Share News

Minister Nara Lokesh: జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:58 AM

జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు....

Minister Nara Lokesh: జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌

  • ఉద్యోగాలు సాధించడానికి అకడమిక్స్‌తో ఇండస్ర్టీ అనుసంఽధానం

  • నైతిక విలువలపై చట్టం తెచ్చే యోచన

  • మహిళలను అందరూ గౌరవించాలి

  • విద్యావంతులు, యువకులురాజకీయాల్లో రావాలి: లోకేశ్‌

  • ‘హలో లోకేశ్‌’లో విద్యార్థులతో ముఖాముఖీ

రాజమహేంద్రవరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విస్తృత పర్యటన చేశారు. ఆర్ట్స్‌ కాలేజీలో ప్రారంభోత్సవాలు చేసి విద్యార్థులతో హలో లోకేశ్‌ కార్యక్రమంలో ముఖాముఖి నిర్వహించారు. ఆదికవి నన్నయ్య వర్సిటీలో పలు భవనాలు ప్రారంభించారు. అనంతరం రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల కార్యకర్తల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఆర్ట్స్‌ కాలేజీలో హలో లోకేశ్‌ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. 150 కేసులు వేసినా 150 రోజుల్లో డీఎస్సీ పూర్తి చేశామని, 16 వేలమందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇటీవల 6 వేలమందికి కానిస్టేబుల్‌ ఉద్యోగాలిచ్చామని చెప్పారు. గూగుల్‌ డేటా సెంటర్‌, రిలయన్స్‌ డేటా సెంటర్‌ రానున్నాయని, ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. 2047కి వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, మనం స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విద్యావంతులు, యువకులు రాజకీయాల్లో రావాలని అన్నారు.

పరిశ్రమలకు పనికొచ్చేలా విద్య

‘‘ప్రతి విద్యార్థి జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి సాధన చేయాలి. డిగ్రీ చదివే సమయంలోనే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. గ్రాడ్యుయేట్‌ అయి బయటకు వచ్చినపుడు ఉద్యోగం విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఇండస్ర్టీ అకడమిక్‌తో అనుసంధానం కాకపోవడమే. సర్వేపల్లి రాధాకృష్ణ వంటి గొప్పవారు పాఠాలు చెప్పిన కాలేజీ ఇది. 173 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనే స్టాండ్‌ తీసుకున్నాం. ఒక్కో జిల్లాలో ఒక్కో పరిశ్రమ రావాలి. అనంతపురంలో ఆటోమోటివ్‌, కర్నూలులో రెన్యూవబుల్‌ ఎనర్జీ, చిత్తూరు, కడపలలో ఎలక్ర్టానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, వైద్య పరికరాలను ప్రోత్సహిస్తున్నాం. గోదావరి ప్రాంతాల్లో ఆక్వాను ప్రోత్సహించాలి. చదువు కూడా ఆయా పరిశ్రమలకు పనికి వచ్చేలా ఉండాలి. సుమారు 22 క్లస్టర్లు ఉన్నాయి. ఇండస్ర్టీని అకడమిక్‌కు కనెక్ట్‌ చేయనున్నాం. ప్రధాని మోదీ పీఎం ఇంటర్న్‌షిప్‌ రూపొందించారు. అందులో గతంలో మనం కొంచెం వెనకబడ్డాం. విద్యార్థిగా యూర్‌పలో ఎండాకాలం సెలవుల్లో పనిచేశాను. రియల్‌ లైఫ్‌ ఎర్నింగ్‌ వచ్చింది. అదేలక్ష్యంగా పనిచేస్తున్నాం’’ అని అన్నారు.


విద్యార్థులతో లోకేశ్‌ ముఖాముఖి..

నైతిక విలువలపై పుస్తకాలు

స్ర్తీలను గౌరవించాలని పదేపదే చెబుతున్నారే కానీ సోషల్‌ మీడియాలో ఇబ్బంది ఉంది. మరి ఎలా?

- విద్యార్థిని శ్రీదేవి

లోకేశ్‌: చెల్లీ.. సమాజంలో ఒక మహిళను అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను కళ్లారా చూశాను. నా తల్లిని అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో చూశా. మహిళలను ఎలా గౌరవించాలో ఇంట్లో మనకు అమ్మనాన్న నేర్పించారు. దానిని ఒక ఉద్యమంగా చేయాలనే ఆలోచన ఉంది. చాలా మంది ఎదుటి వ్యక్తిని కించపరిచేటప్పుడు గాజులు తొడుక్కున్నావా.. చీరకట్టావా.. అమ్మాయిలా ఏడవద్దు అని అంటుంటారు. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నైతిక విలువలు చాలా అవసరం. చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలు లక్షలాది మంది వింటారు. అటువంటి వ్యక్తికి క్యాబినెట్‌ ర్యాంకు ఇచ్చి సలహాదారుగా పెట్టుకున్నాం. కరికులమ్‌తో పాటు నైతిక విలువల మీద మీద పుస్తకాలు రూపొందిస్తున్నాం. ప్రతి శనివారం క్లాస్‌ ఏర్పాటు చేస్తాం. ఒక చట్టం తీసుకొస్తే బావుంటుందని బలంగా నమ్ముతున్నా. సినిమాలు, టీవీ షోలలో కూడా మహిళను కించపరుస్తూ ఒక మాట అన్నా సీరియస్‌ యాక్షన్‌ ఉండే విధంగా ఒక చట్టం తీసుకురావాలని ఉంది.

