రాష్ట్రాభివృద్ధికి పూర్తి సహకారం: మోదీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:11 AM
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం పూర్తి మద్దతు అందిస్తుంది అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
ప్రధాని, హోం మంత్రిని కలిసిన టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏపీ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం పూర్తి మద్దతు అందిస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేసినందుకు, అమెరికా విధించిన టారి్‌ఫల నుంచి రైతన్నల ప్రయోజనాలు కాపాడతానని ప్రకటించినందుకు టీడీపీ ఎంపీలు మోదీని పార్లమెంట్‌లో కలసి అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా టీడీపీ ఎంపీలందరూ మోదీని కలసి సత్కరించారు. కాగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా పరిచయం చేసినపుడు.... ‘ఆయన నాకు బాగా తెలుసు. లోక్‌సభకు ఒక్క రోజు కూడా వదలకుండా హాజరవుతారు. ఎప్పుడూ కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తారు’ అని మోదీ అభినందించారు. ఎంపీని ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ దీవించారు. కాగా, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర నిధులు, పథకాలను గరిష్ఠ స్థాయిలో రాబట్టేందుకు ‘ఇంపాక్ట్’ అనే పద్ధతిని అనుసరిస్తున్నామని టీడీపీ ఎంపీలు ప్రధానికి వివరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమలుచేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వివిధ మంత్రిత్వ శాఖల్లో 70శాతానికి పైగా పథకాలను ఏపీలో అమలు చేయగలుగుతున్నామని తెలిపారు.
ఆర్‌డీటీకి విదేశీ విరాళాలపై అమిత్ షాకు విజ్ఞప్తి
అనంతపురంలోని రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టుకు(ఆర్‌డీటీ) ఎఫ్‌సీఆర్‌ఏ గుర్తింపును పునరుద్ధరించి విదేశీ విరాళాలకు వీలు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపీలు, తదితరులు హోంమంత్రి అమిత్ షాను కోరారు. 1969 నుంచీ ఆర్‌డీటీ రాజకీయాలు, మతాలకు అతీతంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ సంస్థ ఇప్పటివరకూ 4,50,000 కుటుంబాలకు చేయూతనిచ్చిందన్నారు. ఆర్‌డీటీ నమోదును పునరుద్ధరించకపోవడం వల్ల ప్రజలకు తీరని నష్టం జరిగింద ని తెలిపారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించారు.