AP TDP Ministers : టీడీపీ పాలనలోనే రైతులకు మేలు
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:28 AM
వైసీపీ పాలనలో రైతులను పట్టించుకోలేదని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రైతాంగానికి టీడీపీ పాలనలోనే మేలు జరుగుతుందని చెప్పారు.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై మంత్రుల హర్షం
చంద్రబాబు ఫ్లెక్సీకి ధాన్యాభిషేకం చేసిన నిమ్మల
పొలంలో దిగి నాట్లు వేసిన హోంమంత్రి అనిత
గాజువాకలో రైతులకు చెక్కు అందజేసిన డోలా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వైసీపీ పాలనలో రైతులను పట్టించుకోలేదని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. రైతాంగానికి టీడీపీ పాలనలోనే మేలు జరుగుతుందని చెప్పారు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సందర్భంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో నిమ్మల పాల్గొన్నారు. పాలకొల్లులో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా, మంత్రి స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టతరంగా ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. కౌలు రైతులకు కౌలు కార్డుల ప్రక్రియను పూర్తిచేసి కేంద్రం సాయం అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రూ.20 వేలు అందజేస్తుందన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మార్కెట్‌యార్డులో 2.27 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధులను హోంమంత్రి అనిత విడుదల చేశారు. గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ సమీప పొలాల్లో వరినాట్లు వేస్తున్న రైతులు, కూలీలతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వరి మడిలోకి దిగిన నాట్లు వేశారు. ఆమె మాట్లాడుతూ రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు సేంద్రియ సాగు చేసేందుకు ముందుకు రావాలని కోరారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతన్నలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించి ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని చెప్పారు. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందన్నారు.