AP Caveat: తెలంగాణ దావాను పరిగణనలోకి తీసుకోవద్దు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:28 AM
పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తయారు చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలుచేసిన పిటిషన్‌ను...
నల్లమలసాగర్‌పై సుప్రీంలో నేడు ఏపీ కేవియట్
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను తయారు చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలుచేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఈ మేరకు బుధవారం కేవియట్ పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున బుధవారమే ఈ పిటిషన్ దాఖలుచేయాలని అంతర్రాష్ట్ర జల వివాద విభాగం, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్లు సుగుణాకరరావు, రాంబాబులను ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ జి.సాయిప్రసాద్ ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏడీఆర్) గుంటూరు ప్రమోద్‌కుమార్ కేవియట్ దాఖలుచేస్తారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తాకే నల్లమలసాగర్ కేసును రాష్ట్రప్రభుత్వం అప్పగించింది. కాగా.. ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు తయారు చేసుకోవడం రాష్ట్రాల ప్రాథమిక హక్కు అని.. అలా చేయకుండా ఏపీపై తెలంగాణ అజమాయిషీ చెలాయించాలని చూడడం ఏమిటని రాష్ట్ర జలవనరుల శాఖ, సాగునీటి నిపుణులు ఆక్షేపిస్తున్నారు. డీపీఆర్ తయారీని కూడా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రయత్నించడాన్ని మొగ్గలోనే నివారించకపోతే భవిష్యత్‌లో రాష్ట్రానికి నీటి కష్టాలు తప్పవని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి తెలంగాణ కేసు వేయకముందే కేవియట్ వేయాలని జలవనరుల శాఖ సూచించగా.. అలాచేస్తే సుప్రీంకోర్టు దానిని ఊహాజనితమైన వాదనగా భావించి కొట్టివేసే వీలుందని జైదీప్ గుప్తా తెలియజేశారు. దీంతో జల వనరుల శాఖ ఒక రోజు ఆగింది. మంగళవారం ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో.. దానికి దీటుగా వకాలత్ పేపర్లన్నిటినీ సిద్ధం చేసుకున్న ఆ శాఖ అధికారులు బుధవారం కేవియట్ వేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.