Share News

AP High Court: లోక్‌ అదాలత్‌లో కేసుల రాజీపై మార్గదర్శకాలు రూపొందించండి

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:32 AM

అక్రమాలను అరికట్టేందుకువీలుగా రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యే కేసుల విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ ఏపీ సాధు పరిషత్‌...

AP High Court: లోక్‌ అదాలత్‌లో కేసుల రాజీపై మార్గదర్శకాలు రూపొందించండి

  • పరకామణి చోరీ కేసు నిందితుడితో సతీశ్‌కుమార్‌ రాజీ చట్టవిరుద్ధం

  • ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోండి

  • ఈ కేసులో మా వాదనలు కూడా వినండి

  • హైకోర్టులో ఏపీ సాధు పరిషత్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అక్రమాలను అరికట్టేందుకువీలుగా రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యే కేసుల విషయంలో సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ ఏపీ సాధు పరిషత్‌ హైకోర్టును ఆశ్రయించింది. రాజీ చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికున్న అధికారం, కేసు విచారణార్హత, చట్టబద్ధత తదితర విషయాలను క్షుణంగా పరిశీలించేలా మార్గదర్శకాలు ఉండేలా చూడాలని కోరారు. టీటీడీ పరకామణిలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్‌ ఎం.శ్రీనివాసులు వేసిన పిటిషన్‌లో భాగం చేసుకుని, తమ వాదనలు కూడా వినాలని పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు, టీటీడీ పట్ల మోసపూరితంగా లోక్‌ అదాలత్‌లో కేసును రాజీ చేసుకున్న అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ అధికారి(ఏవీఎ్‌సవో) వై.సతీశ్‌కుమార్‌పై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించాలని, ఇందుకు వీలుగా అంతర్గత విచారణకు ఆదేశించాలని కోరారు. ‘సతీశ్‌కుమార్‌కు టీటీడీ ఆస్తులపై ఎలాంటి హక్కూలేదు. ఆయన ఉద్యోగి మాత్రమే. వ్యక్తిగత హోదాలో కేసును రాజీ చేసుకోవడానికి వీల్లేదు. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్‌తో రాజీ చేసుకోవడం వెనుక పెద్ద రాకెట్‌ ఉన్నట్టు కనపడుతోంది. దీనివెనుక ఉన్న వ్యక్తుల ముసుగులు తొలగించకుండా ఇలాంటి చోరీలను నిలువరించలేం’ అని పేర్కొన్నారు.

కేసు రాజీ వెనుక దురుద్దేశం లేదు: సతీశ్‌కుమార్‌ కౌంటర్‌

పరకామణిలో చోరీ కేసులో రాజీ చేసుకోవడం వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని టీటీటీ పరకామణి అప్పటి ఏవీఎ్‌సవో సతీశ్‌కుమార్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. చట్టప్రకారం రాజీ చేసుకోదగిన కేసు అయినందనే లోక్‌ అదాలత్‌లో ఆ ప్రక్రియను పూర్తిచేశామన్నారు. రవికుమార్‌ పరకామణిలో దొంగతనం చేస్తుండగా పట్టుకొని తానే ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫిర్యాదుదారును తానే అయినందున కేసు రాజీ అయిందన్నారు. సీఆర్‌పీసీ, ఐపీసీలో కేసు రాజీ పై ఎలాంటి నిషేధం లేదని పేర్కొన్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి, రాజీ చేసుకోవడానికి సంబంధిత శాఖాధిపతులకు అధికారం ఉందని, ఇందుకు పాలకమండలి అనుమతి అవసరం లేదని తెలిపారు. ఊహాజనిత, నిరాధార ఆరోపణలతో వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సతీశ్‌కుమార్‌ కోరారు.

Updated Date - Oct 26 , 2025 | 05:32 AM