Minister BC Janardhan Reddy: 3 వేల కోట్లతో పనులు
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:27 AM
రాష్ట్రవ్యాప్తంగా జనవరి చివరి నాటికి గుంతలు లేని రహదారులుగా మారుస్తామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా గుంతలు పడిన రోడ్లు ఉండకూడదన్న.....
జనవరి చివరి నాటికి గుంతలు లేని రోడ్లు: మంత్రి జనార్దన్‌రెడ్డి
మదనపల్లె, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జనవరి చివరి నాటికి గుంతలు లేని రహదారులుగా మారుస్తామని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా గుంతలు పడిన రోడ్లు ఉండకూడదన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు పని చేస్తున్నారన్నారు. సోమవారం మదనపల్లెకు విచ్చేసిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహాన్ బాషాతో కలసి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ... ‘రాష్ట్రంలో 27 వేల కి.మీ. రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు ప్రభుత్వం రూ.3,000 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తిచేయగా, మిగిలిన పనులను కూడా గడువులోగా పూర్తిచేస్తాం. అన్నమయ్య జిల్లాలో 2,148 కి.మీ. మేర గుంతల పూడ్చివేతకు రూ.123 కోట్లు మంజూరు చేశాం. స్థానిక ఎమ్మెల్యే వినతి మేరకు మదనపల్లె నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు, మరమ్మతులకు రూ.18 కోట్లు మంజూరు చేశాం. అసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ఆశాఖ అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.