Share News

AP Police: సైబర్‌ నేరగాళ్లకు సవాల్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 03:43 AM

సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేయడం,డబ్బు రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతుండగా...

AP Police: సైబర్‌ నేరగాళ్లకు సవాల్‌

  • రికవరీలో ఏపీ పోలీసుల సత్తా.. ఆధునిక సాంకేతికతో గుర్తింపు

  • నేరగాళ్ల అరెస్ట్‌.. సొమ్మూ స్వాధీనం

  • రికార్డు స్థాయిలో అనంతపురం పోలీసులు రూ.40 లక్షల రికవరీ

  • విజయనగరంలో రిటైర్డ్‌ టీచర్‌ సొమ్ము 20 లక్షలు స్వాధీనం

  • బాపట్ల పోలీసులూ లక్షల్లో రికవరీ

  • రాష్ట్రాలు దాటి నిందితుల అరెస్ట్‌

  • గంటలోపు ఫిర్యాదు చేస్తే 90 శాతం రికవరీకి అవకాశం

  • కేంద్రం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930

పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి సైబర్‌ నేరగాళ్లు కంబోడియా నకిలీ యాప్‌ ద్వారా వల వేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నరసింహప్ప నుంచి ఏకంగా 1.73 కోట్లు లాగేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఢిల్లీ, రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక బృందాలను పంపారు. ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి 41.20 లక్షలు రికవరీ చేశారు.ఏపీలో సైబర్‌ నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన మొత్తంలో ఇదే అత్యధికం.

సైబర్‌ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. ఒకవేళ మోసపోతే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేయడం,డబ్బు రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతుండగా...పోలీసులూ ఎప్పటికప్పుడు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వారిని కట్టడి చేస్తున్నారు. ఇటీవల ప్రధానంగా అనంతపురం, బాపట్ల, విజయనగరం ప్రాంతాల్లో చేసిన రికవరీలు.. విజయవాడ, విశాఖపట్నంలో ఛేదించిన కొత్తరకం సైబర్‌ కేసులు బాధితుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.నకిలీ యాప్‌తో కంబోడియా నుంచి వల వేసి ఢిల్లీ కేంద్రంగా మ్యూల్‌ ఖాతాలు తెరిచి దొరికిన వారిని దొరికినట్లు దోచుకొంటున్న ముఠాను అనంతపురం పోలీసులు నెల రోజుల పాటు శ్రమించి ఆటకట్టించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల ఆశ చూపించి ‘వీఐపీ66 బజాజ్‌ ఇన్వె్‌స్టమెంట్‌’, ‘కే26జీరోడహ్‌ మార్కెట్‌ ఇన్‌సైట్స్‌’ పేరుతో ఫేక్‌ యాప్‌ వదిలి మొదట రాయదుర్గానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నరసింహప్ప నుంచి 12 లక్షలు పెట్టుబడి పెట్టించారు.


అతికొద్ది రోజుల్లోనే 5.50 లక్షల రూపాయలు లాభం వచ్చిందంటూ విత్‌ డ్రాకు అవకాశం కల్పించారు.ఇదే అవకాశంగా ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వరకూ విడతల వారీగా నరసింహప్ప రూ.1.74 కోట్లు పెట్టుబడి పెట్టారు.లాభాలతో కలిపి రూ.3.12 కోట్ల వరకూ అకౌంట్లో చూపించింది. విత్‌ డ్రా చేసుకోవడానికి ఆయన ప్రయత్నించగానే.. జీఎ్‌సటీ, ఆదాయపు పన్ను 40 శాతం చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు అడిగారు. ఆదాయపు పన్ను తర్వాత కదా చెల్లించాల్సిందని బాధితుడు అడగ్గా..ముందుగానే చెల్లించాలన్నారు. నరసింహప్ప వాదనకు దిగడంతో నంబర్‌ బ్లాక్‌ చేశారు. బాధితుడి గోడు విన్న అనంతపురం ఎస్పీ జగదీశ్‌ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఒక డీఎస్పీ నేతృత్వంలో సీఐలు,ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లను ఒక్కొక్కరినీ చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అనంతపురం తీసుకువచ్చారు. 41.20 లక్షలు రికవరీ చూపించారు.మిగతా సొమ్ములోనూ వీలైనంత మేరకు రికవరీ చేస్తామని అనంతపురం ఎస్పీ చెప్పారు. సైబర్‌ నేరగాళ్లతో గుడివాడ బ్యాంకు ఉద్యోగి చేతులు కలిపి మోసానికి పాల్పడిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.


నేరం కొత్త పుంతలు

ఒక వ్యక్తిని ఆపి దోచుకోవడం.. ఒక ఇంట్లో దొంగలు పడి నగదు, నగలు ఎత్తుకుపోవడం పాత పద్ధతి. మనిషి అలా ఉండగానే అతనికే తెలీకుండా అకౌంట్లో నుంచి సొమ్ము దోచుకోవడం ఇప్పుడు నయా దోపిడీ.ఇంతకుముందు చాలా వరకు పొట్ట కూటి కోసం దొంగతనాలు చేసేవారు.కానీ ఇప్పుడు పక్కా వ్యూహంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హైటెక్‌ మోసాలకు పాల్పడుతున్నారు.ఎప్పుటికప్పుడు కొత్త కొత్త పద్ధతుల్లో దోచుకుంటున్నారు.ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు.. పోలీసులు కూడా కొత్త ఎత్తుగడలు వేస్తూ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టిస్తున్నారు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.


