Share News

AP Police Performance: సత్వర న్యాయం, పటిష్ఠ పోలీసింగ్‌లో ఏపీ భేష్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 03:45 AM

ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో, పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు గతం కంటే చాలా మెరుగైంది. ఈ విషయం శనివారం విడుదలైన ఇండియా...

AP Police Performance: సత్వర న్యాయం, పటిష్ఠ పోలీసింగ్‌లో ఏపీ భేష్‌

  • ఇండియా జస్టిస్‌ రిపోర్టులో 2025లో 2 వ స్థానం

  • వైసీపీ హయాంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం

  • నాటి పాలకుల నిర్వాకంతో 2022లో 5వ స్థానం

  • కూటమి రాకతో గాడినపడ్డ శాంతిభద్రతలు

  • జైళ్ల శాఖ పనితీరులో 4వ ర్యాంకు

  • పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యంలో ఏపీ టాప్‌

  • ఖైదీల సంక్షేమంలోనూ మన రాష్ట్రమే బెస్ట్‌

  • అగ్రస్థానంలో నిలబెడతాం: సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సత్వర న్యాయం అందించటంలో, పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు గతం కంటే చాలా మెరుగైంది. ఈ విషయం శనివారం విడుదలైన ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ - 2025లో స్పష్టమైంది. జాతీయ స్థాయిలో ఆ రిపోర్టు ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇండియా జస్టిస్‌ రిపోర్టును 2019 నుంచి టాటా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన నివేదిక నాలుగోది. సుదీర్ఘ అధ్యయనం తర్వాత రాష్ట్రాలకున్న సత్వర న్యాయాన్ని వెలువరించే సామర్థ్యాన్ని అంచనా వేసి ఈ నివేదికను విడుదల చేస్తారు. ముఖ్యంగా పోలీసు, న్యాయ, జైళ్ల శాఖల పనితీరుతో పాటు బాధితులకు న్యాయ సహాయం(లీగల్‌ ఎయిడ్‌) అందుతున్న తీరును అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. రాష్ట్రాల మానవహక్కుల కమిషన్ల పనితీరునూ అధ్యయనం చేసి నివేదికలో పొందుపరిచారు. పోలీసుశాఖ పనితీరు పరంగా ఏపీ 2వ స్థానంలో ఉంది. జైళ్ల శాఖ పనితీరులో 4వ స్థానంలో, న్యాయశాఖ పనితీరులో 5వ స్థానంలో, లీగల్‌ ఎయిడ్‌ పరంగా 5వ స్థానంలో ఉంది.


5వ స్థానం నుంచి 2వ స్థానానికి

వైఎస్‌ జగన్‌ హయాంలో రాజకీయ ప్రతీకారాలు, ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్‌ చేసేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. దీంతో 2022లో ఇచ్చిన ఇండియా జస్టిస్‌ రిపోర్టు ర్యాంకుల్లో వెనకబడి ఏపీ 5వ స్థానానికి పడిపోయింది. 2019 నుంచి 2024 వరకు సత్వర న్యాయంతో పాటు ఇతర అంశాల్లో వెనుకబడిన రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాడిన పడిందని, చట్టబద్ధ పాలన తిరిగి వచ్చిందని ఇండియా జస్టిస్‌ రిపోర్టు వెల్లడించింది. పోలీసింగ్‌తో పాటు న్యాయసహకారాన్ని అందించటంలో ఏపీ పనితీరు మెరుగైనట్టు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పోలీసింగ్‌, న్యాయవ్యవస్థ పనితీరు, సామాజిక, చట్టపరమైన పాలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీకి ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం పది పాయింట్లకు 6.78 స్కోర్‌తో జాబితాలో మొదటి స్థానాన్ని కర్ణాటక దక్కించుకుంది. 6.32 స్కోరుతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తెలంగాణ, కేరళ, తమిళనాడు వరుసగా ఉన్నాయి.


ఖైదీల సంక్షేమంలోనూ టాప్‌

ఖైదీల సంక్షేమం విషయంలోనూ ఏపీ టాప్‌లో ఉంది. ఒక ఖైదీకి రోజుకి రూ. 500 ఖర్చు చేస్తూ ఏపీ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకన్నా ముందు వరుసలో ఉంది. పోలీసు శాఖలో ఖాళీల భర్తీ విషయంలోనూ ఏపీ మెరుగ్గా ఉంది. పోలీసు కానిస్టేబుల్స్‌, పోలీసు అధికారుల ఖాళీలు జాతీయ సగటు కన్నా ఏపీలోనే తక్కువగా ఉన్నాయి. ఏపీలో కేవలం 10 శాతం మాత్రమే ఖాళీలు ఉండగా, తెలంగాణలో 13 శాతం ఖాళీలు ఉన్నాయి. అలాగే పోలీసు అధికారుల్లో ఎస్టీ కోటాను పూర్తిస్థాయిలో భర్తీ చేసిన ఘనత ఏపీకి దక్కింది. పోలీసు శాఖలో ఎస్సీ అధికారుల ఖాళీలు ఏపీలో 10 శాతం ఉండగా, తెలంగాణలో 11 శాతం ఉన్నాయి. ఏపీ పోలీసు శాఖలో మహిళల భాగస్వామ్యం 22 శాతం ఉంది. ఇది దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువ. తెలంగాణలో మహిళల భాగస్వామ్యం 9 శాతం మాత్రమే.


ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం: చంద్రబాబు

ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో ఏపీని నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయ సహాయం, పోలీసింగ్‌ సహా వివిధ విభాగాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశంలో రెండో స్థానంతో ఏపీ కీలకమైన మైలురాయిని అందుకున్నా.. సంతృప్తి చెందడంలేదన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే వరకు నిర్విరామంగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.


నివేదికలోని ఆసక్తికర అంశాలు..

  • గత మూడేళ్లుగా పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి మూడు కేసుల్లో ఒక కేసు పెండింగ్‌లో ఉంటోంది.

  • ఏపీలోని 58 శాతం పోలీసుస్టేషన్లలో మాత్ర మే ఒక్కటైనా సీసీ కెమెరా ఉంది. మిగిలిన పోలీసుస్టేషన్లలో సీసీ కెమెరాలు లేవు.

  • దేశవ్యాప్తంగా మిగిలిన పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పోస్టుల ఖాళీలు ఏపీలోనే చాలా తక్కువగా ఉన్నాయి. హైకోర్టులో 19 శాతం, జిల్లా కోర్టుల్లో 12ు ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

  • న్యాయ సహాయానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉంది.

Updated Date - Aug 10 , 2025 | 03:47 AM