Share News

CM Chandrababu: సరుకు రవాణాకు..లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:00 AM

ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల సరుకును కూడా రవాణా చేసేందుకు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu: సరుకు రవాణాకు..లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌

  • రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల కార్గో నిర్వహణా చేపట్టాలి: చంద్రబాబు

  • సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా రాష్ట్రం

  • ఎకనమిక్‌ హబ్‌గా రేవులు, ఎయిర్‌పోర్టులు

  • శాటిలైట్‌ టౌన్‌షిప్పుల అభివృద్ధీ జరగాలి

  • సమీకృత పురోగతికి బ్లూ ప్రింట్‌

  • షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

  • పరిశ్రమలు, మౌలిక వసతులపై సీఎం సమీక్ష

అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల సరుకును కూడా రవాణా చేసేందుకు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన సమీక్ష జరిపారు. ఎయిర్‌పోర్టులు-పోర్టుల అభివృద్ధి, మారిటైం పాలసీలో తీసుకురావలసిన మార్పులు, లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో 20 పోర్టులు, మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. ‘ప్రతి రేవు, విమానాశ్రయ సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానించేలా శాటిలైట్‌ టౌన్‌షిప్పులను అభివృద్ధి చేయాలి. దీనివల్ల కొత్తగా మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తద్వారా సంపద సృష్టి జరుగుతుంది. ఈ తరహా సమీకృత అభివృద్ధి ఎక్కడెక్కడ చేయగలమో.. ఏవిధంగా చేయగలమో బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసుకోవాలి. ఇదే సమయంలో సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలి. రోడ్డు, రైలు, ఎయిర్‌కార్గో, ఇన్‌ల్యాండ్‌, మారిటైం కార్గోలకు మన రాష్ట్రమే కేంద్రంగా ఉండాలి. తక్కువ వ్యయమయ్యే మార్గం ద్వారా సరుకులను రవాణా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాలంటే మన రాష్ట్రమే కేంద్రం. ఇలాంటి పరిస్థితుల్లో మన వద్ద అన్ని రకాల సరుకు రవాణా మార్గాలు అందుబాటులో ఉంటే.. అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులకు అనుసంధానంగా నేషనల్‌ హైవే కనెక్టివిటీ, రైల్‌ కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. కేంద్రం వద్ద నేషనల్‌ హైవేలకు, రైల్వే మార్గాలకు నిధుల కొరత లేదు. మనం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు పంపితే ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


మౌలిక సదుపాయాల చోదకశక్తిగా..

రాష్ట్రంలో వివిధ మార్గాల ద్వారా చేపట్టే సరకు రవాణాను సమర్థంగా నిర్వహించేందుకు లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఇది గ్రోత్‌ ఇంజన్‌ మాదిరిగా ఉండాలని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల సమీపంలో శాటిలైట్‌ టౌన్‌ షిప్పుల అభివృద్ధికి సంస్థలను గుర్తించి పీపీపీ విధానంలో చేపట్టాలని సూచించారు. ఇదే తరహాలో 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకుంటున్న ఎంఎస్ఎంఈ పార్కుల వద్ద కూడా శాటిలైట్‌ టౌన్‌షిప్పులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేయాలి. కుప్పం, దగదర్తి విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలి’ అని చెప్పారు.


క్రూయిజ్‌ టెర్మినళ్లు..

పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వీలుగా మారిటైం విధానంలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పోర్టులు, టెర్మినల్స్‌, షిప్‌ బిల్డింగ్‌ యూనిట్లు, అంతర్గత జల రవాణా మార్గాలు, క్రూయిజ్‌ టెర్మినళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ స్కీం పాలసీలో మార్పులు చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. మచిలీపట్నం, మూలపేట, చినగంజాం వంటి ప్రాంతాల్లో షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందించారు. ‘షిప్‌ బిల్డింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఎక్కడ అనువుగా ఉందో చూడాలి. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చూడాలి. కంటైనర్‌ పోర్టుల ఏర్పాటు, అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలి’ అని స్పష్టం చేశారు.


డ్రోన్ల పర్యవేక్షణతో రౌడీషీటర్లలో వణుకు పుట్టించాలి

డ్రోన్ల పర్యవేక్షణతో రౌడీషీటర్లలో వణుకు పుట్టించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్‌టీజీఎస్)ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సిద్ధం చేసిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘అవేర్‌’ డ్యాష్‌ బోర్డు 2.0ను ప్రారంభించారు. జలాశయాల్లోని నీటి నిల్వలను ఆన్‌లైన్‌లో పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీని కూడా తిలకించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జీరో మలేరియా లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 05:26 AM