AP Reports: మొంథా నష్టం రూ.6,352 కోట్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:39 AM
ఇటీవల సంభవించిన మొంథా తుఫాను వల్ల ఏపీలో అన్నిరంగాలకూ కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్...
అమిత్ షా, శివరాజ్‌సింగ్‌లతో మంత్రులు లోకేశ్, అనిత భేటీ
తుఫాను నష్టంపై నివేదిక అందజేత
తక్షణ ఉపశమనం కోసం
రూ.902 కోట్లు అవసరమని వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇటీవల సంభవించిన మొంథా తుఫాను వల్ల ఏపీలో అన్నిరంగాలకూ కలిపి రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత వివరించారు. మంగళవారం అమిత్ షాతో పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో లోకేశ్, అనిత భేటీ అయి మొంథా తుఫాను నష్టంపై నివేదిక అందజేశారు. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అవసరమని అన్నారు. గత నెల 12వ తేదీన తాము సమర్పించిన నివేదికపై కేంద్రమంత్రుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని లోకేశ్ పేర్కొన్నారు. తుఫాను సమయంలో 1.92 లక్షల మందిని 2,471 పునరావాస శిబిరాలకు తరలించి, ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.3వేల చొప్పున అందించామని, కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టామని తెలిపారు. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు.
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌తో భేటీ..
మొంథా తుఫాను 24 జిల్లాల్లోని 443 మండలాల పరిధిలో 3,109 గ్రామాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి లోకేశ్, అనిత వివరించారు. శివరాజ్‌సింగ్‌తో ఆయన నివాసంలో వారు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు 9.53 లక్షల మంది ప్రజలు తుఫాను వల్ల నష్టపోయారన్నారు. 1.61 లక్షల హెక్టార్లలో పంటలు (వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కంది పప్పు, సిరిధాన్యాలు మొదలైనవి) దెబ్బతిన్నాయని, 3.27 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారని వెల్లడించారు. ఉత్పత్తి నష్టాలు సుమారు 4.36లక్షల మెట్రిక్ టన్నులు అని తెలిపారు. సుమారు 6,250 హెక్టార్లలో (33శాతం కంటే అధికం) అరటి, బొప్పాయి, కొబ్బరి, పసుపు, మిరప, కూరగాయలు, పూలు, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ పర్యటనలో నారా లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, సానా సతీశ్, కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, బస్తీపాటి, మాగుంట, వేమిరెడ్డి, జీఎం హరీశ్ తదితరులున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్‌సింగ్‌లతో భేటీకి ముందు లోకేశ్ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
‘జీఎంఆర్’ అధికారులతో మంత్రి లోకేశ్ భేటీ
ఏపీలో ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధిపై చర్చ.. ప్రణాళిక ఖరారు
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విమానాశ్రయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో అంతర్జాతీయంగా పేరున్న జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి లోకేశ్ ఢిల్లీలో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించి ఏవియేషన్ ఎడ్యుసిటీ మొత్తం అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేశారు. ఈ ఎడ్యుసిటీని జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్‌గా మారడంతో పాటు ఏపీ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులు ఎస్జీకే కిశ్‌ర్, సి.ప్రసన్న, పీయూష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.