Share News

AP Transco: నచ్చితే ఎంతైనా

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:33 AM

హైవోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల మీద మిగిలిన లైన్ల కన్నా పై భాగాన ఒకే ఒక్క తీగ విడిగా కనిపిస్తుంది. దాన్నే ఓపీజీడబ్ల్యూ కేబుల్‌ అంటారు. సాధారణంగా వీటిని 400కేవీ, 220 కేవీ, 132కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ...

AP Transco: నచ్చితే ఎంతైనా

  • ఓపీజీడబ్ల్యూ టెండరు ధర 16.77 కోట్లు పెంచేశారు

  • నచ్చిన వారి కోసం ట్రాన్స్‌కోలో రూ.కోట్లలో పందేరం

  • కేబుళ్ల సరఫరా, ఏర్పాటుకు గతేడాది 84 కోట్లతో టెండరు

  • పనులు అప్పగించకుండా ఏడాది జాప్యం

  • అర్ధంతరంగా పాతది రద్దు..101 కోట్లకు పనుల అప్పగింత

ఏపీ ట్రాన్స్‌కోలో అక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒక పనికి టెండరు పిలుస్తారు. తమకు కావాల్సిన వారికి టెండరు దక్కకుంటే దాన్ని రద్దు చేసేస్తారు. అదే పనికి రీటెండరు పిలుస్తారు. ఈసారి పని విలువ గతానికన్నా రూ.కోట్లలో పెరిగిపోతుంది. అయినవారికి పని దక్కుతుంది. స్టాండర్డ్‌ షెడ్యూల్‌ ధరల్లో(ఎస్‌ఎస్‌ఆర్‌) ఎలాంటి మార్పూ లేకున్నా టెండరు విలువ ఎందుకు పెరిగిందని అడిగేవారే ఉండరు. ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా అది వ్యాపార రహస్యం అని ట్రాన్స్‌కో అధికారులు సెలవిస్తారు. ఓపీజీడబ్ల్యూ (ఆప్టికల్‌ గ్రౌండ్‌ వైర్‌) టెండర్లలో జరిగిందిదే..!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

హైవోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల మీద మిగిలిన లైన్ల కన్నా పై భాగాన ఒకే ఒక్క తీగ విడిగా కనిపిస్తుంది. దాన్నే ఓపీజీడబ్ల్యూ కేబుల్‌ అంటారు. సాధారణంగా వీటిని 400కేవీ, 220 కేవీ, 132కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ (ఈహెచ్‌వీ) ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌లో వాడతారు. ప్రధానంగా మెరుపుల నుంచి హెచ్‌టీ లైన్‌ రక్షణ కోసం, హైస్పీడ్‌ టెలీ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ కోసం వీటిని వినియోగిస్తారు. మెరుపుల నుంచి హెచ్‌టీ లైన్లను రక్షించే ఎర్తింగ్‌ వైర్‌గా ఇవి పనిచేస్తాయి. అలాగే డేటా, వాయిస్‌, వీడియో వంటి సమాచారాన్ని ప్రసారం చేసేందుకూ ఉపయోగపడతాయి. ట్రాన్స్‌మిషన్‌ లైన్ల వెంట ఇప్పటికే ఉన్న రైట్‌ ఆఫ్‌ వేను ఉపయోగించుకోవడం ద్వారా భూమిని తవ్వాల్సిన పనిలేకుండా ఓపీజీడబ్ల్యూ కేబుల్‌ ద్వారా కమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలను నిర్మించుకోవచ్చు. నిర్దేశిత సమయంలో ఈ కేబుల్‌ను మార్చుకుంటూ ఉండాలి. ఇందులోభాగంగా ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ (ట్రాన్స్‌మిషన్‌) 2023 ఆగస్టులో కేబుల్‌ సరఫరా, ఏర్పాటుకు టెండరు పిలిచారు. 2024 జనవరిలో టెండరును కాంట్రాక్టరుకు అప్పగించినా, పనులు అప్పగించకుండా జాప్యం చేస్తూవచ్చారు. చివరకు ఆ ఏడాది ఆగస్టులో టెండరును రద్దు చేశారు. రూ.84.95 కోట్లతో పిలిచిన ఈ టెండరు రద్దుకు ట్రాన్స్‌కో అధికారులు ఎలాంటి కారణాలు చూపలేదు. మళ్లీ అదే ఏడాది డిసెంబరులో రీటెండరు పిలిచి, 2025 జనవరిలో మరో కాంట్రాక్టరుకు పనులు అప్పగించారు. ఈసారి టెండరు విలువ అమాంతం పెరిగిపోయింది. ఏడాది కాలంలో టెండరు విలువ రూ.84.95 కోట్ల నుంచి రూ.101.72 కోట్లకు పెరిగిపోయింది. సుమారు రూ.16.77 కోట్లు మేర టెండరు విలువ పెంచేసి ట్రాన్స్‌కో అధికారులు దోపిడీకి సిద్ధమయ్యారు.


