Share News

AP Police Warn of Maoist Retaliation: ప్రతీకార దాడులకు చాన్సు!

ABN , Publish Date - Nov 20 , 2025 | 05:14 AM

ఎన్‌కౌంటర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి మహేశ్‌చంద్ర లడ్డా చెప్పారు. ఎదుర్కొనేందుకు పోలీసు బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ.....

AP Police Warn of Maoist Retaliation: ప్రతీకార దాడులకు చాన్సు!

  • పూర్తి అప్రమత్తంగా ఉన్నాం: నిఘా చీఫ్‌ లడ్డా

అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి మహేశ్‌చంద్ర లడ్డా చెప్పారు. ఎదుర్కొనేందుకు పోలీసు బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో రెండు వరుస ఎన్‌కౌంటర్లు, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు, ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, జిల్లాల ఎస్పీలతో కలిసి ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 2026 మార్చినాటికి మావోయిస్టు రహిత భారతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రభావిత రాష్ట్రాల బలగాలతో కలిసి ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిందన్నారు. దండకారణ్యంలో మావోయిస్టులను సాయుధ బలగాలు వెంటాడుతున్నాయని.. వారు ప్రాణ భయంతో చెల్లాచెదురై సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారని తెలిపారు. ‘అందులో భాగంగానే రెండు నెలల నుంచి ఏపీ వైపు కూడా వస్తున్నారు.. మాడ్వి హిడ్మా దళంతో పాటు దక్షిణ బస్తర్‌ కమిటీ, ఛత్తీ్‌సగఢ్‌లోని స్థానిక కేడర్‌ మన రాష్ట్రంలోకి ప్రవేశించాయి.. వారి కదలికలపై పక్కా సమాచారం అందుకుని పూర్తి నిఘా పెట్టాం.. ఇక్కడ సురక్షితంగా ఉందని హిడ్మాకు వీరి నుంచి సమాచారం అందిన తర్వాత ఈ నెల 17న ఏపీ వైపు ఆయన వస్తున్నట్లు పక్కా సమాచారంతో ఆపరేషన్‌ చేపట్టాం.. 18న ఉదయం మారేడు మిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కాదు’ అని స్పష్టంచేశారు. బుధవారంనాటి ఎన్‌కౌంటర్‌లో టెక్‌ శంకర్‌ సహా ఏడుగురు హతమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కట్టడి చేస్తామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న 50 మంది నక్సల్స్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను ప్రదర్శించారు. అరెస్టు చేసిన మావోయిస్టుల్లో స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యులు ముగ్గురు, డివిజనల్‌ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19మంది, 23మంది ప్లాటూన్‌ దళం ఉన్నట్లు వివరించారు. మావోయిస్టు చీఫ్‌ తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఎక్కడున్నాడో తమకు తెలీదన్నారు. ఆయన ఆయన లొంగిపోయారని, అరెస్టయ్యారని వస్తున్న వార్తలు రాష్ట్ర పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్‌సీ) సృష్టేనని కొట్టిపారేశారు. స్వాధీనం చేసుకున్నవాటిలో 39 ఆయుధాలు, 302రౌండ్ల బుల్లెట్లు, రూ.12.72లక్షల నగదు, మెమొరి కార్డులు, ఇతర కమ్యూనికేషన్‌ పరికరాలు ఉన్నట్లు తెలిపారు. యాభై మంది అరెస్టులో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా చేసిన పోలీసులను లడ్డా అభినందించారు. సమావేశంలో ఏలూరు, కృష్ణా, కాకినాడ ఎస్పీలు కేపీ శివకిశోర్‌, విద్యాసాగర్‌నాయుడు, బిందు మాధవ్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 05:14 AM