Share News

Minister Lokesh: 410 ఒప్పందాలు.. 9,80,000 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:04 AM

ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించి ఆ పార్టీని 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేయడంతో ప్రజాకాంక్షేమిటో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు గ్రహించాయి.

Minister Lokesh: 410 ఒప్పందాలు.. 9,80,000 కోట్ల పెట్టుబడులు

  • ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ఎంవోయూలు

  • రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు

  • వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది: లోకేశ్‌

‘‘ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వాన్ని ఓడించి ఆ పార్టీని 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేయడంతో ప్రజాకాంక్షేమిటో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు గ్రహించాయి. సుస్థిర పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పారిశ్రామికవేత్తలు గుర్తించినందునే 15 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలంతా వరుసగా భారీ పరిశ్రమల శంకుస్థాపనలు, అవగాహనా ఒప్పందాలు ఉంటాయి. 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులో రూ.9,80,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 410 ఒప్పందాలు జరుగుతాయి. 12 బహుళ జాతి సంస్థలు వస్తున్నాయి. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరవుతారని సమాచారం ఇచ్చారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వనీ వైష్ణవ్‌, పీయూష్‌ గోయల్‌ హాజరవుతున్నారు. యువగళం యాత్రలో నేను రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కష్టపడుతున్నాం. అనకాపల్లి జిల్లాకు మిట్టల్‌ స్టీల్స్‌ ద్వారా లక్షన్నర కోట్ల పెట్టుబడులు రానున్నాయి. గూగుల్‌ డేటా సెంటర్‌ రూ.1,33,000 కోట్ల పెట్టుబడులు తీసుకురానుంది.


బీపీసీఎల్‌ లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విద్వేషాలను రెచ్చగొడుతోంది. ఈ ప్రచారాలను పెట్టుబడిదారులు విశ్వసించడంలేదు. రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాన్ని అమలు చేయడం వల్లే పెట్టుబడులు రాబట్టడంలో ముందంజలో ఉన్నాం. ఏ అంశంపైనా పట్టు, అవగాహన లేని జగన్‌ ముఖ్యమంత్రి ఎలా అయ్యారో?’’ అని లోకేశ్‌ అన్నారు.

మహిళా క్రికెటర్లకు ప్రోత్సాహకాలు

మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేత భారత జట్టులోని ఇద్దరు తెలుగు క్రికెటర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని లోకేశ్‌ చెప్పారు. సీఎం చంద్రబాబు లండన్‌ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆయనతో చర్చించి ప్రకటిస్తామని అన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 04:06 AM