విడగొట్టారు.. దోపిడీకి స్కెచ్‌ వేశారు..

తొలిసారి పిలిచిన టెండరులో రాష్ట్రమంతా ఒకే విభాగంగా చూపారు. ఓపీజీడబ్ల్యూ 48ఎఫ్‌ కేబుల్‌ను 146.63 కిలోమీటర్లు మేర వేయాలని టెండరులో పేర్కొన్నారు. 48 ఫైబర్లు ఉండే 48ఎఫ్‌ కేబుల్‌ను హైకెపాసిటీ డేటా ట్రాన్స్‌మిషన్‌కు ఉపయోగిస్తారు. ఓపీజీడబ్ల్యూ 24ఎఫ్‌ కేబుల్‌ను 3165.61 కిలోమీటర్లు మేర వేయాలని తెలిపారు. 24 ఫైబర్లు ఉండే 24ఎఫ్‌ కేబుల్‌ను ఆప్టికల్‌ పవర్‌ గ్రౌండ్‌ వైర్‌గా పేర్కొంటారు. దీన్ని ఎర్తింగ్‌ వైర్‌గా ఉపయోగిస్తారు. తొలిసారి పిలిచిన టెండరును రద్దుచేసిన తర్వాత, రెండోసారి పిలిచిన టెండరులో రాష్ట్రాన్ని టెలికాం సర్కిళ్లవారీగా మూడు లాట్‌ల కింద విడగొట్టినట్లు చూపారు. లాట్‌ 1 కింద విజయవాడ టెలికాం సర్కిల్‌ పరిధిలో 973 కిలోమీటర్లను చూపుతూ రూ.29.51 కోట్లకు, లాట్‌ 2 కింద విశాఖపట్నం సర్కిల్‌ పరిధిలోని 838 కిలోమీటర్లను చూపుతూ రూ.25.27 కోట్లకు, లాట్‌ 3 కింద కడప సర్కిల్‌ పరిధిలోని 1,450 కిలోమీటర్లను చూపుతూ రూ.46.93 కోట్లకు టెండరు పిలిచారు. ఈ మొత్తంలో 48ఎఫ్‌ కేబుల్‌ వేయాల్సిన కిలోమీటర్లలోగానీ.. 24 ఎఫ్‌ కేబుల్‌ వేయాల్సిన కిలోమీటర్లలోగానీ మార్పు లేదు. కేవలం టెండరు ధర మాత్రమే రూ.16.77 కోట్లకు పెరిగిపోయింది. ఎస్‌ఎ్‌సఆర్‌ ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. అయినా టెండరు ధరను ఇష్టమొచ్చినట్లు పెంచేశారు. ఎక్కువగా పిలిచిన మొత్తాన్ని కప్పిపుచ్చుకొనే ఎత్తుగడలోభాగంగా రెండోసారి పిలిచిన టెండరును మూడు లాట్‌లుగా విడగొట్టినట్లు చూపారు.


ఎవరి కోసం..?

పాత టెండరును రద్దు చేయడం.. మళ్లీ అదే టెండరును అధిక ధరకు పిలవడం వెనుక సంబంధిత శాఖ మంత్రి పేషీ నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణమని చెబుతున్నారు. గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు 2024 జనవరిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవ్వగా, ఎన్నికల నిర్వహణను సాకుగా చూపి అధికారులు వాటిని అప్పగించలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత కాంట్రాక్టరును తొలగించేందుకు ఏకంగా టెండరునే రద్దు చేసేశారు. పోనీ ఆ తర్వాత పిలిచిన టెండరునైనా సక్రమంగా పిలిచారా అంటే రూ.16.76 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అధిక ధరతో టెండరు పిలిచి, అయిన వారికి కట్టబెట్టారు.

Updated Date - Nov 05 , 2025 | 04:34 AM