ఇంట్లో లాండ్రీ పనులు చేశాం

మీది ఎరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ కదా.. ఇవాళ లవ్‌ మ్యారేజ్‌లు సక్సెస్‌ కావడం లేదు.. మీ జీవితం ఎలా ఉంది?

- ఓ విద్యార్థి

లోకేశ్‌: మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నాకు పెళ్లయి 19 ఏళ్లయింది. పెళ్లయిన తర్వాత అమెరికాలో కొంతకాలం ఉన్నాం. లాండ్రీ పనులు ఇద్దరం కలిసి చేశాం. లైఫ్‌లో ప్రతిదీ గివ్‌ అండ్‌ టేక్‌గా ఉండాలి. ఇవాళ జనరేషన్‌లో ప్రతీ చిన్న విషయానికి డిజగ్రిమెంట్లు వస్తున్నాయి. తల్లిదండ్రులు, అవ్వాతాతలను చూసి నేర్చుకోవాలి. ప్రపంచంలో అతి తక్కువ విడాకుల కేసులు మన దేశంలోనే.


ట్రోల్‌ చేసినా పట్టించుకోలేదు

మీరు లావుగా ఉండేవారు. మిమ్మల్ని గతంలో కొందరు ట్రోల్‌ చేసినప్పుడు బాధపడ్డారా? ఏదైనా ఒత్తిడికి గురయ్యారా? ఇవాళ చాలా ఫిట్‌గా ఉన్నారు.

- విద్యార్థి కార్తికేయ

లోకేశ్‌: లైఫ్‌ ఈజ్‌ జర్నీ.. ఈజ్‌ నాట్‌ డెస్టినేషన్‌. సమాజంలో సాధించాలని గోల్‌ పెట్టుకుని పరిగెట్టాను. ట్రోల్‌ చేసినా పట్టించుకోలేదు. నేను భయపడలేదు. సమస్యలను మనం చాలెంజ్‌గా తీసుకోవాలి.

అమ్మ కొట్టిందా? విద్యార్థిని హర్షవర్థిని

లోకేశ్‌: అమ్మే నా స్థాయికి కారణం అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి.. అమ్మకు చెప్పలేని పని ఏదీ చేయకూడదు.. ఇది చాగంటి చెప్పారు. చిన్నప్పుడు తప్పు చేస్తే అమ్మ గట్టిగానే కొట్టేది. అమ్మ ప్రేమ అన్‌ కండీషనల్‌. అమ్మ వద్ద క్రమశిక్షణ నేర్చుకున్నా. అమ్మే నా స్థాయికి కారణం.

మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్‌ చేశారా?

- విద్యార్థి భరత్‌

లోకేశ్‌: నీవే నన్ను ర్యాగింగ్‌ చేస్తున్నట్టు ఉన్నావు (నవ్వుతూ). ర్యాగింగ్‌ లేదు. ఫ్రెండ్లీగా సరదాగా ఉండేవాళ్లం. నా లైఫ్‌ ఫార్టనర్‌ బ్రాహ్మణి ఉంది. అనవసరంగా చిచ్చు పెట్టకురా బాబు. ఆమె నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ క్రష్‌.

సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన లెక్చరర్‌ ఎన్‌.శ్రీనివా్‌స.. సార్‌ అని లోకేశ్‌ను పిలవగా.. ‘గురువు గారూ లోకేశ్‌ అని పిలవండి. సార్‌ అని సంభోదించడం కరెక్ట్‌ కాదు’ అని అన్నారు.


చట్టాన్ని ఉల్లంఘించినవారిని వదలం

‘ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరినీ కూటమి ప్రభుత్వం వదలిపెట్టదు’ అని లోకేశ్‌ అన్నారు. రాజమహేంద్రవరం చెరుకూరి ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. అభివృద్ధిలో పాల్గొన్నవారిని కూడా అరెస్ట్‌ చేస్తానంటున్నాడు. జగన్‌ రెడ్డి బెదిరింపులు మరోసారి ఆయన నైజాన్ని బయటపెట్టాయి. చంద్రబాబును 53 రోజులు ఇక్కడే జైలులో పెట్టాడు. ఏం సాధించారు. అరెస్ట్‌ చేస్తే మేం భయపడాలా? నీ కంటే ముందు చాలా మంది పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. వారందరి పరిస్థితి ఏమైందో అందరూ ఆలోచించాలి. పార్టీని భూస్థాపితం చేస్తామని కొందరు ప్రగల్భాలు పలికారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది. నేతలపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చెప్పాం. టీడీపీలో అలక జబ్బు ఒకటి ఉంది. ఎమ్మెల్యేతో ఏవైనా ఇబ్బందులు ఉంటే కార్యకర్తలు అలక వహించడం కాదు. నాలుగు గోడల మధ్య పోరాడి పరిష్కరించుకోండి. అంతకూ వినకపోతే నాకు చెప్పండి’ అని అన్నారు.

జగన్‌... యువతపై ఎందుకీ ద్వేషం?

ఐటీ కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైసీపీ తీసుకున్న వైఖరిని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ‘ఏపీ యువతకు సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, సత్త్వ, రహేజా ఐటీ పార్కులను అడ్డుకునేందుకు వైసీపీ ప్రజా ప్రయోజన వాజ్యాలను దాఖలు చేసింది. జగన్‌... రాష్ట్ర యువత భవిష్యత్తుపై మీకు ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు.

Updated Date - Dec 20 , 2025 | 05:58 AM