Share News

Dr. Nori Dattatreya: రాష్ట్రంలో క్యాన్సర్‌ అట్లాస్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 06:18 AM

క్యాన్సర్‌ కేసుల నమోదుకు నిర్దేశించిన ‘క్యాన్సర్‌ అట్లాస్‌’ కార్యక్రమం త్వరలో పూర్తవుతుందని ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు.

 Dr. Nori Dattatreya: రాష్ట్రంలో క్యాన్సర్‌ అట్లాస్‌

  • పూర్తయితే మెరుగైన వైద్య సదుపాయాలు

  • ఎన్సీడీ 4.0 ద్వారా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌: నోరి దత్తాత్రేయుడు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ కేసుల నమోదుకు నిర్దేశించిన ‘క్యాన్సర్‌ అట్లాస్‌’ కార్యక్రమం త్వరలో పూర్తవుతుందని ప్రముఖ క్యాన్సర్‌ వ్యాధి నిపుణులు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు. మంగళగిరిలోని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం క్యాన్సర్‌ డీసీజ్‌ బర్డన్‌ 5వ సలహా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో క్యాన్సర్‌ కేసులు నమోదును నూరు శాతం పూర్తి చేస్తే... ఆ అట్లా్‌సలో వచ్చిన వాస్తవ అంకెల ఆధారంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు, వైద్య సదుపాయాలు మెరుగుపరించేందుకు వీలవుతుంది. ఈ అట్లా్‌సను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్‌కు అందచేస్తాం. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లోనే కాకుండా ఎన్సీడీ 4.0 ద్వారా వచ్చే సమాచారాన్నీ క్రోడీకరించి అట్లాస్‌ తయారుచేస్తాం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ ద్వారా చికిత్స పొందుతున్న వారి వివరాల వల్ల ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులుపై ఓ సృష్టత వస్తుంది. బాధితులు చికిత్స ఎక్కడ పొందినా అందుకు సంబంధించిన సమాచారం కూడా సిబ్బందికి అందేలా చర్యలు ఉండాలి. గ్రామాల నుంచి క్యాన్సర్‌ వ్యాధి పరీక్షల కోసం వస్తున్న వారికి ప్రివెంటివ్‌ ఆంకాలజీ యూనిట్లలో ఉండే వారు ప్రాధాన్యమివ్వాలి’ అని డాక్టర్‌ నోరి సూచించారు. క్యాన్సర్‌ వ్యాధులకు చికిత్స అందించే ప్రైవేటు వైద్యులతో ప్రత్యేకంగా ఓ సదస్సు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు. పట్టణాల్లో క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ తెలిపారు. ట్రస్ట్‌ ప్రారంభం నుంచి 3.29 లక్షల మందికి చికిత్స అందించగా రూ.4,616 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 06:18 AM