Share News

AP Tourism Corporation: టెండర్లు అనర్హులకేనా

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:44 AM

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ (పిలిగ్రిమ్‌ రెజువెంటేషన్‌ అండ్‌ స్పిర్చ్యువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌) పథకంలో భాగంగా కోట్లాది నిధులు కేటాయిస్తోంది.

AP Tourism Corporation: టెండర్లు అనర్హులకేనా

  • ఏపీటీడీసీలో అడ్డగోలు టెండర్లు

  • ఏ టెండరైనా నాలుగుసార్లు పిలవాల్సిందే

  • ‘సింహాచలం’ సాఫ్ట్‌వేర్‌ టెండర్లలో ఇష్టారాజ్యం

  • రూ.2.36 కోట్ల చిన్న టెండర్‌ సైతం 4 సార్లు..

  • అర్హత లేని కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు

  • ఇంతకుముందు ‘అన్నవరం’ టెండర్లలోనూ మతలబు

  • ‘ప్రసాద్‌’ పథకంలో ఏపీటీడీసీ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

టెండర్‌ ఏదైనా అధికారులు అనుకున్న కంపెనీకే దక్కాలి.. అందుకోసం ఎంత దూరమైనా వెళ్తారు.. ఏదైనా చేస్తారు.. ఎంత పెద్ద కంపెనీ అయినా డిస్‌క్వాలిఫై చేసేస్తారు.. చివరికి అవసరం లేకున్నా టెండర్లను రద్దు చేసేస్తారు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ అధికారుల తీరు! టెండర్లను మతలబు చేయడంలో వారు ఆరితేరిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అన్నవరంలో పలు నిర్మాణాల విషయంలోనూ.. తాజాగా.. సింహాచలం ఆలయ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ కోసం కంపెనీ ఎంపికకు పిలిచే టెండర్ల విషయంలోనూ ఇదే రీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి! ఒక అర్హత లేని కంపెనీని తీసుకువచ్చి రూ.2.36 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ సేవలకు సంబంధించిన పని అప్పగించేందుకు అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ (పిలిగ్రిమ్‌ రెజువెంటేషన్‌ అండ్‌ స్పిర్చ్యువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌) పథకంలో భాగంగా కోట్లాది నిధులు కేటాయిస్తోంది. ఎక్కువ శాతం సివిల్‌ వర్కులకు నిధులను కేటాయించే కేంద్రం.. తొలిసారి భక్తుల సౌకర్యార్థం సాఫ్ట్‌వేర్‌ సేవలను కూడా ఈ పథకంలో అందించాలని నిర్ణయించింది. ఇందుకు ఏపీలోని సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేసింది. రూ.2.36 కోట్ల వ్యయంతో వెబ్‌సైట్‌ డిజైన్‌, హ్యాండ్‌ యాప్‌, ఐవోఎస్‌ యాప్‌లను సిద్ధం చేయడంతో పాటు వాటి నిర్వహణను ప్రయివేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ఎంపిక బాధ్యత తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీటీడీసీ) అధికారులు.. గత ఏడాది జూలై నుంచి టెండర్లు పిలవడం, రద్దు చేయడం.. మళ్లీ పిలవడం.. రద్దు చేయడం.. ఇలా నాలుగుసార్లు చేశారు. అర్హత కలిగిన కంపెనీని మాత్రం ఎంపిక చేయడం లేదు. దీనికి కారణం.. ఏపీటీడీసీలో ప్రాజెక్టు విభాగం చూసే ఒక ఉన్నతాధికారి.. రాజమండ్రికి చెందిన ఒక కంపెనీకి స్టాఫ్ట్‌వేర్‌ టెండర్‌ కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే.. ఇప్పటి వరకూ నాలుగు సార్లు టెండర్లు ఆహ్వానించినా అధికారి అనుకున్న ఆ రాజమండ్రి కంపెనీకి అర్హత లభించడం లేదు. ఇప్పటి వరకూ పిలిచిన టెండర్లల్లో ఐదు కంపెనీలు వచ్చినా.. టెండర్లు రద్దు చేయడంతో వెనక్కి వెళ్లిపోయాయి. దీనిపై పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, ఏపీటీడీసీ ఎండీకి పలువురు ఫిర్యాదులు చేసినా ఫలితం మాత్రం శూన్యం.


అన్నవరం నిర్మాణాల్లోనూ ఇలానే.. !

టీడీపీ కూటమి ప్రభుత్వం చొరవతో.. ఆ మధ్య కాలంలో అన్నవరం దేవస్థానంలో అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్‌, రిటైనింగ్‌ వాల్‌తో పాటు మరికొన్ని పనులు చేపట్టేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ప్రసాద్‌ స్కీమ్‌లో భాగంగా రూ.20 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి కూడా ఏపీటీడీసీ అధికారులు నాలుగుసార్లు టెండర్లు పిలిచారు. మంచి గుర్తింపు, అర్హతగల ఆరు కంపెనీలు ముందుకు వచ్చినా.. అధికారులు ఆయా కంపెనీల యజమానులందరికీ ఏపీటీడీసీ కార్యాలయం నుంచి మంత్రి పేరుతో ఫోన్లు చేసి తప్పించారు. చివరికి అధికారులు తాము అనుకున్న కంపెనీకే టెండరు కట్టబెట్టారు. ఇప్పుడు సింహాచలం సాఫ్ట్‌వేర్‌ టెండర్ల విషయంలోనూ.. ఏపీటీడీసీ అధికారులు మంత్రి పేరు చెప్పి అర్హత ఉన్న కంపెనీలను తప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన టెండర్లల్లో పాల్గొనాలంటే కనీసం రూ.6 కోట్లపైన టర్నోవర్‌ చూపించాలి. అధికారులు సహకరిస్తున్న కంపెనీకి రూ.50 లక్షల టర్నోవర్‌ కూడా లేదు. పైగా గతంలో ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించిన అనుభవం కూడా లేదు. అయినా మిగిలిన కంపెనీలను పక్కకు తప్పించి, సదరు కంపెనీకి అప్పగించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు!


‘క్వాలిటీ తనిఖీల’ టెండరుదీ అదే తీరు!

ఏపీటీడీసీ ఇంజనీరింగ్‌ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని సివిల్‌ వర్కులనూ ఉన్న తక్కువ మంది సిబ్బందితో పర్యవేక్షణ చేయడం కష్టంగా మారింది. దీంతో క్వాలిటీ తనిఖీల వరకూ ప్రయివేటు కంపెనీతో చేయించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఏడాదికి దాదాపు రూ.3 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. ఇందుకు టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రయివేటు కంపెనీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ టెండర్‌ ప్రక్రియను కూడా అడ్డగోలుగా చేస్తున్నారు. ముందుగానే ఒక కంపెనీతో బేరాలు కుదుర్చుకుని, టెండర్‌ ప్రక్రియను ఇష్టారాజ్యాంగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి టెండర్‌ ప్రక్రియలోనూ ఎందుకింత గందరగోళం చేస్తున్నారన్న దానిపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - Dec 01 , 2025 | 05:48 AM