Farmers: ఆదుకోండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:49 AM
మొంథా తుఫాన్ ఏపీకి అంచనాలకు మించిన నష్టాన్ని కలిగించిందని, తక్షణ సాయంగా రూ.901.4 కోట్లు అందించాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది.
మొంథాతో అంచనాకు మించి అపార నష్టం
రూ.901 కోట్ల తక్షణ సాయం అందించండి
కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి
ప్రజెంటేషన్ ఇచ్చిన రెవెన్యూ, ‘విపత్తు’ శాఖలు
నాలుగు జిల్లాల్లో బృందం పర్యటన
దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు
(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్)
మొంథా తుఫాన్ ఏపీకి అంచనాలకు మించిన నష్టాన్ని కలిగించిందని, తక్షణ సాయంగా రూ.901.4 కోట్లు అందించాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని వివరించింది. తుఫాన్ నష్టాన్ని మదింపు వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమీ బసు నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి వచ్చింది. సోమవారం ఉదయం సచివాలయంలోని ఆర్టీజీఎ్‌సలో తుఫాన్ ప్రభావం, నష్టం, సహాయచర్యలపై రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి, విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను కేంద్రబృందం తిలకించింది. అనంతరం పలు జిల్లాల్లో పర్యటించి తుఫాన్ నష్టాన్ని అంచనా వేసింది. మొంథా తుఫాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల పరిధిలోని 443 మండలాల్లో ప్రభావం చూపిందని, ముగ్గురు చనిపోయారని తెలిపారు. వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలిగిందని, కోతదశలో ఉన్న పంటలను ముంచేసిందని తమ ప్రజెంటేషన్‌లో జయలక్ష్మి, ప్రఖర్ జైన్ తెలిపారు. 1.61 లక్షల హెక్టార్లలో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, 6,250 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 17.72 హెక్టార్లలో మలబరీ తోటలు, 3,063 హెక్టార్లలో చేపల చెరువులు ధ్వంసమయ్యాయని తెలిపారు. 4,566 ఇళ్లు, 1,853 పాఠశాలలు, 4,794 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 311 వంతెనలు, కల్వర్టులు, 3,437 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 2,417 మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. 58 మున్సిపల్ పట్టణాల్లో మౌలికవసతులు దెబ్బతిన్నాయని వివరించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టినట్లు తెలిపారు. 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.
జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
కేంద్ర బృందం సభ్యులు రెండు టీమ్‌లుగా ఏర్పడి, ఒకటి ప్రకాశం జిల్లాలో, రెండోది ఏలూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి నష్టం తీవ్రత అంచనా వేశారు. తుఫాన్ నష్టాలపై ప్రకాశం కలెక్టర్ రాజాబాబు వివరించారు. అనంతరం కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో దెబ్బతిన్న పంటలు, ఆక్వా చెరువులను బృందం పరిశీలించింది. ఏలూరు జిల్లాలో పలు చోట్ల దెబ్బతిన్న పంటలను, పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంది. 5,703 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ వెట్రిసెల్వి నివేదించారు. 80 శాతం పంట దెబ్బతిందని కృష్ణా జిల్లా అధికారులు వివరించారు.