Police Take Strict Action Against YSRCP Workers: రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్‌కు..
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:00 AM
మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లి గ్రామంలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ ....
గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్‌మెంట్
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నడి రోడ్డుపై ఊరేగింపు
రక్తాభిషేకం, రప్పా రప్పా.. బ్యాచ్ అందరిపై చర్యలు
సాధారణ ప్రజలపై దాడులు చేసిన వారిపైనా కేసులు
తూర్పు గోదావరి జిల్లాలో ఫ్లెక్సీ షాపు సీజ్.. యజమాని అరెస్టు
కదిరి, విడపనకల్లు, నల్లజర్ల, కలిదిండి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల పేరిట అరాచకానికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లి గ్రామంలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్‌ను పోలీసులు అరెస్టు చేసి కదిరి పట్టణంలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. టపాసుల మోతకు తీవ్రంగా ఇబ్బందిపడిన గర్భిణి సంధ్యారాణి.. తనకు ఇబ్బందిగా ఉందని, పక్కకు వెళ్లి కాల్చుకోవాలని కోరారు. దీంతో కోపంతో ఊగిపోయిన అజయ్ దేవ్.. ఆమె గొంతు నులిమి, కడుపుపై కాలితో తన్నాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అజయ్ దేవ్, అతని తండ్రి అంజనప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అజయ్‌దేవ్‌ను అదుపులోకి తీసుకోగా అంజనప్ప పరారీలో ఉన్నాడు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవనే సందేశం ఇచ్చేందుకే అజయ్‌ను రోడ్డుపై నడిపించామని కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో మూగ జీవాలను బలిచ్చి... జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బోయ రుద్ర, ఉప్పర రాజు, మాళాపురం ఇంద్ర, గంగాధర, సంతోశ్‌లను పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి పోలీసు జీపు ఎక్కించారు. అనంతరం ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు.
ఫ్లెక్సీ షాపు సీజ్.. యజమాని అరెస్టు
‘2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే కూటమి నేతల తలలు గంగమ్మ జాతరలో మేకపోతును నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం’ అంటూ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఫ్లెక్సీని ముద్రించిన రాయల్ ఫ్లెక్సీ షాపు యజమానిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 21న ఏలూరు జిల్లా పడమటిపాలెంలో మహిళపై దాడిచేసిన వైసీపీ కార్యకర్త సిరివెల్ల బాలుపైనా కేసు నమోదు చేశారు.