Share News

New Districts: ఏపీలో కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:46 AM

రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పోలవరం ముంపు మండలాల వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు..

New Districts: ఏపీలో  కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు

  • కొత్తగా పోలవరం, మార్కాపురం, మదనపల్లె

  • రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా

  • మార్కాపురం, మదనపల్లెతో కలిపి 3 కొత్త జిల్లాలు

  • మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు

  • మండపేట నియోజకవర్గం తూర్పులోకి

  • అద్దంకి, కందుకూరు.. ప్రకాశంలో విలీనం

  • ఇక ‘వాసవీ పెనుగొండ మండలం’

  • ఆదోని మండలం పునర్వ్యవస్థీకరణ

  • కొత్తగా పెద్ద హరివాణం ఏర్పాటు

  • కొన్ని మండలాలు వేర్వేరు డివిజన్లలోకి

  • ముఖ్యమంత్రితో ఉప సంఘం భేటీ

  • సవరించిన నివేదికకు చంద్రబాబు ఓకే

  • ఫైలుకు నేడు ఆన్‌లైన్‌లో మంత్రుల ఆమోదం

  • ఆ వెంటనే ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్లు

  • అభ్యంతరాలకు నెల రోజులు గడువు

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పోలవరం ముంపు మండలాల వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు.. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలోని ఈ సబ్‌కమిటీ కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణను కొలిక్కితెచ్చింది. మంగళవారం సీఎంను కలిసి, సవరించిన అధ్యయన నివేదికను సమర్పించింది. అందులో మూడు కొత్త జిల్లాలు.. మార్కాపురం, మదనపల్లె, పోలవరంతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు..(నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె),కొత్తగా పెద్ద హరివాణం మండలంఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. సదరు నివేదికపై చంద్రబాబు ఉపసంఘం సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం నివేదికను సీఎం ఆమోదించారు. 3 కొత్త జిల్లాలు, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలం ఏర్పాటుకు ఉపసంఘం సిఫారసు చేసింది. కొన్ని నియోజకవర్గాలను, మండలాలను వేర్వేరు జిల్లాలు, డివిజన్లకు మార్చాలని సూచించింది. మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైలును రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. బుధవారం దానిని మంత్రులకు సర్క్యులేట్‌ చేసి ఆన్‌లైన్‌లోనే ఆమోదం తీసుకుంటారు. ఆ వెంటనే రెవెన్యూ శాఖ ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషన్లు జారీచేస్తుంది. అభ్యంతరాలకు నెల రోజులు గడువిస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇస్తారు.


ప్రతిపాదిత జిల్లాలు, డివిజన్ల స్వరూపం..

ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలున్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలం రాకతో ఇక 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు అవుతాయి.

5 రెవెన్యూ డివిజన్లు ఇలా..

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 77 రెవెన్యూ డివిజన్లకు మరో ఐదు కలవనున్నాయి. నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. వాస్తవానికి మొదట 4 డివిజన్లకే సిఫారసు చేసింది. అయితే ముఖ్యమంత్రితో మంగళవారం సమావేశమైనప్పుడు.. కొత్తగా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రాన్ని కూడా డివిజన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆదోని మండలాన్ని విభజించి..

కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా పెద్దహరివాణం మండలం ఏర్పాటు చేయాలన్న ఉపసంఘం సిఫార సును సీఎం ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 680కి చేరనుంది.


ఉపసంఘం సిఫారసులు ఇవే..

  • శ్రీకాకుళం జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస డివిజన్‌ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చాలి. దీంతో టెక్కలి నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌ పరిధిలో ఉంటుంది.

  • పాయకరావుపేట, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల మండలాలను కొత్తగా ఏర్పాటు చేసే నక్కపల్లి డివిజన్‌లో కలపాలి.

  • నర్సీపట్నం డివిజన్‌లో ఉన్న వడ్డాది మాడుగుల, చీడికాడ మండలాలను అనకాపల్లి డివిజన్‌లోకి తీసుకురావాలి. దీనివల్ల మాడుగుల నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉంటుంది.

  • కాకినాడ జిల్లా సామర్లకోట మండలాన్ని పెద్దపురం డివిజన్‌కు మార్చాలి. అప్పుడు పెద్దాపురం నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌ పరిధిలోకి వస్తుంది.

  • రాయవరం, మండపేట, కపిలేశ్వరపురం మండలాలతో కూడిన మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్‌లో కలపాలి. అంటే నియోజకవర్గం మొత్తాన్నీ తూర్పుగోదావరిలో కలుపుతారన్న మాట. అప్పుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా ఆరు అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల సంఖ్య 8కి చేరుతుంది.

  • పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవీ పెనుగొండగా మార్చాలి.

  • టీడీపీ యువనేత లోకేశ్‌ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన.

  • ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలి. సీఎం చంద్రబాబు హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని కూడా తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకురావాలి.


  • నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను గూడూరు డివిజన్‌లో కలపాలి. ప్రస్తుతం ఈ డివిజన్‌ తిరుపతి జిల్లాలో ఉంది.

  • పలమనేరు డివిజన్‌లో ఉన్న బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లో కలపాలి. దీంతో పూతలపట్టు నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉంటుంది.

  • పలమనేరు డివిజన్‌లో ఉన్న చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె డివిజన్‌లో కలపాలి.

  • కడప జిల్లా ఒంటిమిట్ట మండలాన్ని రాజంపేట డివిజన్‌లో కలపాలి. దీంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్‌లోకి వస్తాయి.

  • శ్రీసత్యసాయి జిల్లా కదిరి డివిజన్‌లో ఉన్న అమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్‌లో విలీనం చేయాలి.

  • ఇదే జిల్లా గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్‌ నుంచి.. తిరిగి పెనుకొండ డివిజన్‌లో కలపాలి.

  • డోన్‌, నంద్యాల డివిజన్‌లో ఉన్న మండలాలను విడదీసి కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేయాలి. ఇందులో అవుకు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలు ఉంటాయి. బనగానపల్లె నియోజకవర్గానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


29వ జిల్లాగా పోలవరం..

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటుచేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. దీనిలో మొత్తం 11 మండలాలు.. రంపచోడవరం డివిజన్‌లోని 7 మండలాలు (రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి).. చింతూరు డివిజన్‌లోని 4 మండలాలు (యటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం) ఉంటాయి. నిజానికి ముంపు మండలాలతో తొలుత పోలవరం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని ఉపసంఘం భావించినా సీఎం వద్దన్నారు. ముంపు మండలాల అభివృద్ధికి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని లోగడ ఆయన అరకులో టీడీపీ నిర్వహించిన సభలో హామీ ఇచ్చారు. ఆ మేరకే జిల్లాను ఏర్పాటు చేద్దామని సూచించారు. దీంతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని ఉపసంఘం సిఫారసు చేసింది. పోలవరం నియోజకవర్గం దీని పరిధిలో లేకున్నా.. జిల్లాకు పోలవరం పేరు పెట్టడం గమనార్హం.

మదనపల్లె జిల్లా

మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 19 మండలాలతో 27వ జిల్లాగా దీనిని ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనిలో మదనపల్లె డివిజన్‌లోని 11 మండలాలు (మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, ములకలచెరువు, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, చౌడేపల్లి, పుంగనూరు).. కొత్తగా ఏర్పడే పీలేరు డివిజన్‌లోని 8 మండలాలు.. (సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం) ఉంటాయి.

మార్కాపురం జిల్లా

ప్రకాశం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలతో ప్రత్యేక మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలన్న ఉపసంఘం సిఫారసును ముఖ్యమంత్రి ఆమోదించారు. ఇది 28వ జిల్లా. ఇందులో మార్కాపురం డివిజన్‌లోని 9 మండలాలు (యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల).. క నిగిరి డివిజన్‌లో 12 మండలాలు (హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్ద చెర్లోపల్ల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు) ఉంటాయి.


  • 9 జిల్లాల్లో మార్పుల్లేవ్‌!

ఊహాగానాలకు, కోరికలకు చెక్‌

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటు, జిల్లా ప్రధాన కేంద్రాల మార్పుపై ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి అనేక విన్నపాలు వచ్చాయి. అందులో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు.. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాన్ని భీమవరం నుంచి నరసాపురానికి మార్చాలన్న సూచనలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఈ అంశాల జోలికి ఇప్పుడు వెళ్లొద్దని, అవసరాన్ని బట్టి తర్వాత పరిశీలిద్దామని సూచించడంతో ఉపసంఘం ఆ ప్రతిపాదనలు చేయలేదని తెలిసింది. దీంతో జిల్లా, డివిజన్‌ కేంద్రాల మార్పుపై ఊహాగానాలకు, నేతల వినతులకు చెక్‌ పెట్టినట్లయింది. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పుచేర్పులనూ ప్రతిపాదించలేదు.

Updated Date - Nov 26 , 2025 | 06:41 AM