Visakhapatnam Summit: 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:56 AM
జగన్ హయాంలో 2019-24 మధ్య తిరోగమన విధానాలతో పారిశ్రామికరంగం స్తంభించింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవాటినీ తరిమివేశారు. ఇలాంటి తరుణంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది.
613 ఎంవోయూలతో 16 లక్షలకు పైగా ఉద్యోగాలు!
విశాఖ సదస్సుకు వెల్లువెత్తిన కంపెనీలు
3 రోజులుగా పారిశ్రామికవేత్తలతో సీఎం విస్తృత సమావేశాలు
సదస్సును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
లోకేశ్, భరత్ సహా పలువురు మంత్రుల మోహరింపు
కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు.. కేంద్ర మంత్రి గోయల్ రాక
జగన్ హయాంలో వెళ్లిపోయిన కంపెనీలూ తరలివచ్చాయి
ఓవైపు ఎంవోయూల మార్పిడి.. ఆ వెంటనే ప్రోత్సాహక జీవోలు
పరిశ్రమల్లో నమ్మకం పెంచిన ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’
రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తింది. విశాఖ మహానగరంలో శుక్ర, శనివారాల్లో సీఐఐ నిర్వహించిన 30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఇందుకు వేదికైంది. రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రప్రభుత్వంతో ఏకంగా 613 అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకున్నాయి. ఇవి సాకారమైతే 16,31,188 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సహజంగా సదస్సు ప్రారంభమయ్యాక పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకుంటారు. కానీ విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే.. గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోవడం గమనార్హం. అన్నిటికీ మించి.. ఒప్పందాలు చేసుకున్న వెంటనే.. ఆయా పారిశ్రామిక సంస్థలకు ప్రోత్సాహకాలిస్తూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయడం పారిశ్రామికవేత్తల్లో ఉత్తేజం నింపింది. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం.. వారిలో సంతృప్తితో పాటు నమ్మకాన్ని కూడా పెంచింది.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో 2019-24 మధ్య తిరోగమన విధానాలతో పారిశ్రామికరంగం స్తంభించింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవాటినీ తరిమివేశారు. ఇలాంటి తరుణంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక.. గత సర్కారు సృష్టించిన విధ్వంసాన్ని పారిశ్రామికవేత్తలు మరచిపోయి.. తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చింది. చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లినప్పుడు.. రాష్ట్రంలో సుస్థిర పాలన ఉందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం చేపడుతున్నామంటూ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పేందుకే సమయమంతా వెచ్చించాల్సి వచ్చింది. పెట్టుబడులను సాధించే లక్ష్యంతో సింగపూర్, అమెరికా తదితర దేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ రోడ్‌షోలు నిర్వహించారు. పెట్టుబడుల రక్షణకు తాము చేపడుతున్న చర్యలు, కల్పిస్తున్న వసతులు, ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను ముఖతా వివరించారు. విశాఖలో సీఐఐ భాగస్వామ్యంతో సదస్సు చేపడుతున్నామని.. పెట్టుబడులతో తరలి రావాలని ఆహ్వానించారు.
కేంద్రం మద్దతుతో ఊపు
విశాఖ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో మరింత ఉత్సాహంగా.. పెట్టుబడుల రక్షణకు, సుస్థిర ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహకాలకు రూపమిచ్చింది. మంత్రులు లోకేశ్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, పి.నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, ఎం.రాంప్రసాదరెడ్డి విశాఖలోనే మోహరించి.. సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులన్నీ కల్పించారు. తమ తమ శాఖల పరిధిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విశదీకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సదస్సులో స్వయంగా పాల్గొన్నారు. ఢిల్లీ తరహాలో రాష్ట్రంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల కోసం ప్రత్యేక వేదిక రూపకల్పనకు సూచించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందుకు విశాఖ రుషికొండ అనువైనదని పీయూ్‌షకు సూచించారు. ఇంకోవైపు.. కూటమి ప్రభుత్వ సమష్టితత్వం ఈ సదస్సులోనూ ప్రస్ఫుటమైంది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫు ప్రతినిధిగా రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అదానీ, రెన్యూ, యాక్సిస్, చింతా, హీరో, రిలయన్స్, బజాజ్ వంటి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన లులూ గ్రూపు తదితర సంస్థలు తిరిగి రాష్ట్రానికి రావడమే గాక రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకోవడం విశేషం. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పాదుగొల్పడానికి.. వారికివ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా అందించడానికి ప్రత్యేకంగా ఎస్ర్కో ఖాతాను తెరుస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీని నుంచి నిర్దిష్ట సమయంలో పరిశ్రమల ఖాతాల్లో నేరుగా రాయితీల సొమ్ము జమయ్యే సౌకర్యం కల్పించారు.
సదస్సు జరిగిందిలా..
విశాఖ సదస్సులో 45 దేశాలకు చెందిన 4,975 మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో అంతర్జాతీయ ప్రతినిధులు 640 మంది, దేశీయ ప్రతినిధులు 1135 మంది, దౌత్యవేత్తలు 185 మంది, ఎంవోయూల భాగస్వాములు 1,575 మంది ఉన్నారు. రాష్ట్ర అధికారులతో కలిపితే ఈ సంఖ్య 5,587కి చేరింది. రెండ్రోజుల సదస్సులో 41 సెషన్స్ జరిగాయి. 190 మంది ప్రసంగించారు. ఇందులో ప్లీనరీ సెషన్లు 26, రాష్ట్ర సెషన్లు 11, దేశీయ సదస్సులు 4 జరిగాయి. ముఖ్యమంత్రి 24 ద్వైపాక్షిక సమావేశాల్లో, 16 బిజినెస్ భేటీల్లో పాల్గొన్నారు. ఎంవోయూల కార్యక్రమాలకూ హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఫైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
బీఆర్ఎస్ అగ్ర నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.. కవిత షాకింగ్ కామెంట్స్