CM Chandrababu: లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 05:44 AM
సముద్ర వాణిజ్యంలో తూర్పు తీరప్రాంత గేట్‌వేగా ఆంధ్ర ప్రదేశ్‌ను మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని వెల్లడించారు.
తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకూ పోర్టు లేదా హార్బర్
వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయండి: చంద్రబాబు
ఏపీఎం టెర్మినల్స్‌తో సీఎం సమక్షంలో ఎంఓయూ
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): సముద్ర వాణిజ్యంలో తూర్పు తీరప్రాంత గేట్‌వేగా ఆంధ్ర ప్రదేశ్‌ను మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఎం టెర్మినల్ సంస్థతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు గురువారం సచివాలయంలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం రూ.9,000 కోట్ల పెట్టుబడితో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలను ఏపీఎం టెర్మినల్స్ కల్పించనుంది. కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దనరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్, ఏపీఎం టెర్మినల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. పోర్టులలో అత్యాధునిక టెర్మినల్స్‌ను, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని ఏపీఎం టెర్మినల్స్ వెల్లడించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రత్యక్షంగా పదివేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్ర తూర్పు తీరప్రాంతాన్ని వాణిజ్య కేంద్రంగా మారుస్తామని.. సరుకు రవాణా ద్వారా రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఏపీలో 1,053 కిమీ సుదీర్ఘ తీరప్రాంతం ఉందని.. ప్రతి 50 కిమీకు ఒక పోర్టు లేదా హార్బర్ నిర్మాణం జరిగేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రణాళికల అమలుతో తీర ప్రాంతాలకు సమీపంలోని నగరాలు.. పరిశ్రమల నుంచి సరుకు రవాణా పెరుగుతుందన్నారు.
హస్తినకు సీఎం చంద్రబాబు
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
సీఎం చంద్రబాబు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం భేటీ కానున్నారు. సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్), పూర్వోదయ పథకాల తరహాలో కేంద్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. రాత్రికి అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.