకు అవసరమైన మేరకే ఎరువులు ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కానీ, యూరియాతో సహా ఎరువుల సరఫరా, పంటలకు అధిక వాడకం, వ్యవసాయేతర అవసరాలకు తరలింపు వంటి అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిష్కారం ఏదీ?
ఎరువుల తయారీ కంపెనీలు యూరియాకు ఇతర ఉత్పత్తులు లింకు పెడుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. దీంతో యూరియా కొనుగోలు చేయలేమని గత మే నెలలోనే డీలర్లు తేల్చి చెప్పారు. ఇప్పటికీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వం కూడా 70ు రైతుసేవా కేంద్రాలు, సహకార సంఘాలకు కేటాయించడంతో యూరియా అమ్మకానికి కొందరు డీలర్లు వెనుకాడుతున్నారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రైతుల ముసుగులో సొసైటీలు, రైతు సేవా కేంద్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఎరువులు ఎత్తుకెళ్తున్నారన్న వాదన ఉంది. ‘ఈ-పోస్’ మిషన్లు లేకపోవడంతో కొంతమంది డీలర్లు తమ ఖాతాదారులకు, చెప్పిన ధరకు కొనే వారికే ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య వ్యత్యాసం తలెత్తుతోంది.
ఇదీ పరిస్థితి...
ఆదివారం వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. రైతులు ఏ మేరకు ఎరువులు వాడుతున్నారో ఆరా తీశారు. వరి సాగుకు ఇప్పటికే వేసిన యూరియాకు అదనంగా ఎకరానికి కనీసం 2-4 బస్తాలు అవసరమని రైతులు చెప్పారు. ఇంత ఎక్కువగా ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందని ఆయన రైతులకు చెప్పారు. అయినప్పటికీ.. రైతులు యూరియా అవసరమని తేల్చి చెప్పారు.