Share News

CM Chandrababu: గేమ్‌ చేంజర్‌ పాత్రలో రాష్ట్రం..

ABN , Publish Date - Oct 11 , 2025 | 04:18 AM

భారత్‌ 2047కల్లా ప్రబల ఆర్థికశక్తిగా ఆవిర్భవిస్తుందని.. ప్రపంచంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ కూడా దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో...

 CM Chandrababu: గేమ్‌ చేంజర్‌ పాత్రలో రాష్ట్రం..

  • చింతా ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం

  • పేద విద్యార్థులను దత్తత తీసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

  • బయో ఇథనాల్‌ ప్లాంటుతో వాతావరణ సమతుల్యత.. రైతులకూ మేలు

  • ‘నందిని సేవ్‌ ది బుల్‌’ సరికొత్త ఆవిష్కరణ

  • నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం

రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, సంపన్నులను నేను కోరేదొక్కటే. సమాజం మీకెంతో ఇచ్చింది. ఇప్పుడు మీరు సమాజానికి ఇవ్వాల్సిన రోజు వచ్చింది. గివ్‌ బ్యాక్‌ టు ది సొసైటీ. ‘పీ-4’ ద్వారా పేదలకు చేయూతనివ్వండి.

- సీఎం చంద్రబాబు

నెల్లూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): భారత్‌ 2047కల్లా ప్రబల ఆర్థికశక్తిగా ఆవిర్భవిస్తుందని.. ప్రపంచంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ కూడా దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందని చెప్పారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం గేమ్‌ చేంజర్‌ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందని తెలిపారు. విశాఖలో రూ.88 వేల కోట్లతో ఏఐ సెంటర్‌ రాబోతోందని.. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు గేమ్‌ చేంజర్‌ కానుందని వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర బయో ఇథనాల్‌ ప్లాంట్‌ను, ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిధర్‌ పేరుతో నెలకొల్పిన చింతా శశిధర్‌ ఫౌండేషన్‌ నిర్మించిన ‘నందగోకులం లైఫ్‌ స్కూల్‌’, ‘నంది పవర్‌ ట్రెడ్‌మిల్‌ మిషన్‌’, ‘నందగోకులం సేవ్‌ ది బుల్‌’ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, జేసీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. మన ముందు ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు. మనతోపాటు పేద వర్గాలకూ గొప్ప భవిష్యత్‌ అందించే ఉద్దేశంతోనే పీ-4 కార్యక్రమం ప్రవేశపెట్టానని చెప్పారు. దాని స్ఫూర్తిని కొనసాగించే విషయంలో విశ్వసముద్ర సంస్థ, చింతా శశిధర్‌ ఫౌండేషన్‌ సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఇంకా ఏమన్నారంటే..


మూడో తరగతి విద్యార్థులకు ఏఐలో తర్ఫీదు..

‘ఈ రోజు ఇక్కడ చింతా శశిధర్‌ ఫౌండేషన్‌ స్థాపించిన స్కూలును చూశాను. మూడో తరగతి విద్యార్థులు మిషన్‌ మెకనైజేషన్‌, ఏఐలో తర్ఫీదు పొందుతున్నారు. భవిష్యత్‌పై నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. వారి ఆత్మవిశ్వాసం చూసి నాకు ధైర్యం వచ్చింది. రాబోయే తెలుగు తరాల పిల్లలు ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తారు. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు.


ఆర్థిక ఫలాలు పేదలు అందుకోవాలి

ఆర్థిక ఫలాలు పేదలు అందుకోవాలనేదే నా తపన. అందుకే పీ-4 ప్రవేశపెట్టాను. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు... ఇంతకాలం సమాజం నుంచి తీసుకున్నారు. ఇప్పుడు సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చే సమయం వచ్చింది. మీరు సంపాదించినదానిలో కొంత పేదలకు ఇవ్వండి. పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు మారడానికి చేయూతనివ్వండి. శశిధర్‌ ఫౌండేషన్‌ చేసిన సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నందిని లైఫ్‌ స్కూల్‌ ఒక అద్భుత పాఠశాల. పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందిస్తున్నారు. ఇలాంటి స్ఫూర్తి కావాలి. ఫౌండేషన్‌ సేవలు మరింత మందికి ఆదర్శం కావాలి. అప్పుడే పేదరికం లేని సమాజం సాకారం అవుతుంది. విశ్వసముద్ర సంస్థ, శశిధర్‌ ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం. బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ద్వారా వాతావరణ సమతుల్యతతోపాటు రైతులకు మేలు జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బయో ఇథనాల్‌ను వినియోగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అందిపుచ్చుకుని ప్లాంట్‌ ఏర్పాటు అభినందనీయం. ఇక ‘నందిని సేవ్‌ ది బుల్‌’ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎప్పుడూ, ఎక్కడా చేయని సరికొత్త ఆవిష్కరణ. వారసత్వ సంపదగా మానవ నాగరికతతో బలమైన అనుబంధం కలిగిన ఎడ్ల జాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు వాటి ద్వారా సరికొత్త ఆదాయ మార్గాలను ఈ ప్రాజెక్టు చూపింది. ఎద్దులను ట్రెడ్‌మిల్‌పై నడిపించడం ద్వారా విద్యుదుత్పత్తి చేసే విధానం అద్భుతం. బహుశా ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు ఎక్కడా జరిగి ఉండదు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు పశుజాతి సంరక్షణ.. ఇంకోవైపు పేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందిస్తున్న చింతా శశిధర్‌ ఫౌండేషన్‌ను ప్రభుత్వం తరపున అభినందిస్తున్నా.

Updated Date - Oct 11 , 2025 | 07:28 AM