Share News

AP Police: రాజమండ్రి జైలు వద్ద..ఎట్టకేలకు పోలీసుల ఆంక్షలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:54 AM

రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద వైసీపీ శ్రేణులు, నేతల హంగామాకు తెరపడింది. జైలు ఎదుట భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

AP  Police: రాజమండ్రి జైలు వద్ద..ఎట్టకేలకు పోలీసుల ఆంక్షలు

  • సిబ్బంది సంఖ్య పెంపు.. జైలు ఎదుట రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు

  • అనధికార న్యాయవాది హుస్సేన్‌ కూడా వాటికి ఆవలే

  • మీడియానూ దూరంగా పంపేసిన వైనం

  • ములాఖత్‌ సమయంలో గంట సేపు వన్‌వే

రాజమహేంద్రవరం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద వైసీపీ శ్రేణులు, నేతల హంగామాకు తెరపడింది. జైలు ఎదుట భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎవరూ గుంపులుగుంపులుగా రాకుండా.. అక్కడే బైఠాయించకుండా ఎట్టకేలకు ఆంక్షలు పెట్టారు. సిబ్బంది సంఖ్యను పెంచారు. జైలు ఎదుట రోడ్డుపై బారికేడ్లు పెట్టారు. ముఖ్యంగా ములాఖత్‌ సమయంలో జైలు ఎదుట సుమారు అర కిలోమీటరు వరకు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ నిలిపివేస్తున్నారు. ఆ సమయంలో గంట సేపు వన్‌వే ఇచ్చారు. మద్యం కుంభకోణంలో నిందితుడైన రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (ఏ4)ను కలవడానికి అటు నేతలతో పాటు వస్తున్న వైసీపీ కార్యకర్తలు జైలు ప్రధాన గేటు ఎదురుగా బారులు తీరి నానా హడావుడి చేస్తున్నా నిన్నటిదాకా పోలీసులు పట్టించుకోలేదు. జైలు అధికారులు కూడా నిబంధనలు పాటించలేదు. అడ్డగోలుగా ములాఖత్‌లు ఇస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కొంత మార్పు కనబడుతోంది. జైలు వరకు ఎవరినీ రానివ్వకుండా బారికేడ్ల అవతలే ఆపేస్తున్నారు. ఇంతకు ముందు మీడియా ప్రతినిధులను ప్రధాన గేటు వరకూ అనుమతించేవారు. శనివారం వారిని దూరంగా పంపించేశారు. ములాఖత్‌కు వెళ్లి వచ్చేవారి ఫొటోలు తీసుకునే అవకాశం లేకుండా చేశారు. ఆంక్షలు మంచివే కానీ మీడియాను అనుమతించకపోవడం విమర్శలకు తావిచ్చింది. మిథున్‌రెడ్డిని కలిసేందుకు వచ్చేవారితో దర్జాగా లోపలకు వెళ్తున్న అనధికార న్యాయవాది హుస్సేన్‌ కూడా బారికేడ్ల ఆవలే తచ్చాడడం గమనార్హం.


మిథున్‌రెడ్డికి రాఖీ కట్టనివ్వాలని సోదరి వాగ్వాదం

మిథున్‌రెడ్డి సోదరి శక్తిరెడ్డి, తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి, మిఽథున్‌రెడ్డి చిన్నాన్న కుమారుడు పి.అభినయరెడ్డి శనివారం ములాఖత్‌కు వచ్చారు. అయితే ఆయనకు రాఖీ కట్టనివ్వలేదని శక్తిరెడ్డి, ఇతరులు జైలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ స్పందిస్తూ.. తమకు రాఖీ అని చెప్పలేదని, ఏదో లగేజీ తెస్తున్నారని భావించి అనుమతించలేదని చెప్పారు. అనంతరం గురుమూర్తి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. అసలు మద్యం స్కాం అనేదే లేదని.. రాజకీయ వేధింపులతో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మిథున్‌రెడ్డికి కనీసం రాఖీ కట్టే అవకాశం ఇవ్వలేదని, చట్టప్రకారం కల్పించాల్సిన వసతులను నిరాకరిస్తున్నారని విమర్శించారు.

Updated Date - Aug 10 , 2025 | 04:55 AM