Share News

POCSO Court: బాలికా సంరక్షణపై రేపు రాష్ట్రస్థాయి సదస్సు

ABN , Publish Date - Sep 13 , 2025 | 06:14 AM

రాష్ట్రంలోని వివిధ రంగాల భాగస్వాములతో బాలికల సంరక్షణ అంశంపై ఏపీ హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ ఆదివారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది.

POCSO Court: బాలికా సంరక్షణపై రేపు రాష్ట్రస్థాయి సదస్సు

  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న హైకోర్టు సీజే ఠాకూర్‌

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ రంగాల భాగస్వాములతో బాలికల సంరక్షణ అంశంపై ఏపీ హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ ఆదివారం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఏపీ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీల సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా జరిగే ఈ సదస్సుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ముఖ్య అతిథిగా, ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రేవతి మోహితి ధరే ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. వీరితోపాటు జేజేసీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, సభ్యులు జస్టిస్‌ వి.సుజాత, డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ కిరణ్మయి మండవ, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. ఈ సదస్సులో బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బాలికల హక్కుల, వారి సంరక్షణకు ఉన్న చట్టాలు, ప్రభుత్వ పథకాలు, వాటి అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించనున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, జువైనల్‌ జస్టిస్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, పోక్సో కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు, యునిసెఫ్‌ ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని హైకోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ నోడల్‌ అధికారి, రిజిస్ట్రార్‌(అడ్మిన్‌) వి.ఎస్.ఎస్‌. శ్రీనివాస్‌ శర్మ తెలిపారు.

Updated Date - Sep 13 , 2025 | 06:15 AM