AP Residents: క్షేమంగా వచ్చేశారు
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:23 AM
అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్‌లో చిక్కుకుని... బితుకు బితుకుమంటూ గడిపిన ఏపీ వాసులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి లోకేశ్ స్వీయ పర్యవేక్షణ..
కల్లోల నేపాల్ నుంచి స్వస్థలాలకు
ప్రత్యేక విమానంలో ఏపీ వాసుల తరలింపు
విశాఖకు 104 మంది, తిరుపతికి 40 మంది
ఎయిర్‌పోర్టుల్లో స్వాగతం పలికిన నేతలు
చంద్రబాబు, లోకేశ్‌కు బాధితుల కృతజ్ఞతలు
మంత్రి లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం
బాధితుల భావోద్వేగం...
నేపాల్‌లో భయంభయంగా గడిపి... తిరిగి క్షేమంగా వస్తామో లేదో అని ఆందోళన చెందిన బాధితులు సొంత గడ్డపై అడుగు పెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. నేపాల్ నుంచి సురక్షితంగా తమను తీసుకువచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు రోజుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. విశాఖ విమానాశ్రయంలో లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అమరావతి/విశాఖపట్నం/తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్‌లో చిక్కుకుని... బితుకు బితుకుమంటూ గడిపిన ఏపీ వాసులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి లోకేశ్ స్వీయ పర్యవేక్షణ, ఉన్నతాధికారుల సమన్వయంతో క్షేమంగా సొంతగడ్డపై దిగారు. విహార/తీర్థ యాత్రలకు నేపాల్‌కు వెళ్లి... అక్కడ కఠ్మాండూ, హెటౌడా, పోఖారా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులను ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా గురువారం రాత్రికి రాష్ట్రానికి తీసుకువచ్చారు. గురువారం వరుసగా రెండోరోజున మంత్రి లోకేశ్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకుని తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గత రెండు రోజులుగా లోకేశ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్ రాయబార కార్యాలయం, రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గురువారం కఠ్మాండూ విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు.

‘‘ఇది ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవ తీసుకుని దీన్ని ఏర్పాటు చేశారు’’ అని ఎయిర్ హోస్టెస్ ప్రకటించారు. ఆ వెంటనే ప్రయాణికులంతా... హర్షధ్వానాలతో చంద్రబాబు, లోకేశ్‌కు జేజేలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘మేం బయలుదేరాం. వస్తున్నాం’ అంటూ సెల్ఫీ వీడియోలు తీసి సన్నిహితులకు సమాచారం పంపించారు. ఈ ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. వీరిలో 104 మంది విశాఖలో దిగారు. వీరిలో... విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, గుంటూరు తదితర జిల్లాలకు చెందినవారు ఉన్నారు.
3 గంటలు ఆలస్యంగా...: విశాఖ ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 3గంటలకు రావాల్సిన విమానం సాయంత్రం 6 గంటలకు వచ్చింది. వీరికోసం కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు 5గంటల నుంచే లాంజ్‌లో కూర్చొని ఎదురుచూశారు. బాధితులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితర నేతలు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తదితరులు స్వాగతం పలికారు. తినుబండారాలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. అందరూ క్షేమంగా వచ్చినందుకు హర్షం వ్యక్తంచేశారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో అందరినీ స్వస్థలాలకు పంపించారు.
తిరుపతికి 40 మంది
విశాఖ నుంచి అదే విమానం 40 మందితో రాత్రి 10.55 గంటలకు తిరుపతికి చేరుకుంది. వారికి కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీవారి ప్రసాదాలను, శ్రీకాళహస్తి ప్రసాదాలను అందించారు. రాజంపేట, కోడూరు, కడప, నంద్యాలకు చెందిన వారిని స్వస్థలాల వద్ద విడిచి పెట్టేందుకు ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేశారు. మిగిలిన వారికోసం 12 కార్లను సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం సహకారం, ప్రత్యేకంగా మంత్రి లోకేశ్ చొరవ లేకుంటే తాము తిరిగి స్వదేశానికి చేరుకునే వాళ్లం కాదని, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని బాధితులు చెప్పారు. ఇక... హెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బిహార్ సరిహద్దు వద్ద మన దేశంలోకి ప్రవేశించారు. సిమికోట్ నుంచి విమానం ద్వారా 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్‌కు తరలించారు. వీరంతా వాహనాల్లో తొలుత లఖ్‌నవూకు, అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. నేపాల్ నుంచి చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి తీసుకువచ్చే వరకు ఏపీ భవన్, ఆర్టీజీఎస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లను కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.