Share News

Krishna Water Dispute: మీకు ఆ అధికారమే లేదు

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:37 AM

కృష్ణా జలాలపై ఆధారాల్లేకుండా తెలంగాణ చేస్తున్న వాదనలకు విలువ లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.

Krishna Water Dispute: మీకు ఆ అధికారమే లేదు

  • నీటి కేటాయింపులను తిరగదోడేందుకు వీల్లేదు!

  • కృష్ణా ట్రైబ్యునల్‌-2కు ఆంధ్రప్రదేశ్‌ స్పష్టీకరణ.. ఆధారాల్లేని తెలంగాణ వాదనలకు విలువ లేదు

  • ఏ ప్రాజెక్టు నీటి కేటాయింపునూ మార్చకూడదు.. తొలి నుంచీ వాదనలు వింటామంటే కుదరదు

  • విభజన చట్టం సెక్షన్‌ 89లో పేర్కొన్న కేటాయింపులను మార్చేందుకు వీల్లేదు

  • తెలంగాణ కొత్తగా పుట్టిన బిడ్డ కాదు.. వందేళ్ల నుంచే ప్రాజెక్టులకు కేటాయింపులున్నాయి

  • ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయాలకు తెలంగాణ బాధ్యత వహించాల్సిందే

  • కావేరి వివాదంతో కృష్ణా వివాదానికి పొంతన లేదు.. బలమైన వాదనలు వినిపించిన

  • సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా.. నేడు, రేపూ కొనసాగనున్న విచారణ

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలపై ఆధారాల్లేకుండా తెలంగాణ చేస్తున్న వాదనలకు విలువ లేదని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది. ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను మా ర్చే అధికారం కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌-2కు లేదని తేల్చిచెప్పింది. తెలంగాణ ప్రాజెక్టులకు అదనంగా ఎందుకు నీటిని కేటాయించాలో ఆ రాష్ట్రం చెప్పడం లేదని.. అదే విధంగా ఏ ప్రతిపాదన మేరకు.. ఏ తీర్పుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నీటి వాటాలో కోత పెట్టాలో స్పష్టం చేయలేకపోతోందని తెలిపింది. ఇలాంటి వాదనలకు విలువ ఉంటుందా అని ప్రశ్నిస్తూ జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ సారథ్యంలోని కృష్ణా ట్రైబ్యునల్‌-2 ముందు బలమైన వాదనలు వినిపించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపులను పునఃసమీక్షించాలన్న తెలంగాణ అభ్యర్థనతో 2023లో కేంద్రం ఇచ్చిన గెజిట్‌ మేరకు ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదనలు ఇప్పటికే ముగియగా.. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా మంగళవారం వాదనలు వినిపించారు. ఒక్క ప్రాజెక్టుకూ నీటి కేటాయింపులను మార్చేందుకు వీల్లేదన్నారు. ‘కేటాయింపులపై తొలి నుంచీ వాదనలు వింటామంటే కుదరదు. ఈ కేటాయింపుల జోలికి వెళ్లేందుకు ట్రైబ్యునల్‌కు అధికారమే లేదు. విభజన చట్టంలోని సెక్షన్‌ 89.. సబ్‌పేరా 4.1 ప్రకారం.. కృష్ణా జలాల కేటాయింపులను తిరగదోడేందుకు, మార్చడానికి వీల్లేదు’ అని తేల్చిచెప్పారు. తెలంగాణ కొత్తగా పుట్టిన బిడ్డేమీ కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిందని.. రాజధాని హైదరాబాద్‌ను కూడా కోల్పోయిందని గుర్తుచేశారు.


ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలంగాణ కూడా బాధ్యత వహించాల్సిందేనన్నారు. వందేళ్ల క్రితం నుంచే కృష్ణా ప్రాజెక్టులకు కేటాయింపులున్నాయని ఆధారాలతో ట్రైబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లారు. కావేరి జలవివాదానికి, కృష్ణా జలాల వివాదానికి పొంతన లేదన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌-1, ట్రైబ్యునల్‌-2లో ఇప్పటికే ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగిపోయాయని గుర్తుచేశారు. వాటిపై పునఃసమీక్ష జరిపే అధికారం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు లేదన్నారు. ‘విభజన చట్టం మేరకు కొద్ది మార్పులకు వీలున్నా.. నదీ జలాల విషయంలో జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్‌కు లేదు. గత ట్రైబ్యునళ్లు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం తప్ప.. మార్పులూ చేర్పులూ చేసేందుకు దానికి అధికారం ఉండదు. 2002కి ముందున్న కేటాయింపుల జోలికి వెళ్లేందుకు వీల్లేదు. ఫర్‌దర్‌ టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (ఎఫ్‌టీవోర్‌)ను మార్చేందుకు కూడా వీల్లేదు. ట్రైబ్యునల్‌-1 చేసిన కేటాయింపులను బట్టి ప్రాజెక్టులను నిర్మించినట్లుగానే భావించాల్సి ఉంటుంది’ అని గుప్తా తేల్చిచెప్పారు. మంగళవారం నాటి విచారణకు వైద్యనాథన్‌ కూడా హాజరయ్యారు. బుధ, గురువారాల్లో కూడా ట్రైబ్యునల్‌ విచారణ కొనసాగనుంది.

Updated Date - Nov 26 , 2025 | 04:38 AM