రంగంలోకి సైబర్‌ కమాండోలు

సైబర్‌ నేరాలు కట్టడి చేసేందుకు ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక సైబర్‌ వింగ్‌ ఏర్పాటు చేసింది. సైబర్‌ కమాండోలను రంగంలో దించే ప్రయత్నంలో ఉంది. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ అరెస్టులు, ఆర్థిక మోసాలపై ఎవరు ఏ క్షణంలో ఫోన్‌ చేసినా ‘సైబర్‌ కమాండో’ సిద్ధంగా ఉంటారు. డిజిటల్‌ అరెస్టు పేరుతో ఎవరైనా సైబర్‌ నేరగాళ్లు పోలీసుల్లా ఫోన్‌ చేస్తే.. ఆ సమయంలో ఏమి చేయాలో చెబుతారు.ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌ బాబు అమలు చేశారు.ఈ సైబర్‌ కమాండోలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ సిద్ధం చేయబోతోంది. కొత్తగా పోలీసు శాఖలోకి రాబోతున్న 6,100 మంది కానిస్టేబుళ్లలో ఇంజనీరింగ్‌ చదివిన వారిని ఎంపిక చేసుకుని సైబర్‌ కమాండోలుగా తీర్చిదిద్దనుంది.ఈ విషయంపై డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిసింది.


వాట్సాప్‌ డీపీలో సీఎం ఫొటో..

వాట్సాప్‌ డీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో పెట్టి ప్రభుత్వ పథకాలు వస్తాయంటూ సైబర్‌ నేరగాళ్లు గేలం వేశారు. పథకాల సొమ్ముతో షాపింగ్‌ చేసుకోవచ్చంటూ అమాయక మహిళల్ని మోసం చేసి 66 లక్షల రూపాయలు దోచేశారు.‘జననీ సురక్ష యోజన’ పేరుతో ఫోన్‌ పే ద్వారా డబ్బులు కాజేశారు.బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ ఈ కేసును సవాల్‌గా తీసుకుని ముగ్గురు సీఐలతో బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీలో తీగ లాగితే తెలంగాణ మీదుగా జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌,రాజస్థాన్‌ దాటి ఢిల్లీలో తేలింది.దేశవ్యాప్తంగా 213 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన ఈ గ్యాంగ్‌ సుమారు 4 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు బాపట్ల పోలీసులు గుర్తించారు. ముగ్గురు కీలక నిందితులు రంజిత్‌ సింగ్‌, వెంకట నారాయణ, జితిన్‌ సాహిల్‌ను అరెస్టు చేసి లక్షలాది రూపాయల సొమ్మును రికవరీ చేశారు.


డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ..

‘మీ పేరుతో డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చింది. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నాం’అంటూ విజయనగరానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ సుజాత కుమారిని భయపెట్టి సైబర్‌ నేరగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి 40 లక్షలు దోచుకున్నారు. విజయనగరం పోలీసులు శ్రీనగర్‌, పుణె వరకూ వెళ్లి నిందితుల్ని అరెస్టు చేశారు. అద్దె ఖాతాల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల నుంచి 20 లక్షలకు పైగా రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు.జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ.. సొమ్ము కోల్పోయిన గంటలోపే బాధితురాలు 1930కు ఫిర్యాదు చేశారని తెలిపారు.గోల్డెన్‌ అవర్‌గా పిలిచే ఈ సమయంలో ఫిర్యాదు చేయడం వల్ల ఖాతాలు బ్లాక్‌ చేసి రికవరీ చేయగలిగామని వివరించారు. ఆలస్యమైతే నేరగాళ్లు గంటల వ్యవధిలోనే వేర్వేరు పేర్లతో ఉన్న ఖాతాల్లోకి లేదా ఈ వాలెట్లలోకి మళ్లించేస్తారని చెప్పారు.


1930కి ఫిర్యాదు చేయండి

రుణాలు ఇస్తామని.. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని.. డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తామని.. ఇలా నిత్యం రకరకాలుగా మాయ చేసి సైబర్‌ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు.బాధితులు వెంటనే గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఫిర్యాదు చేస్తే 90 శాతం వరకూ రికవరీకి అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.ఇందుకోసం కేంద్రం ఆలిండియా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 ఏర్పాటు చేసింది.బాధితులు ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి తమతో మాట్లాడిన వ్యక్తుల (సైబర్‌ నేరగాళ్లు) ఫోన్‌ నంబర్‌, ఫోన్‌ పే లేదా బ్యాంకు ఖాతా నంబర్‌ (డబ్బులు పంపినది) వివరాలు తెలిపితే..మోసగాళ్లు డబ్బులు డ్రా చేయకుండా ఫ్రీజ్‌ చేయవచ్చని చెబుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 03:46 AM