AP Bar Policy: 57 వేల మందికి ఓ బార్
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:48 AM
రాష్ట్రంలో ప్రస్తుతం 56,847 మంది ప్రజలకు ఒక బార్ ఉంది. రాష్ట్ర జనాభా 5 కోట్లకు పైగా ఉంటే 890 బార్లు ఉన్నాయి. వాటిలో సాధారణ బార్లు 840, స్టార్ హోటళ్లలో బార్లు 41, మైక్రో బ్రూవరీలు 9ఉన్నాయి
రాష్ట్రంలో 5 కోట్ల జనాభాకు 890 బార్లు
నేడు క్యాబినెట్ ముందుకు కొత్త బార్ పాలసీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రస్తుతం 56,847 మంది ప్రజలకు ఒక బార్ ఉంది. రాష్ట్ర జనాభా 5 కోట్లకు పైగా ఉంటే 890 బార్లు ఉన్నాయి. వాటిలో సాధారణ బార్లు 840, స్టార్ హోటళ్లలో బార్లు 41, మైక్రో బ్రూవరీలు 9ఉన్నాయి. కొత్త బార్ పాలసీని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో దేశంలోని ఏడు రాష్ర్టాల్లోని బార్ పాలసీలతో ఏపీ ప్రస్తుత బార్ పాలసీని ఎక్సైజ్ శాఖ పోల్చింది. ఈ వివరాలను సోమవారం సీఎం వద్ద జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. తెలంగాణలో ప్రతి 30,145 మందికి ఒక బార్ ఉంది. కర్ణాటకలో 16,469 మందికి, తమిళనాడులో 87,713 మందికి, కేరళలో 45,528 మందికి, రాజస్థాన్‌లో 57,530 మందికి, ఉత్తరప్రదేశ్‌లో 2,41,596 మందికి, మహారాష్ట్రలో 6 వేల మందికి ఒకటి చొప్పున బార్లు ఉన్నాయి. తెలంగాణలో 1,238, కర్ణాటకలో 3,710, తమిళనాడులో 822, కేరళలో 738, రాజస్థాన్‌లో 1,182, యూపీలో 827, మహారాష్ట్రలో 21వేల బార్లు ఉన్నాయి. ఏపీలో 2022లో పాలసీ ప్రవేశపెట్టినప్పుడు 3 కేటగిరీల్లో కనీస ఫీజు రూ.15 లక్షలు, గరిష్ఠ ఫీజు రూ.50 లక్షలుగా ఖరారు చేశారు. ఇప్పుడు గరిష్ఠ ఫీజు కార్పొరేషన్లలో రూ.60లక్షలు దాటింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. కాగా కొత్త బార్ పాలసీలో ఫీజులను రూ.35 లక్షలు, రూ. 55 లక్షలు, రూ.75 లక్షలుగా ఖరారు చేశారు. గత పాలసీలో దరఖాస్తు రుసుం 3కేటగిరీల్లో రూ.5లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు అందరికీ రూ.5లక్షలుగా ఖరారుచేశారు. కచ్చితంగా ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తామనే నిబంధన పెట్టాలని నిర్ణయించడం ప్రతికూలంగా మారనుందనే వాదన వినిపిస్తోంది. ఏదైనా బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకపోతే అది దక్కించుకోవాలనుకున్న వ్యాపారి మిగిలిన 3 దరఖాస్తులు సమర్పించాలి.
ఇది ఆ వ్యాపారికి ఆర్థిక భారం అవుతుందని చెబుతున్నారు. అలాగే మద్యం షాపుల తరహాలోనే గీత కులాలకు 10ు బార్లు కేటాయించారు. వారికి 50 శాతం లైసెన్స్ ఫీజులతోనే బార్లు కేటాయిస్తారు. దీనిపై సాధారణ బార్ల వ్యాపారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోలు చేసే సమయంలో షాపులతో పోలిస్తే బార్లు 10శాత అదనంగా చెల్లించాల్సి వస్తోంది. తొలుత దీనిని తొలగించాలనుకున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ అంగీకరించకపోవడంతో అదే విధానం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిబంధనలతోనే బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీ ప్రతిపాదన పెట్టనున్నారు. క్యాబినెట్ ఆమోదం అనంతరం గురువారం కొత్త పాలసీపై మార్గదర్శకాలు జారీచేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమైంది.