Science Exposure Tour: రాష్ట్రపతి భవన్‌కు ఏపీ విద్యార్థులు
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:57 AM
ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 52 మంది రెండో రోజు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు.
స్పేస్ టెక్నాలజీపై అవగాహన కల్పించిన శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 52 మంది రెండో రోజు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌ను వెళ్లగా అక్కడి గైడ్‌లు భవన నిర్మాణ విశిష్ఠతలను విద్యార్థులకు దగ్గరుండి వివరించారు. అంతకుముందు రష్యన్ సోషల్ సైన్స్ కల్చరల్ సెంటర్‌లో స్పేస్ టెక్నాలజీపై అక్కడి శాస్త్రవేత్తలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. రష్యన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిపి రెండు కేటగిరీలలో నిర్వహించిన పోటీలలో మొత్తం ఆరుగురు విజేతలుగా నిలిచారు. వారిలో నలుగురు ఏపీ విద్యార్థులే కావడం గమనార్హం. దేశంలోని పేరెన్నికగన్న కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులను ఓడించి ఏపీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ పేరిట నిర్వహస్తున్న ఈ పర్యటన చివరి రోజైన శనివారం విద్యార్థులకు నెహ్రూ ప్లానెటోరియంలో నాసా ఇంజనీర్లతో ముఖాముఖి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ప్రధాని సంగ్రాలయాన్ని (మ్యూజియం) విద్యార్థులు సందర్శించానున్నారు.