Share News

Police Clash Over Theft Investigation: పందెం కోళ్ల చోరీ గొడవ

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:02 AM

మందిమార్బలంతో నాలుగు కార్లలో ఏపీ పోలీసులొచ్చి.. ఓ ఇంట్లోకి ప్రవేశించి అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేస్తే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు..

Police Clash Over Theft Investigation: పందెం కోళ్ల చోరీ గొడవ

  • ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వివాదం

  • అడ్డుకున్న గ్రామస్థులు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు

  • ఏపీ పోలీసులను స్టేషన్‌కు తరలించిన స్థానిక పోలీసులు

  • తమ వాళ్లను విడిపించుకొని వెళ్లిన ఏపీ సీఐ

  • విచారణ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఏపీ పోలీసులు

దమ్మపేట, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మందిమార్బలంతో నాలుగు కార్లలో ఏపీ పోలీసులొచ్చి.. ఓ ఇంట్లోకి ప్రవేశించి అక్కడివారిని భయభ్రాంతులకు గురిచేస్తే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ పోలీసులను తెలంగాణ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. చివరికి ఆ ఏపీ స్టేషన్‌ నుంచి సీఐ స్వయంగా వచ్చి తమ సిబ్బందిని విడిపించుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంత గలాటా జరిగింది ఓ దొంగకోళ్ల కేసులో భాగంగా అంటే నమ్మాలి! స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణ పేరుతో ఏపీ పోలీసుల ఈ దుందుడుకు చర్య కొత్తగూడెం జిల్లా దమ్మపేటవాసుల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. చోరీకి గురైనవి నాలుగు కోళ్లు! వాటి విలువ రూ.4 లక్షలు! అంత ఖరీదా? అనంటే.. అన్నీ కూడా పిస్తా, బాదాం పప్పులు గట్రా మేస్తూ వచ్చే సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న పందెం కోళ్లు! ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్‌ అనే వ్యక్తికి చెందిన ఈ కోళ్లను పదిరోజుల క్రితం దొంగలెత్తుకెళ్లారు. వెంటనే రంగనాథ్‌, చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎలా తెలుసుకున్నాడో ఏమో గానీ ఆ రంగనాథే తన కోళ్లను పిల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగిలించాడని.. ఆ కోళ్లలో రెండింటిని దమ్మపేటకు చెందిన గోపవరపు శేషగిరికి విక్రయించాడని తెలుసుకొని పోలీసులకు ఉప్పందించాడు. సోమవారం చింతలపూడి స్టేషన్‌ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌, ఓ కానిస్టేబుల్‌, ఓ హోంగార్డు కలిసి ఓ కార్లో... స్థానికంగా ఉంటున్న కొందరు మరో మూడు కార్లలో బయలుదేరి దమ్మపేటలో వాలారు. నేరుగా గోపవరపు శేషగిరి ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో శేషగిరి ఇంట్లో లేడు. అతడి భార్య రాజేశ్వరిని ఉద్దేశించి ‘నీ భర్త ఎక్కడ?’ అంటూ పోలీసులు గద్దించారు. ‘దొంగకోళ్లు ఎందుకు కొన్నారు?’ అని ప్రశ్నించారు. లోపలి నుంచి గేట్లు మూసేసి.. ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఓ చోట.. వేరే రెండు కోళ్లు కట్టేసి ఉండటం చూసి.. ఇవే కదా.. మీరు కొన్న కోళ్లు? అంటూ దుర్భాషలాడారు. ఆ కోళ్లను తమ కార్లో వేసుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు, ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెంటనే.. దమ్మపేట పోలీస్‌ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. స్టేషన్‌ నుంచి ఓ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని.. ఏపీ పోలీసులను, వారి వెంట వచ్చినవారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా చింతలపూడి సీఐ క్రాంతి కుమార్‌ సోమవారం రాత్రి దమ్మపేటకు చేరుకుని తమ సిబ్బందిని విడిచిపించుకుని తీసుకెళ్లారు. ఈ విషయంపై దమ్మపేట ఎస్సై సాయికిషోర్‌రెడ్డి వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి పిల్లి వెంకటేశ్వర్లు నుంచి ఓ రెండు కోళ్లను శేషగిరి కొన్నట్లు తెలిసింది. వాటిని అతడు మరో వ్యక్తి ఇంట్లో ఉంచి.. అక్కడి నుంచి వెరే రెండు కోళ్లను తెచ్చి పెట్టుకున్నట్లు సమాచారం. అయితే మిగిలిన రెండు పందెం కోళ్లను వెంకటేశ్వర్లు తన వద్దే పెట్టుకున్నాడు. గ్రామానికి పోలీసులొచ్చారనే విషయం తెలుసుకొని.. శివార్లలోని ఓ చర్చి వద్ద ఆ రెండు కోళ్లను వదిలేసి అతడు పరారయ్యాడు. నాలుగు కోళ్లు దొరకడంతో ఏపీ పోలీసులు శేషగిరికి సంబంధించిన రెండు కోళ్లను అతడికిచ్చేసి, పందెం కోళ్లతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 16 , 2025 | 04:02 AM