AP Transco: తెలంగాణ ఇస్తోంది.. మేమూ ఇస్తున్నాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:24 AM
తెలంగాణ ట్రాన్స్‌కో కూడా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్-ప్రాఫిట్స్ (సీవోపీ) కింద టెండరు మొత్తానికి అదనంగా 14 శాతం చెల్లిస్తోందని, దానిని అనుసరించే తాము కూడా అమలు చేస్తున్నామని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు....
కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్-ప్రాఫిట్స్‌పై ఏపీ ట్రాన్స్‌కో వివరణ
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై పొంతన లేని జవాబు
మరి అక్కడి ఎస్‌ఎస్ఆర్ ధరలు అమలు చేస్తున్నారా?
కొవిడ్ ఎప్పుడో 2021లోనే ముగిసింది
అయినా దాని సాకుతో 2024 వరకూ సీవోపీ పునరుద్ధరణపై దృష్టిపెట్టలేదని సమర్థన
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ట్రాన్స్‌కో కూడా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్స్ ఓవర్‌హెడ్స్-ప్రాఫిట్స్ (సీవోపీ) కింద టెండరు మొత్తానికి అదనంగా 14 శాతం చెల్లిస్తోందని, దానిని అనుసరించే తాము కూడా అమలు చేస్తున్నామని ఏపీ ట్రాన్స్‌కో అధికారులు వివరణ ఇచ్చారు. ‘ఆ నిర్ణయం ఖరీదు రూ.300 కోట్లు’ శీర్షికన ఆదివారం (12న) ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు. అయితే తెలంగాణ ట్రాన్స్‌కో ఎస్‌ఎ్‌సఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ధరలనే ఇక్కడా అమలు చేస్తున్నారా అంటే సమాధానం లేదు. అక్కడి కన్నా ఇక్కడి ఎస్‌ఎ్‌సఆర్ ధరలు 20 శాతం అధికంగా ఉన్నాయి. 2020 నుంచి 2024 వరకు కొవిడ్ మహమ్మారి కారణంగా భారీ ప్రాజెక్టులేవీ చేపట్టలేదని.. అందుకే సీవోపీని పునరుద్ధరించడంపై దృష్టి సారించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ నాలుగేళ్లలో ఏటా ట్రాన్స్‌కో రూ.2 వేల కోట్లకు తగ్గకుండా భారీ టెండర్లు పిలిచింది. అయినా 2021లోనే ముగిసిపోయిన కొవిడ్‌ను 2024 వరకు సాకుగా చూపడం.. తప్పును కప్పిపుచ్చుకునేందుకేనన్నది స్పష్టమవుతోంది. ట్రాన్స్‌కో పిలిచే టెండర్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడం వల్లే సీవోపీ ఇస్తున్నామని చెప్పడం కూడా హాస్యాస్పదం. 2019-2024 వరకు అధికశాతం టెండర్లు తక్కువకు పడగా.. 2024 నుంచి పిలిచిన టెండర్లలో ఎక్కువ ఎక్సెస్‌కు పడడం గమనార్హం. కొన్ని టెండర్లు ఏకంగా 11 శాతం ఎక్కువకు పడిన దాఖలాలూ ఉన్నాయి. దీనికి సీవోపీ 14 శాతం కలుపుకొంటే టెండరులో కోట్ చేసిన దానికి 25 శాతం అత్యధికం. వీటన్నింటినీ కప్పిపెట్టి.. ప్రభుత్వానికి నష్టం కలిగించే సీవోపీ పునరుద్ధరణ నిర్ణయాన్ని ట్రాన్స్‌కో సమర్థించుకోవడం గమనార్హం.
ట్రాన్స్‌కో బలోపేతమే లక్ష్యం
జేఎండీగా ప్రవీణ్ చంద్ బాధ్యతలు స్వీకరణ
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్ కో అభివృద్ధికి, బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. సోమవారం విద్యుత్ సౌధలో ఆయన జేఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యమిచ్చి పనిచేస్తానన్నారు. ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏకేవీ భాస్కర్, జేవీరావు, ఎన్‌వీ రమణమూర్తి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
