Chief Minister Chandrababu: పర్యాటకానికి స్వర్గధామం.. ఏపీ
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:36 AM
పర్యాటకానికి ఏపీ స్వర్గధామమని, దేశంలోనే ఉత్తమ పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పర్యావరణం, సం స్కృతి, వనరులను కాపాడుకుంటూ...
కుంభమేళా తరహాలో కార్యక్రమాలు
టూరిజంకు ఇండస్ట్రీ హోదా ఇచ్చాం
రాష్ట్రంలో హీలింగ్ కేంద్రాల ఏర్పాటు
‘హెల్త్ టూరిజం’ను ప్రోత్సహిస్తాం
ప్రపంచ పర్యాటక దినోత్సవంలో సీఎం చంద్రబాబు
‘‘పీపీపీ అంటే ఏంటో తెలియని వాళ్లే విమర్శిస్తున్నారు. స్థలాలను మొత్తంగా అమ్మేస్తే ప్రైవేటీకరణ అవుతుంది. కానీ, స్థలాలను లీజుకు మాత్రమే ఇస్తున్నాం. అమ్మేయడానికి, లీజుకు ఇవ్వడానికి మధ్య ఉన్న తేడా కొంతమందికి తెలియకపోవడం మన దౌర్భాగ్యం.’’
- సీఎం చంద్రబాబు
విజయవాడ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పర్యాటకానికి ఏపీ స్వర్గధామమని, దేశంలోనే ఉత్తమ పర్యాటక ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పర్యావరణం, సం స్కృతి, వనరులను కాపాడుకుంటూ సుస్థిర మార్పు తీసుకువచ్చినప్పుడే పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ‘‘గత పాలకులు తమ సొంత అవసరాలు తీర్చుకునేందుకు విశాఖలోని రుషికొండపై రూ.451 కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఆ నిధులను పర్యాటక రంగంపై ఖర్చు చేసి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవి’’ అని తెలిపారు. అవగాహన లేక గత ప్రభుత్వం పర్యాటకం మీద ఒక్క పైసా ఖర్చుపెట్టలేదని, దేవాలయాల పవిత్రతను దెబ్బతీసిందని దుయ్యబట్టారు. అద్భుతమైన కట్టడాలను కూల్చేసిందన్నారు. ‘‘ఆరోగ్య వంతజీవనానికి రాష్ట్రంలో హీలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి హెల్త్ టూరిజం ప్రాజెక్టులను ప్రోత్సహిస్తాం. అన్ని ఇజాల కంటే టూరిజం భవిష్యత్తులో నిలబడుతుందని నేను గతంలోనే చెప్పా. ప్రస్తుతం అదే నిజమైంది. టూరిజం అభివృద్ధి వల్లే మకాన్, మాల్దీవ్, హాంకాంగ్ లాంటి చిన్నదేశాలు అభివృద్ధి చెందుతున్నాయి’’ అని అన్నారు.
పరిశ్రమ హోదా ఇచ్చాం
తమ ప్రభుత్వం రాగానే పర్యాటక రంగానికి పారిశ్రామిక(ఇండస్ట్రీ) హోదా కల్పించామని చంద్రబాబు తెలిపారు. పర్యాటకుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయని, నేటితరం యువత.. వారసత్వ సంపద, పూర్వీకుల సంస్కృతి వైపు మళ్లడానికి ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలను ఉపయోగించుకుంటూ ఒకరోజు పర్యటనకు వచ్చిన వాళ్లను సైతం మూడు, నాలుగు రోజులు ఉండేలా సంస్కృతికి ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను కుంభమేళా తరహాలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధించాలంటే హరిత, పర్యాటకం, స్వచ్ఛత విషయాల్లో రాష్ట్రం మెరుగుపడాలన్నారు.
10 వేల హోం స్టేలు
అరకు, పాడేరు, విశాఖ, తిరుపతి, రాయలసీమ తదితర ప్రాంతాల్లో 10 వేల హోం స్టేలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. వచ్చే మూడేళ్లలో 50 వేల హోటల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సంస్కృతి, సంప్రదాయలను ఉపయోగించుకుని అనుభూతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బుద్ధిస్ట్ ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల్లో కుంభమేళా తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అరకు చలి ఉత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్ వంటివి నిర్వహిస్తామని తెలిపారు. ప్రపంచంలో అరకు లాంటి కాఫీ ఎక్కడా దొరకదని, అందుకే దేశ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీ రుచిచూపిస్తున్నామన్నారు.
మన విశిష్టతలు గుర్తించాలి
మన ప్రాంతంలోని విశిష్ట, పర్యాటక ప్రాంతాలను గుర్తించకపోవడం వల్లే ఇతర ప్రాంతాల్లో పర్యటించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒకేచోట రెండు జ్యోతిర్లింగాలున్న శ్రీశైలాన్ని దర్శించుకోవడానికి అక్టోబరు 16న ప్రధాని మోదీ వస్తున్నారని, జ్యోతిర్లింగాల విషయం రాష్ట్రంలో అనేక మందికి అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. దసరా ఉత్సవాలంటే కలకత్తా, మైసూరు మాత్రమే గుర్తొచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత విజయవాడలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో దేశం మొత్తం నగరంవైపు చూస్తోందని చంద్రబాబు తెలిపారు.