Share News

Minister Anagani Satya Prasad: త్వరలోనే ఫ్రీహోల్డ్‌కు స్వేచ్ఛ

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:50 AM

అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌పై ఉన్న నిషేధం త్వరలో తొలగిపోనుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం వెలువరించనుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని...

 Minister Anagani Satya Prasad: త్వరలోనే ఫ్రీహోల్డ్‌కు స్వేచ్ఛ

  • నిషేధం నుంచి భూములకు విముక్తి

  • మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చ

  • వచ్చే సమావేశంలో అధికారిక నిర్ణయం

  • భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు

  • ఇకపై ఇచ్చేది లీజు ప్రాతిపదికనే

  • వక్ఫ్‌ అధికారులపై మంత్రుల ఆగ్రహం

  • భూములు అమ్మాలన్న ప్రతిపాదన తిరస్కరణ

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌పై ఉన్న నిషేధం త్వరలో తొలగిపోనుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం వెలువరించనుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన నేతృత్వంలో ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ, కె.పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977లో చేసిన చట్టసవరణ, నిబంధనలకు లోబడి ఉన్న భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల్లోని పలు అంశాలపై కూడా కీలక ప్రతిపాదనలు చేసింది. వాటన్నిటికీ ఉపసంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఫ్రీహోల్డ్‌ కింద కొన్ని రకాల భూములను అనుమతించకూడదని ఆ శాఖ చేసిన ప్రతిపాదనలపై వచ్చే సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.


నాడు 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్‌

అసైన్డ్‌ భూమి కేటాయించి 20 ఏళ్లు పూర్తయి, లబ్ధిదారుల చేతుల్లోనే భూమి ఉంటే వాటిని నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని, ఆ తర్వాత రైతులకు ఆ భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని జగన్‌ ప్రభుత్వం 2023లో అసైన్డ్‌ చట్టాన్ని సవరించింది. ఈ విధానం అమలుకు 2023 డిసెంబరులో జీవో 596 తీసుకొచ్చింది. అయితే నాటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలు కుమ్మక్కై.. 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే విచారణ చేయించింది. జగన్‌ సర్కారు 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధ బాబితా నుంచి తీసేసినట్లు తేలింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని గత ఏడాది ఆగస్టులోనే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించింది. ఈ సమస్య తేలేవరకు నిషేధం పొడిగిస్తూ వస్తోంది.. సమస్య పరిష్కారానికి ఈ ఏడాది మార్చిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. చర్చోపచర్చలు సాగినా అది కూడా సత్వర నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వీలైనంత త్వరగా ఫ్రీహోల్డ్‌ భూములపై నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో గత రెండు సమావేశాల్లో ఉపసంఘం కీలక అంశాలపై చర్చలు జరిపింది. అసైన్డ్‌ చట్టం పరిధిలో ఉండి.. జీవో 596 మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధించిన 7.85 లక్షల ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్‌కు అనుమతించాలని రెవెన్యూ శాఖ తాజాగా ప్రతిపాదించింది. భూమి లబ్ధిదారు చేతిలోనే ఉండి సాగు చేసుకుంటుంటే.. అలాంటి వాస్తవికమైన కేసుల్లో ఫ్రీహోల్డ్‌ జరిగేలా చూడాలని సూచించింది. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. పోరంబోకు, షరతుగల పట్టాలున్న భూములు, చుక్కల భూములు, సర్వీస్‌ ఇనాం (దేవదాయ) భూములపై వచ్చే సమావేశంలో చ ర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్దంగా నిషేధ జాబితా నుంచి తొలగించిన 5.74 లక్షల ఎకరాల భూములను తిరిగి 22ఏలో చేర్చాలన్న ప్రతిపాదనను కూడా సబ్‌కమిటీ ఆమోదించింది. అలాగే పరిశ్రమలు, కంపెనీలు, సంస్థలు మొదలైనవాటికి ఇకపై లీజు ప్రాతిపదికనే కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది.


వక్ఫ్‌ భూములు కాపాడలేక విక్రయించాలంటారా?

అధికారులపై మంత్రుల ఆగ్రహం

రాష్ట్రంలో వేల కోట్ల విలువైన వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతంపై మంత్రివర్గ ఉపసంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన భూములు దురాక్రమణకు గురవుతున్నాయని మం త్రులు అనగాని, పయ్యావుల సబ్‌కమిటీ భేటీలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎలాగూ ఆ భూములను కాపాడలేకపోతున్నాం. వాటిని అమ్మేయడమో.. లేదా ఆక్రమించుకున్న వారికే రెగ్యులరైజ్‌ చేయడమో పరిశీలన చేయండి’ అని మైనారిటీ సంక్షేమ శాఖలోని కీలక అధికారి సూచించినట్లు తెలిసింది. మంత్రులిద్దరూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నారు? చేతకావడం లేదని భూములను అమ్మేస్తామా? కబ్జా చేసినోడికే రెగ్యులరైజ్‌ చేయమంటారా? కబ్జాలు జరుగుతుంటే మీరు, వక్ఫ్‌ సర్వే అధికారులు ఏం చేస్తున్నారు? మీరు చెప్పినట్లే చేస్తే.. వక్ఫ్‌ భూములను దోచుకుంటున్నారని, హస్తగతం చేసుకుంటున్నారని మాపై రాజకీయ దాడి చేయరా? వక్ఫ్‌ భూములను కాపాడాల్సిందే. కబ్జాల నుంచి రక్షించడానికి పోలీసు శాఖ సహకారం తీసుకోండి. మీవల్ల కాదంటే చెప్పండి.. మరో అధికారికి అప్పగిస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.

Updated Date - Oct 25 , 2025 | 04:51 AM