School Education Department: వారికి ఒక భాషా సబ్జెక్ట్ మినహాయింపు!
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:29 AM
ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్ విద్యార్థుల విషయంలో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు కలిగిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మినహాయింపు ప్రస్తుతం ఆప్షనల్‌గా ఉంది. మినహాయింపు పొందిన విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మినహాయింపుతో పాటు నాలుగు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల సగటును మినహాయింపు పొందిన సబ్జెక్టుకు కేటాయిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కుష్టు, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితులు, మరగుజ్జు, అంధులు, దృష్టి, వినికిడి లోపం ఉన్నవారు, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, క్రానిక్ న్యూరోలాజికల్, రక్త సంబంధిత వ్యాధులు కలిగిన వారికి ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. రెండు భాషా సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిని విద్యార్థులు మినహాయింపుగా పొందవచ్చు. ఈ విధానాన్ని ఇకపై శాశ్వతంగా అమలు చేసేందుకు ఈ ఉత్తర్వులు జారీచేశారు.