Share News

AP CM Chandrababu Naidu: ఏపీ టు ఏఐ

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:01 AM

విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు సానుకూల విధాన రూపకల్పనపైనా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

AP CM Chandrababu Naidu: ఏపీ టు ఏఐ

  • అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు: సీఎం

  • కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు,మంత్రులు, నిపుణులకూ ఆహ్వానం

  • పెట్టుబడులు, ఒప్పందాలపైనే కాదు విజ్ఞానం పంచుకోవడంపైనా మేధోమథనం

  • ప్లీనరీ, బ్రేకవుట్‌ సెషన్లు నిర్వహించాలి

  • ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తల మధ్య చర్చలు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆవిష్కరణలపైనా..

  • పరిశోధన-అభివృద్ధి, అంతరిక్షం, డ్రోన్‌,ఎలక్ర్టానిక్స్‌, మెడ్‌టెక్‌, లాజిస్టిక్స్‌పై కూడా

  • పారిశ్రామిక ప్రగతికి పాలసీలే కీలకం

  • రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాల వల్లే భారీ పెట్టుబడులతో దిగ్గజ కంపెనీల రాక

  • గూగుల్‌తో హ్యాపెనింగ్‌ సిటీగా విశాఖ

  • మానవ వనరులే అతిపెద్ద మూలధనం

  • సదస్సుపై అధికారులతో బాబు సమీక్ష

విశాఖ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో వనరులు, పెట్టుబడుల అవకాశాలను వివరించేలా ప్రజెంటేషన్లు సిద్ధం చేయాలి. ‘21వ శతాబ్దం భారత్‌దే’ అన్న విధానంలో ప్రజెంటేషన్లు ఉండాలి.

పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ విధానాలే కీలకం. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక పాలసీల వల్లే గూగుల్‌ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చాయి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు సానుకూల విధాన రూపకల్పనపైనా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా విజ్ఞానం పంచుకోవడం, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. కృత్రిమ మేధ(ఏఐ)కు రాష్ట్రం చిరునామా కావాలన్నారు. ‘ఏపీ టూ ఏఐ’ అన్న నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌, ఆ శాఖ ఉన్నతాధికారులు, సులభతర వాణిజ్య విభాగం (ఈడీబీ) అధికారులు హాజరయ్యారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెన ర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.


విశాఖ సదస్సులో దావోస్‌ తరహాలోనే పెట్టుబడిదారులు, విధాన రూపకర్తల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెప్పారు. నాలెడ్జ్‌ షేరింగ్‌ కోసం ప్లీనరీ సెషన్లు, బ్రేకవుట్‌ సెషన్లు నిర్వహించాలని సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్లలో విధానాలపై మేధోమధనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులను, నిపుణులను కూడా సదస్సుకు ఆహ్వానించాలని చెప్పారు. జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలన్నారు. దేశ ప్రయోజనాలు ఆశించి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఈ భాగస్వామ్య సదస్సును ఏపీ నిర్వహిస్తుందని తెలిపారు. ఏఐ ఫర్‌ గుడ్‌, సెమీకండక్టర్లు, ఆరోగ్య రంగం, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, అంతరిక్షం, డ్రోన్‌, ఎలక్ర్టానిక్స్‌, మెడ్‌ టెక్‌, స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, చైన్‌ లింకేజీతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీపైనా చర్చ జరగాలని చెప్పారు. లాజిస్టిక్స్‌ రంగంలో రహదారులు, అంతర్గత జలరవాణా, వేర్‌ హౌస్‌, కోల్డ్‌ స్టోరేజీలు.. అగ్రిటెక్‌, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌లో విలువ జోడింపు, స్వచ్ఛాంద్ర, సర్క్యులర్‌ ఎకానమీ, పీ-4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.


నిరంతరం నైపుణ్య కల్పన..

విశాఖలో 5 బిలియన్‌ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్‌ డేటా ఏఐ హబ్‌ ఏర్పాటు చేస్తోందని.. ఆ సంస్థ రాకతో విశాఖ హ్యాపెనింగ్‌ సిటీగా మారిందని సీఎం చెప్పారు. సానుకూల విధానాలతోనే పెట్టుబడులు వస్తాయని.. అప్పుడే సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుందన్నారు. ‘పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య కల్పన నిరంతర ప్రక్రియగా ముందుకు సాగాలి. మానవ వనరులే మనకు ఉన్న అతిపెద్ద మూలధనం. వీటన్నిటిపైనా భాగస్వామ్య సదస్సులో చర్చ జరగాలి’ అని పేర్కొన్నారు. విశాఖ సదస్సుకు హాజరయ్యే వారికి హోం స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. చర్చించాల్సిన వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్తలాంటి కార్యక్రమాలను అనుసంధానించాలన్నారు. ‘ఏపీ టూ ఏఐ’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆర్థిక కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లు, అమరావతి బ్లూ గ్రీన్‌ క్యాపిటల్‌, జలభద్రత, ఫ్యూచరిస్టిక్‌ వర్క్‌ ఫోర్స్‌, సుపరిపాలనలో టెక్నాలజీ అనునసంధానం లాంటి అంశాలను సదస్సులో ప్రస్తావించాలని చెప్పారు.

Updated Date - Oct 20 , 2025 | 06:13 AM