Share News

GST Collection: రాష్ట్ర రాబడి పైపైకి!

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:19 AM

వస్తు, సేవల పన్ను జీఎస్టీ-2.0 శ్లాబుల మార్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతుందన్న వాదన బుట్టదాఖలైంది...

GST Collection: రాష్ట్ర రాబడి పైపైకి!

  • కేంద్రం, రాష్ట్రంలో పెరిగిన పన్ను వసూళ్లు

  • దేశంలో గత ఏడాదికంటే 9.1 శాతం అధికం

  • రాష్ట్రంలో 4 శాతం మేరకు పెరిగిన ఆదాయం

  • శ్లాబులు మారితే ఆదాయం తగ్గుతుందన్న మార్కెట్‌ నిపుణుల వాదన బుట్టదాఖలు

అమరావతి, అక్టోబరు 1(ఆంధజ్ర్యోతి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ-2.0) శ్లాబుల మార్పుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతుందన్న వాదన బుట్టదాఖలైంది. నిత్యావసరాలు సహా.. ఇతర వస్తుల పన్నులు తగ్గుడంతో వాటి విక్రయాలు పెరిగాయి. దీంతో సెప్టెంబరు నెల ద్వితీయార్ధంలో దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. అయితే, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. గత ఏడాది(2024) సెప్టెంబరులో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లుగా నమోదుకాగా.. ఈ ఏడాది అదే నెలలో రూ.1.89 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంటే 9.1 శాతం మేర పెరుగుదల కనిపించింది. అదేసమయంలో ఈ ఏడాది ఆగస్టులో వసూలైన రూ.1.86 లక్షల కోట్ల పన్నులతో పోల్చితే సెప్టెంబరు వసూళ్లు 1.5ు అధికంగా ఉన్నాయి. దేశంలో జీఎస్టీ-2.0 సంస్కరణలు గత నెల 22 నుంచి అమలులోకి వచ్చాయి. ఫలితంగా 375 నిత్యావసర వస్తువులు సహా వస్తు సేవలు, ఆటోమొబైల్స్‌, గృహోపకరణాల వస్తువుల ధరలు దిగి వచ్చాయి. ఫలితంగా వాటికి డిమాండ్‌ పెరిగి విక్రయాలు పుంజుకున్నాయని మార్కెట్‌ నిపుణులు తెలిపారు.


నికర జీఎస్టీ కూడా..

గత నెలలో స్థూల జాతీయాదాయం 6.8 శాతం మేరకు పెరిగి రూ.1.36 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు దిగుమతుల ద్వారా పన్ను రాబడి కూడా 15.6ు వృద్ధి చెంది.. రూ.52,492 కోట్లుగా నమోదైంది. ఇక, జీఎస్టీ రిఫండ్లు కూడా 40.1ు మేరకు పెరిగి రూ.28,657 కోట్లుగా నమోదయ్యాయి. నికరంగా జీఎస్టీ వసూలు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే ఇది 5ు అధికమని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాలపై డెలాయిట్‌ పార్టనర్‌ ఎం.ఎస్‌. మణి స్పందిస్తూ.. జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించలేదనడానికి ఈ వసూళ్లు నిదర్శనమని తెలిపారు. సెప్టెంబరు వసూళ్లతో ఈ ఏడాది ఇప్పటివరకు సగటు పన్నుల రాబడి రూ.2 లక్షల కోట్లకు చేరువలో ఉన్నట్టు చెప్పారు.

ఏపీలో ఇలా పెరిగింది!

  • రాష్ట్రాల వారీగా చూస్తే.. ఏపీలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే 4 శాతం మేరకు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరులో రూ.3,506 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ప్రస్తుతం రూ.3,653 కోట్లకు చేరింది.

  • తెలంగాణలో మాత్రం జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గాయి. గత ఏడాది సెప్టెంబరులో తెలంగాణలో రూ.5,267 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది రూ.4,998 కోట్లు మాత్రమే వచ్చాయి.

Updated Date - Oct 02 , 2025 | 04:19 AM